ఖాతాకు కొర్రీలు!


Thu,May 16, 2019 02:54 AM

నిజామాబాద్‌ రూరల్‌ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు బ్యాంకుల ద్వారా బట్వాడా చెల్లింపులకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యం త్రాంగం ఆ దిశగా కృషిచేస్తున్నది. ఈ నేపథ్యంలో కూలీలు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలు తెరవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇదిలా ఉండగా.. ఉపాధి పనులు చేసిన కూలీలు తమ సర్వీస్‌ ఏరియాలో ఉన్న బ్యాంకుల వద్దకు వెళ్లి ఖాతాల కోసం తిరుగుతున్నారు. కానీ, బ్యాంకు అధికారులు కొన్ని షరతుల పేరిట ఖాతాలు తెరవడానికి అంగీకరించలేని పరిస్థితి నెలకొంది. బ్యాంకు ఖాతాలు తెరవటానికి వెయ్యి రూపాయల నగదు డిపాజిట్‌ చేయాలని, పాన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలని బ్యాంకు అధికారులు ఖరాఖండీగా చెబుతుండడంతో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కూలీ పనులు చేయడం ద్వారా వచ్చే కొన్ని డబ్బుల కోసం వెయ్యి రూపాయలు ఖాతా తెరవడానికి డిపాజిట్‌ పెడితే మాకు మిగిలేది ఏముంటుందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ పని చేస్తేనే తమ కుటుంబాలను పోషించుకునే పరిస్థితిలో ఉందని, అలాంటింది వెయ్యి రూపాయలు డిపాజిట్‌, పాన్‌కార్డు నిబంధన విధించడం ఎంతవరకు సమంజసమని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు ఖాతాలు ఇవ్వడానికి నిబంధనల పేరిట నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా.. పనిచేసిన కూలీలకు సకాలంలో బట్వాడా డబ్బులు అందని పరిస్థితి నెలకొన్నది. దీంతో రోజురోజుకు కూలీల సస్పెండ్‌ వేజ్‌ పేమెంట్‌ పెరిగిపోతున్నది. కొన్ని జాతీయ బ్యాంకులు కూలీలకు ఖాతాలు తెరవటానికి నిరాకరించడంతో ఇతర చిన్న బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. అయినా, జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ఉపాధి కూలీలకు ఖాతాలు తెరవలేని పరిస్థితి ఏర్పడుతున్నది.

ఈ విషయమై ఉపాధిహామీ సిబ్బంది కూడా బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. తాము బ్యాంకు అధికారుల వద్దకు వెళ్లి కూలీలకు ఖాతాలు తెరిచే విషయమై రిక్వెస్ట్‌ చేసినా.. ఫలితం ఉండడం లేదని పలువురు ఉపాధి సిబ్బంది పేర్కొంటున్నారు. పని చేయించిన కూలీలకు బ్యాంకు ఖాతాలు తీయించడంలో ఉపాధి సిబ్బందికి తలనొప్పిగా మారింది. జిల్లావ్యాప్తంగా ఈనెల 13వ తేదీ వరకు ఉపాధి పనులు చేసిన 7,859 మంది కూలీలకు బ్యాంకు అధికారులు ఖాతాలు ఇవ్వలేదు. అంత మంది కూలీలు చేసిన పనికి ఉపాధి సిబ్బంది రికార్డు చేసిన ఆధారంగా మొత్తం రూ.90లక్షల 11వేల 873లు బట్వాడా డబ్బులు చెల్లించేలా ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉంచారు. ఇకనైనా కలెక్టర్‌ వెంటనే స్పందించి పని చేసిన ఉపాధి కూలీలకు తక్కువ డిపాజిట్‌తో లేదా జీరో అకౌంట్‌ ద్వారానైనా ఖాతాలు తెరిపించి తగులు చర్యలు తీసుకోవాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...