జిల్లాకు చేరిన రంజాన్‌ తోఫా


Fri,May 17, 2019 02:50 AM

14,500 గిఫ్ట్‌ప్యాక్‌లు పంపిణీకి సిద్ధం
ఖలీల్‌వాడి: రంజాన్‌ పండుగకు పేద ముస్లిములకు దుస్తుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి సంవత్సరం మాదిరిగా నిరుపేద ముస్లిములకు పవిత్ర రంజాన్‌ మాసంలో పండుగ జరుపుకోలేని స్థితిలో ఉండే వారికి దుస్తులను పంపిణీ చేయనున్నది. అందుకు గాను జిల్లాకు 14,500 రంజాన్‌ కిట్లు చేరాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వాటిని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారులు స్వీకరించారు.

నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గానికి నాలుగు వేలు, బోధన్‌కు నాలుగు వేలు, ఆర్మూర్‌కు రెండు వేలు, బాల్కొండకు రెండు వేలు, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి 1500 కిట్లను కేటాయించారు. మిగిలిన వెయ్యి కిట్లను వివిధ మండలాల్లో అధికంగా ఉన్న ముస్లిములకు కేటాయించనున్నారు. వచ్చిన కిట్లను నియోజకవర్గ కేంద్ర తహసీల్దార్లకు అప్పగించారు. ఈనెల 7 నుంచి రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. అందుకు అనుగుణంగా వాటిని అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు పంపిణీ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. స్థానికంగా ఉన్న మసీద్‌ కమిటీలతో పాటు అధికారులు సభ్యులుగా ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టి కిట్లను పంపిణీ చేయనున్నారు.


కామారెడ్డి జిల్లాలో...
పేద ముస్లిములు సైతం రంజాన్‌ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్‌ కానుకలను ప్రతి సంవత్సరం అందజేస్తున్నది. ఇందులో భాగంగా కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయానికి రంజాన్‌ కానుకలు బుధవారం చేరుకున్నాయి. ప్రభుత్వం పేద ముస్లిములకు ఉచితంగా బట్టలు పంపిణీ చేయడంతో పాటు ఇఫ్తార్‌ విందును అధికారికంగా నిర్వహిస్తోంది. కామారెడ్డి జిల్లాకు 9 వేల గిప్ట్‌ ప్యాక్‌లు వచ్చాయి. ఈ కానుకలను జిల్లాలోని అన్ని తహసీల్‌ కార్యాలయాలకు పంపిణీ చేయనున్నారు.

జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి నియోజకవర్గంలోని ఐదు మసీదుల్లో, జుక్కల్‌ నియోజకవర్గంలోని 5 మసీదుల్లో, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 3 మసీదుల్లో, బాన్సువాడ నియోజకవర్గంలోని 5 మసీదుల్లో గిఫ్ట్‌ ప్యాకెట్లను పేద ముస్లిములకు అందజేయనున్నారు. పేద ముస్లిములు పండుగను ఆనందంగా నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఆసరాగా నిలిచింది. జుక్కల్‌, కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాలకు 2500 చొప్పున, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 1500 గిఫ్ట్‌ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...