డెంగీతో జర జాగ్రత్త..


Thu,May 16, 2019 02:51 AM

ఖలీల్‌వాడి: గతంలో టైఫాయిడ్‌, మలేరియా జ్వరాలను విన్నాం. కానీ, వాటి జాడ తగ్గినా కొత్తగా డెంగీ జ్వరం జిల్లా ప్రజలను అప్పుడప్పుడు పీడిస్తోంది. పగటి పూట కుట్టే దోమలతో డెంగీ జ్వరం వస్తుంది. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన లేక పోవడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. కానీ డెంగీపై అవగాహన పెంచుకుంటే భయాందోళన వీడవచ్చని జిల్లా వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాల్లో డెంగీ ఉన్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ గుర్తించింది. ఆ ప్రాంతాలను హైరిస్క్‌ ప్రాంతాలుగా గుర్తించి దోమల నివారణకు తగు చర్యలు చేపట్టారు. డెంగీ వ్యాధి మూడు సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం చాలా తగ్గింది. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం డెంగీ నమోదు తగ్గుమొఖం పడుతున్నది. డెంగీ నివారణకు జిల్లా వైద్యారోగ్యశాఖ మూడు సంవత్సరాలుగా ప్రత్యేక నివారణ కార్యక్రమాలు చేపడుతున్నది. అందులో భాగంగా డెంగీ కేసుల నమోదు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, దోమల నివారణకు ప్రత్యేక చర్యలను చేపడుతున్నది. తద్వారా జిల్లాలో డెంగీ నివారణకు దోహదం చేస్తోంది. ఈ వ్యాధిపై జిల్లా ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.

డెంగీ రాకుండా తీసుకునే జాగ్రత్తలు..
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇంటి పరిసరాల ప్రాంతాల్లో నీటి నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలతో పాటు కాలనీ, గ్రామాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి. లేకుంటే దోమలు ఎక్కువై డెంగీ వచ్చే అవకాశం ఉంది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే డెంగీ వ్యాధిని దూరం చేయొచ్చు.

జిల్లాలో తగ్గిన డెంగ్యూ తీవ్రత..
ప్రతి ఏటా జిల్లాలో నమోదవుతున్న గణాంకాల ప్రకారం ఈ ఏడు డెంగీ జ్వరాలు తక్కువగా నమోదయ్యాయి. గతంలో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా డెంగీ జ్వరమే. జిల్లా వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం 2015లో 350 కేసులు, 2016లో 235, 2017లో 212 కేసులు, 2018లో 155 కేసులు, 2019లో ఇప్పటివరకు 17 కేసులు నమోదయ్యాయి.

రక్త పటికలు తగ్గడంతో ఆందోళన పడుతున్న ప్రజలు
డెంగీ జ్వరంతో రక్తంలోని పటికల శాతం తగ్గడం సాధారణం. పటికలు తగ్గడంతో రకరకాల అనర్థాలు జరుగుతాయన్న కారణంగా ప్రజలు ఆందోళన పడుతున్నారు. పటికలు తక్కువ స్థాయికి పడిపోతే రోగికి ఎక్కించడానికి రక్త పటికలు (ఎస్‌డీపీ) జిల్లా కేంద్రంలో దొరకకపోవడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. పలు సందర్భాల్లో ఎస్‌డీపీ దొరకక పోవడంతో రోగులు హైదరాబాద్‌, కరీంనగర్‌, నాందేడ్‌కు వెళ్తున్నారు. అధికారులు వీటిపై దృష్టి సారిస్తే రోగులకు కొంతమేర ఇబ్బంది ఉండదు.

భయాందోళన వద్దు అవగాహన ఉంటే చాలు..
డెంగీ వ్యాధిపై ప్రజలు ముందుగా అవగాహన పెంపొందించుకోవాలి. వ్యాధి లక్షణాలు, వ్యాధితో ఉత్పన్నమయ్యే సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే డెంగీపై ప్రజలకున్న భయందోళన దూరమవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్యశాఖ డెంగీ కేసులు నమోదైన ఆయా ప్రాంతాల్లో దోమల నివారణ చేపడుతున్నారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
జిల్లా ప్రజలు డెంగీ వ్యాధిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధి కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. రక్త పటికలు తగ్గిన వారందరిదీ డెంగీ జ్వరమే అని చెప్పలేం. డెంగీ కాకుండా ఇతర విషజ్వరాలతో కూడా ఈ ప్లేట్‌లెట్స్‌ తగ్గుతాయి. ఈ వ్యాధిగ్రస్తుల కోసం జిల్లా ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నాం. గతంతో పోల్చితే ఈ సంవత్సరం డెంగీ వ్యాధి తీవ్రత చాలా వరకు తగ్గింది.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...