పరిషత్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం


Mon,April 22, 2019 11:56 PM

- అన్ని ఏర్పాట్లు చేశాం
- భారీగా బందోబస్తు
- కలెక్టర్ రామ్మోహన్‌రావు

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడారు. మూడు విడతలుగా డివిజన్ వారీగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో 27 జడ్పీటీసీ, 299 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 7,69,164 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, జిల్లాలో మొదటి దశలో నిజామాబాద్ డివిజన్‌లో 8 జడ్పీటీసీ, వంద ఎంపీటీసీ స్థానాలకు మే 6వ తేదీన ఎన్నికలు జరుగుతాయని చె ప్పారు. రెండో దశలో బోధన్ డివిజన్‌లో 8 జడ్పీటీసీలు, 75 ఎంపీటీసీలకు మే 10వ తేదీన, మూడో దశలో ఆర్మూర్ డివిజన్‌లో 11 జడ్పీటీసీలకు, 125 ఎంపీటీసీ స్థానాలకు మే 14న పోలింగ్ జరుగుతుందన్నారు.

నామినేషన్ల వివరాలు...
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నిలబడే వారు సంబంధిత మండల కేంద్రంలో నామినేషన్ల స్వీకరణకు అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. మూడు ఎంపీటీసీ నియోజకవర్గాలకు ఒక రిటర్నింగ్ అధికారిని, జడ్పీటీసీ మండలానికి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించామని, వారందరికీ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన సంబంధిత విషయాలపై పూర్తిగా అవగాహన కల్పించినట్లు చెప్పారు. మొదటి దశలో ఎన్నికలు జరిగే డివిజన్‌లో నామినేషన్ల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేశామని, రోజు వారి నామినేషన్ వివరాలను జడ్పీ సీఈవో ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని కలెక్టర్ వివరించారు.

మొదటి దశ నిజామాబాద్ డివిజన్‌లోనే...
ఈనెల 22న నామినేషన్ల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేశామని, నామినేషన్లను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. 25న నామినేషన్ల పరిశీలన, 28న మధ్యాహ్నం 3గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణ, తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను తయారుచేసి గుర్తులను కేటాయిస్తామన్నారు. ఈ ఎన్నికలు పార్టీ బేసిస్ మీద జరుగుతున్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారంగా నిధులు కేటాయింపులు జరుగుతాయని, మే 6వ తేదీన పోలింగ్ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

రెండో దశ బోధన్ డివిజన్‌లో..
పనెల 26న తేదీన నోటిఫికేషన్ జారీ నామినేషన్ల స్వీకరణ, 29న పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావు తెలిపారు. మే రెండో తేదీన ఉపసంహరణ, మే 10న పోలింగ్ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుందని చెప్పారు.

మూడో దశ ఆర్మూర్ డివిజన్‌లో...
ఈనెల 30న నోటిఫికేషన్ జారీ, నామినేషన్లు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. మే 3న నామినేషన్ల పరిశీలన, మే 6న ఉపసంహరణ, మే 14న పోలింగ్ జరుగుతుందన్నారు.

డిపాజిట్ వివరాలు....
ఎంపీటీసీ, జీడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేసే సందర్భంలో డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రామ్మోహన్‌రావు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారంగా జడ్పీటీసీకి సాధారణ వ్యక్తులు రూ. 5వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ వ్యక్తులు రూ. 2,500 చెల్లించాలని, ఎంపీటీసీ సాధారణ వ్యక్తులకు రూ. 2,500, ఎస్సీ, ఎస్టీలకు రూ.1,250 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులు జడ్పీటీసీలకు గరిష్ట వ్యయపరిమితి రూ. 4లక్షలు మించకూడదని, ఎంపీటీసీ అభ్యర్థులకు గరిష్ట వ్యయ పరిమితి రూ.1.50లక్షలు మించకూడదని అన్నారు.

ఎన్నికలకు భారీ బందోబస్తు...
ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ రోజు వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు, మిగతా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ సిబ్బందికి రెండు సార్లు శిక్షణ ఇచ్చామని, ఎన్నికల నియమావళి అమలుకు నోడల్ అధికారులను నియమించామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు వ్యయ పరిశీలకులను నియమించామని, ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించనున్నందున అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పత్రాల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్‌లను మాట్లాడి సిద్ధంగా పెట్టుకున్నామని, పింక్ రంగు బ్యాలెట్ పత్రం ఎంపీటీసీ ఎన్నికకు, తెలుగు రంగు బ్యాలెట్ పత్రం జడ్పీటీసీ ఎన్నికకు వినియోగిస్తున్నామని తెలిపారు. సరిపడా సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల నియమావళి ఇంకా అమలులో ఉన్నందున దానితో పాటుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి కూడా అమలులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలని, కిందిస్థాయి అధికారులు కూడా పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జడ్పీ సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

మీడియా సహకారం భేష్...
జిల్లాలో అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీడియా సహకరించడంతో ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని కలెక్టర్ రామ్మోహన్‌రావు తెలిపారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగాయని, ఓటర్ల అవగాహనతో పాటు నమోదు ప్రక్రియలో కూడా మీడియా ప్రత్యేక శ్రద్ధ పెట్టినందున పెద్ద మొత్తంలో జిల్లాలో ఎక్కువ మంది ఓటరు నమోదు చేసినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమ వంతు కృషి చేశారని, అదే స్ఫూర్తితో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మీడియా సహకరించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...