పాపం.. పండుటాకులు


Wed,April 24, 2019 02:36 AM

ఎడపల్లి: నూతన పట్టాదారు పాస్ పుస్తకాల జారీకి రెవెన్యూశాఖ ఆధార్ కార్డును అనుసంధానం చేసింది. ఆధార్ అనుసంధానం చేసిన రైతులు తమ భూములకు సంబంధించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకం పొందాలంటే మీ-సేవ కేంద్రాల్లో ఈకేవైసీ (వేలిముద్రల నమోదు) చేయాలి. ఈకేవైసీ ద్వారా వేలిముద్రల స్కానింగ్ సక్సెస్ అయితేనే పట్టాదారులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకం జారీ అవుతుంది. ఈ నిబంధన అనేక మంది వృద్ధ్ద రైతుల పాలిట శాపంగా మారింది. వేలిముద్రలు స్కాన్ కాకపోవడంతో 50 నుంచి 65 ఏండ్ల మధ్య వయసు గల వృద్ధులు ఏడాదిగా నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పొందలేక పోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో దాదాపు 120 నుంచి 140 మంది వృద్ధ రైతులు ఉన్నారు. వీరందరికీ ఏడాది కాలంగా నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ కాలేదు. ఈ రైతులకు వేలిముద్రల సమస్య ఉండడంతో వీరి వేలి ముద్రలు స్కానింగ్ కావడం లేదు. వీరంతా దాదాపు ఎకరం నుంచి అర ఎకరం లోపు విస్తీర్ణం భూములు కలిగి ఉన్నవారు ఉన్నారు. వీరికి రెవెన్యూశాఖ అధికారులు నూతన పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేయాలంటే వీరు మీ-సేవ ద్వారా వేలిముద్రలు నమోదు చేయాలి.

వేలిముద్ర సక్సెస్ అయితేనే పట్టాదారు పాస్ పుస్తకం జారీ అవుతుంది. ఇలాంటి వారు మండలంలోని ఠాణాకలాన్ గ్రామంలో అత్యధికంగా దాదాపు 40 మంది వరకు ఉన్నారు. ఇలా ప్రతీ గ్రామంలో 10 నుంచి 20 మంది వరకు ఉన్నారు. వీరందరికీ నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ కాలేదు. తమ గోడును రెవెన్యూ అధికారులకు చెప్పుకున్నామని, వారు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా వీరంతా రైతుబంధు పథకానికి దూరమయ్యారు. రైతుబీమాకు కూడా కొంత మంది 60 ఏండ్లలోపు రైతులు దూరమయ్యారు. దీంతో పాటు పీఎం సమ్మాన్ యోజనకు కూడా ఈ రైతులు దూరమయ్యారు. వేలిముద్రలు రాని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీకి రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

ఆసరా పింఛన్ల తరహాలో వేలిముద్రలు రాని వారికి గ్రామ కార్యదర్శి వేలిముద్రలు వేసి ఎలాగైతే పింఛన్ డబ్బులు ఇస్తున్నారో, అదేవిధంగా ఇతర అధికారి వేలిముద్రను అనుసంధానం చేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని రైతులు కోరినా.. అధికారులు స్పందించడం లేదు. ఈ పద్ధతి కుదరని పక్షంలో ఐరిస్ స్కానింగ్ ద్వారా కూడా రైతును గుర్తించి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వవచ్చు. కానీ, ఈ దిశగా అధికారులు అలోచించడం లేదు. వేలిముద్రలు రాకపోతే తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలిముద్రల కోసం పలు మీ-సేవ కేంద్రాల చుట్టూ , రెవెన్యూ అధికారులు సూచించినట్టుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈకేవైసీ సెంటర్‌కు కూడా రైతులు వెళ్లి శ్రమకోర్చి వేలిముద్రలు వేసినా ఫలితం లేకుండా పోయింది.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...