టీఆర్‌ఎస్‌లో గెలుపు ధీమా


Thu,May 16, 2019 02:42 AM

నిజామాబాద్‌/కమ్మర్‌పల్లి: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో గెలుపు ధీమా కనిపిస్తున్నది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీల్లో నిలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో, పార్టీ శ్రేణుల్లో గెలుపు ధీమా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల నుంచి లభించిన స్పందన, పోలింగ్‌ సరళి గెలుపు తమదేనని స్పష్టం చేస్తున్నాయని టీఆర్‌ఎస్‌ శ్రేణులు పేర్కొంటున్నాయి. జిల్లాలో 27 జడ్పీటీసీ స్థానాల్లో, 299 ఎంపీటీసీ స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైన నాటి నుంచే టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనబడింది.

జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వాల కోసం తీవ్రమైన పోటీ నెలకొనగా.. ప్రతిపక్షాలకు చాలా చోట్ల ప్రధాన అభ్యర్థులు లభించని పరిస్థితి, కొనిచోట్ల అభ్యర్థులను వెతుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్‌ఎస్‌కు లభించిన అఖండ విజయం, లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగిన టీఆర్‌ఎస్‌ హవా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించింది. టీఆర్‌ఎస్‌ ప్రచార కార్యక్రమాల్లో ప్రజల నుంచి కనిపించిన స్పందన, ప్రచార కార్యక్రమాలకు లభించిన జనాదరణ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పార్టీ అభ్యర్థుల గెలుపునకు తమదైన శైలిలో కృషి చేశారు.

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత జిల్లాలో ఎలాంటి మొహమాటాలకు పోకుండా గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు గెలుపు బాట ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అనంతరం ప్రచారంలో మంత్రి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు విస్తృతంగా పాల్గొన్నారు. ఇది వరకు తాము సాధించిన అభివృద్ధిని, చేయబోయే అభివృద్ధిని, సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరోసారి గుర్తు చేశారు. పోలింగ్‌ సరళి కూడా టీఆర్‌ఎస్‌ శ్రేణులకు అంచనాలకు అనుగుణంగానే జరిగింది. జిల్లాలో మహిళా ఓటర్లు అత్యధికంగా పోలింగ్‌లో పాల్గొనడం టీఆర్‌ఎస్‌కు బాగా కలిసివచ్చిన అంశమని పరిశీలకులు పేర్కొంటున్నారు. కల్యాణలక్ష్మి, స్వయం సహాయక సంఘాల రుణాల మాఫీ, కేసీఆర్‌ కిట్‌ తదితర కార్యక్రమాలు మహిళల మనసుల్లో బాగా సానుకూలంగా నాటుకుపోయాయి. మహిళల ఓట్లు టీఆర్‌ఎస్‌కే పడ్డాయని పార్టీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతుల ఓట్లను టీఆర్‌ఎస్‌కు వేయించాయని పేర్కొంటున్నాయి. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు ప్రచార కార్యక్రమాలను, గ్రామాల్లో వ్యక్తమయ్యే ఓటరు మూడ్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం బాగా కలిసి వచ్చింది.

ప్రచారంలో విపక్ష పార్టీలతో పోలిస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల దూకుడు పార్టీ బలాన్ని ప్రతిబింపజేసింది. జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో తొలిసారిగా జడ్పీపీఠాన్ని కైవసం చేసుకున్నది నిజామాబాద్‌ జిల్లాలోనే. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జరిగిన ఈ ఎన్నికల్లో సైతం జడ్పీపీఠాన్ని పార్టీ కైవసం చేసుకోబోతుందని కార్యకర్తలు, నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...