మరింత సమగ్రంగా..


Mon,April 22, 2019 02:34 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: వ్యవసాయంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం క్రాప్ కాలనీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయశాఖ సమగ్ర సమాచార సర్వేను చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే రూపొందించిన సర్వే పత్రాల విషయ సేకరణకు అదనంగా మరిన్ని వివరాలను పొందుపర్చారు. ఉద్యానవన శాఖకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఈ సర్వేలో రాబట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఇప్పటి వరకున్న 39 కాలమ్స్‌ల సర్వే పత్రాన్ని 46 కాలమ్స్‌కు పెంచారు. ఈ వివరాలన్నీ కూడా సేకరించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ సర్వేలో నిమగ్నమైంది. 96 మంది ఏఈవోలు, 34 మంది ఏవోలు, 10 మంది ఏడీఏలు తదితర సిబ్బందితో జిల్లా వ్యాప్తంగా సర్వే కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 10 శాతం మేర విషయ సేకరణ పూర్తయింది. తాజాగా సీఎం సూచనల మేరకు ప్రధానంగా ఏడు అంశాలను పొందుపరిచారు. రైతుల సాగు భూమిలో వాననీటి గుంతలు, వాటర్ షెడ్ కార్యక్రమం కింద ఏర్పాటుచేసిన సౌకర్యాల వివరాలను పొందుపర్చడంతో పాటు సూక్ష్మనీటి పారుదల (డ్రిప్, మైక్రో ఇరిగేషన్) వివరాలను సేకరించి ఎన్ని సంవత్సరాల నుంచి వినియోగిస్తున్నారు..? ఎన్ని ఎకరాల్లో సద్వినియోగమవుతుందనే వివరాలను తీసుకుంటారు. వానాకాలం, యాసంగిలో ఏఏ పంటలు వేస్తున్నారు..? మార్చిన పంట వివరాలు? విస్తీర్ణం వివరాలు తెలియజేసేందుకు ఓ కాలమ్‌ను రూపొందించారు.

ఉద్యానవన శాఖకు సంబంధించి పాలిహౌస్ కింద ఏ పంటలు వేస్తున్నారు..? ఎంత మేర సాగవుతున్నది అనే వివరాలతో పాటు కూరగాయల సాగుపై కూడా సమాచారాన్ని సేకరించనున్నారు. దీంతో పాటు ఇంటి ఆవరణలో పెంచుకుంటున్న మొక్కలు, కూరగాయల వివరాలను సేకరిస్తారు. ఈ ఏడాది కొత్తగా పండ్ల తోటలను వేయాలని నిర్ణయం తీసుకున్న విషయాలను పొందుపర్చడంతో పాటు ఇప్పటికే వేసిన పంటల వివరాలను సర్వేలో నిక్షిప్తం చేశారు. వ్యవసాయ భూమిలో అటవీ మొక్కల (వెదురు, శ్రీగంధం) పెంపకంపై వివరాలు సేకరిస్తారు. రైతుల పొలం గట్లపై ఉన్న మొక్కల చెట్ల వివరాలను కూడా పొందుపరుస్తారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ఏ పంట సాగవుతుంది? విత్తనాల అవసరం ఎంత పడ్తుంది? మార్కెటింగ్ సౌకర్యాలు పెంపొందించే విషయాలపై సమగ్ర అధ్యయనంలో భాగంగా తాజాగా సర్వేలో పెరిగిన కాలమ్స్ ఆధారంగా సమాచారాన్ని ప్రభుత్వం తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నది. ఆ తర్వాత నేల స్వభావాన్ని బట్టి క్రాప్ కాలనీల విభజనకు సంబంధించి చర్యలు తీసుకుంటారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...