పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి


Thu,May 16, 2019 02:43 AM

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో గురువారం నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉపకులపతి ఆచార్య పి.సాంబయ్య సూచించారు. క్యాంపస్‌లో ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాలలోని సమావేశ మందిరంలో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ కె.సంపత్‌కుమార్‌ ఆధ్వర్యంలో డిగ్రీ పరీక్షల నిర్వహణపై బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాళ్లకు వీసీ పలు సూచనలు చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కనీస వసతులను కల్పించాలన్నారు. చల్లని తాగునీరు అందుబాటులో ఉంచాలని, విద్యార్థుల సంఖ్యకు సరిపడా పరీక్షా గదులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఇన్విజిలేటర్లకు ముందస్తు శిక్షణను ఇవ్వాలని, మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా ఇన్విజిలేటర్లు పరీక్షల గదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. ముందస్తు భద్రత దృష్ట్యా పోలీసులకు సమాచారం అందించాలని, హాల్‌ టికెట్లను నిశితంగా పరిశీలించిన తర్వాతే విద్యార్థులను పరీక్షల గదికి అనుమతించాలన్నారు. ప్రశ్నాపత్రాలు పరీక్షా సమయం కంటే అరగంట ముందుగా ఆన్‌లైన్‌లో పంపిస్తామని, ప్రింట్‌ఔట్‌ మిషన్లను సరిచూసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. విద్యార్థుల పరీక్ష హాజరు నమోదు కలిగిన డి-ఫారాన్ని జాగ్రత్తగా నింపాలన్నారు. పరీక్షలకు సంబంధించిన సిబ్బంది అంతా సమయపాలన పాటించాలని సూచించారు. డిగ్రీ యాజమాన్య కళాశాలల అధ్యక్షుడు హరిప్రసాద్‌ మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లు, సామగ్రి కొనుగోలు, వసతులకు ముందస్తు నగదును పరీక్ష కేంద్రాలకు సమకూర్చాలని విజ్ఞప్తి చేయగా ఉపకులపతి ఆమోదం తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...