అసంక్రమిత వ్యాధిగ్రస్తుల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి


Wed,April 24, 2019 02:35 AM

బోధన్, నమస్తే తెలంగాణ: అసంక్రమిత వ్యాధి గ్రస్తుల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, ఈ సర్వే ద్వారా అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న ప్రజలను గుర్తించి వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించే అవకాశం ఏర్పడుతుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుదర్శనం అన్నారు. మంగళవారం బోధన్ పట్టణం రాకాసిపేట్‌లోని కమ్యూనిటీహాల్‌లో అసంక్రమిత వ్యాధులపై త్వరలో నిర్వహించనున్న సర్వేకు సంబంధించిన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో బోధన్ డివిజన్‌కు చెందిన ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. శిక్షణ శిబిరంలో డీఎం అండ్ హెచ్‌వో సుదర్శనం మాట్లాడుతూ సంక్రమిత వ్యాధుల విషయం త్వరగా బయటకు తెలుస్తున్నప్పటికీ, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ తదితర అంటువ్యాధులుకాని వ్యాధుల విషయం తెలియడం లేదన్నారు. దీంతో ఈ అసంక్రమిత వ్యాధులతో ప్రజలు ఆరోగ్యాలను కోల్పోతున్నారని, నాణ్యమైన జీవనాన్ని కోల్పోతున్నారని అన్నారు. అసంక్రమిత వ్యాధుల సర్వేలో 30 ఏళ్లకు పైబడిన ప్రజలందరి వివరాలను సేకరిస్తారని, సర్వేలో గుర్తించిన అసంక్రమిత వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతాయని అన్నారు. ఈ సర్వే ఈ నెల 25 తర్వాత ప్రారంభించే అవకాశం ఉందన్నారు. సర్వేలో జిల్లావ్యాప్తంగా 436 మంది ఏఎన్‌ఎంలు, 1280 ఆశా కార్యకర్తలు పాల్గొంటారని డీఎం అండ్ హెచ్‌వో తెలిపారు. డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ విద్య, హెల్త్ ఎడ్యుకేటర్ ఆఫీసర్స్ విజయకుమార్, గోవర్ధన్, వర్ని పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ వెంకన్న పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...