రెచ్చిపోతున్న నేరగాళ్లు


Fri,May 17, 2019 02:52 AM

-తాళం వేసిన ఇండ్లు, షాపుల్లో దొంగతనాలు
-ఇంటి ముందు నిలిపి ఉంచిన వాహనాలు చోరీ
-రోడ్డుపై వెళ్తున్న వారి సెల్‌ఫోన్లు లూఠీ
-వరుస సంఘటనలతో బిక్కుబిక్కుమంటున్న జనం
నిజామాబాద్‌ క్రైం: రోజురోజుకు విస్తరిస్తున్న నిజామాబాద్‌ నగరంలో శాంతిభద్రతలు లోపిస్తున్నాయి. చోరీలు నిత్యకృత్యంగా మారాయి. బయటకు వెళితే జనానికి భద్రం లేకుండా పోయింది. నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మధ్యాహ్నం, రాత్రిళ్లు అనే తేడాలేకుండా చోరీలు చేస్తూ అందిన కాడికి దోచుకొని పోతున్నారు. ఇండ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లి తిరిగి వచ్చి చూసే సరికి ఏ వస్తువు ఉంటుందో పోతుందో గ్యారంటీ లేకుండా పోయింది. ఇటీవల కాలంలో వరుస చోరీలు చోటుచేసుకుంటుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ద్విచక్ర వాహనాలు మాయమవుతున్నాయి. ఇంటి ముందు బైక్‌ పెట్టి ఇంట్లోకి వెళ్లి వచ్చేసరికి నేరగాళ్లు బైక్‌లను మాయం చేస్తున్నారు. ఇక చైన్‌ స్నాచింగ్‌లకు లెక్కలేదు. తరుచూ ఎక్కడో చోట చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. వరుస ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఎన్నికల విధుల బందోబస్తులో నిమగ్నమయ్యారు. గతంలో మాదిరిగా ముమ్మరంగా పెట్రోలింగ్‌ చేయడం లేదనే ప్రజలు అంటున్నారు. నిఘా వ్యవస్థ సైతం నిద్రపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

భయంభయంగా...
జిల్లాకేంద్రంలో కొన్ని రోజులుగా వరుసగా జరుగుతున్న చోరీలు, లూఠీలతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డుపై నడిచి వెళ్తున్నా, ఇంటి ముందర సెల్‌ఫోన్‌ పట్టుకొని నిలబడి ఉన్నా .. ఎటువైపు నుంచి దుండగులు వచ్చి తమ చేతిలోని సెల్‌ఫోన్లను గద్ద.. కోడి పిల్లలను తన్నుకుపోయినట్లు తన్నుకు పోతారో అనే తీవ్ర భయబ్రాంతుల్లో జనం ఉన్నారు. ఈ మధ్య కాలంలో జిల్లాకేంద్రంలో వరుసగా జరుగుతున్న చోరీలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని రోజులుగా నగరంలోని ఒకటో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోడ్డుపై సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నడిచి వెళ్తున్న వ్యక్తుల వద్ద నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు సెల్‌ఫోన్లు లాక్కొని పరారైన పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. స్థానిక ఖలీల్‌వాడిలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డు, పూసలగల్ల్లీ, వీక్లీ మార్కెట్‌, పోచమ్మగల్లీ ప్రాంతాల్లో వరుసగా సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇంత జరిగినా సంబంధిత పోలీసులు మాత్రం కేవలం కేసులు నమోదు చేసుకొని చేతులు దులిపేసుకున్నారని, తమకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చోరీలు ఎక్కువగా జరుగుతుండడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. నగరంలోని గాయత్రీనగర్‌, శ్రీనగర్‌ కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంటితో పాటు షాపులో దొంగలు పడి దోచుకుపోయిన సంఘటనలు నమోదయ్యాయి.ఇక ద్విచక్ర వాహనాల దొంగతనాలు జరిగిన సంఘటనల విషయం చెప్పనక్కర్ల లేకుండా పోయింది. ఇండ్ల ముందర, దవాఖానల వద్ద, దుకాణ సముదాయాల ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలు మాయమవుతున్నాయి. బైక్‌లకు సంబంధించి వరుస చోరీ ఘటనలు నమోదవుతున్నాయి. ప్రధానంగా స్థానిక ఒకటో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బస్టాండ్‌, ఖలీల్‌వాడీ, వినాయక నగర్‌, కోటగల్లీ తదితర ప్రాంతాల్లో వరుసగా వాహనాలు చోరీ కావడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

బందోబస్తు విధుల్లో పోలీసులు బిజీబిజీ..
కొంత కాలంగా వరుసగా జరుగుతున్న దొంగతనాలు, ఇతర నేరాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుస ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌ సిబ్బంది ఎన్నికల బందోబస్తుకు పరిమితమయ్యారు. దీంతో పెట్రోలింగ్‌ తగ్గింది, నిఘా వ్యవస్థ కూడా లోపించింది. దీంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వేసవి సెలవులు కావడంతో ఇండ్లకు తాళాలు వేసి చాలామంది టూర్లు, దూరప్రాంతాలకు వెళ్తుంటారు. దీనిని ఆసరాగా చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇండ్లు, దుకాణా సముదాయాలు టార్గెట్‌ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా మహారాష్ట్రకు సరిహద్దున ఉండడంతో మహారాష్ట్ర ముఠాలు సైతం జిల్లాలో చోరీలు, నేరాలకు పాల్పడుతున్న ఘటనలు గతంలో వెలుగుచూశాయి. ప్రధానంగా నిఘా లోపించడంతోనే నేరాల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తున్నది.

183
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...