కొండెక్కిన కూరగాయలు


Sun,May 19, 2019 02:49 AM

-చుక్కల్లో ధరలు...
-జిల్లాలో భారీగా పడిపోయిన దిగుబడులు
-విలవిలలాడుతున్న సామాన్య ప్రజలు
-మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతులు

రెంజల్ :కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. మార్కెట్‌లో కూరగాయలేవి కొందామన్నా ధర భగ్గుమంటున్నది. కిలో టమాట రూ.40 పలుకుతున్నది. పచ్చిమిర్చి కేజీ వంద రూపాయలకు చేరుకున్నది. మిగతా ఏ కూరగాయలూ, ఆకుకూరలు తీసుకుందామన్నా కిలోకు రూ.50 నుంచి 60 ధర పలుకుతుండడంతో సామాన్య ప్రజలు కడుపునిండా భోజనం చేయలేని పరిస్థితి నెలకొంది.భూగర్భ జలాలు తగ్గడంతో జిల్లాలో కూరగాయల సాగు తగ్గింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కూరగాయలను జిల్లాకు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో ధరలు ఆకాన్నంటుతున్నాయి. దీనికి తోడు తీవ్రమైన ఎండలు ధరలపై ప్రభావాన్ని చూపుతున్నాయి.

భానుడి ప్రతాపం ఉగ్ర రూపం దాల్చడంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్య ప్రజలు కడుపు నిండాకూరగాయలతో భోజనంచేద్దామంటే వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకూ భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోవడంతో పంటల సాగుకు వీలులేకుండా పోయింది. దీంతో కూరగాయల ధరలు ఆకాశన్నంటాయి. సామాన్యుడికి అందనంత దూరమయ్యాయి. మార్కెట్‌కు రూ.100 తీసుకెళ్తే కనీసం రెండు, మూడు రకాల కూరగాయలు రావడంలేదు. వారానికి సరిపడా కూరగాయలు కావాలంటే రూ.500 చాలటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక రెక్కాడితేగాని డొక్కాడని వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో జిల్లాలో వేసవిలో అనుకున్న స్థాయిలో కూరగాయల పంటల సాగుకు రైతు ఆసక్తి చూపలేదు. బోరు బావుల్లో నీరు ఇంకి పోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గి కూర గాయల ధరలు పెరిగాయి.

రికార్డు స్థాయిలో ఎండలు.. మంట పుట్టిస్తున్న కూర గాయలు
జిల్లాలో గత ఏడాదితో పోల్చుకుంటే వేసవి తీవ్రతతో ఉష్ణోగ్రతలు ఓవైపు రికార్డు స్థాయిలో నమోదు అవుతుండగా మరోవైపు కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి కూర గాయల సాగు విస్తీర్ణం భారీగా తగ్గి పోవడంతో పాటు పొరుగు రాష్ర్టాల నుంచి కూర గాయల దిగుమతి తగ్గి పోవటంతో వినియోగదారులపై పెను భారం పడుతున్నది. ధరల పెరుగుదల జూలై నెలాఖరు వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని విక్రయదారులు అంటున్నారు. జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రత నమోదు కావడం కూరగాయల సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. వేసవి తీవ్రత వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో నష్టాల భయంతో రైతులు కూరగాయల సాగుకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం కూరగాయల సాగు సగానికిపైగా పడిపోవడంతో ఈపరిస్థితి దాపురించిందని వ్యాపారులు అంటున్నారు. భానుడి ప్రతాపం ఒక వైపు. కూరగాయల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు వాటిని కొనాలంటే జంకుతున్నారు. మార్కెట్‌కు రూ.500 తీసుకెళ్తే సంచి నిండే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఏకూరగాయలు కొనాలన్నా కిలో రూ.50 పైనే ఉండడంతో పప్పు పులుసు, కారంతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.

217
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...