చిన్నతప్పు.. పెద్ద శిక్ష


Mon,April 22, 2019 02:32 AM

ఇందల్వాయి: నిబంధన ప్రకారం అన్ని పత్రాలు, రికార్డులు సజావుగా ఉన్నాయా.. లేవా అని చూపి పట్టా పాసు పుస్తకాలు చేసి ఇవ్వాల్సిన రెవెన్యూ అధికారులు ఏళ్లు గడుస్తున్నా వారసత్వ పట్టాలు మార్చక లంచాలు తీసుకుని మరీ ఇబ్బంది పెడుతున్నారని ఓ రైతు ఆవేదన. తన తాత పేరు మీద ఉన్న భూమి పట్టా పాసు పుస్తకాలు చేసి ఇవ్వడం కోసం రెవెన్యూ అధికారుల వద్దకు తిరిగి వేసారిపోతున్నానని డిచ్‌పల్లి మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన రైతు షేఖ్ జుబేర్‌హైమద్ అన్నారు. జుబేర్‌కు తాతకు మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 834లో-మూడున్నర గుంటలు, 1014లో-రెండు గుంటల పావు, 469లో-ఆరు గుంటల భూమి ఉంది. అది ఇంత వరకు తన పేరు మీద చేయలేదు. ఇదే కాకుండా సర్వే నంబర్1015లో-మూడు గుంటలు, 1016లో-పది గుంటల భూమి ఉంది, ఈ రెండు సర్వే నంబర్ల నుంచి ఆరున్నర గుంటల భూమిని రామడ్గు గ్రామానికి చెందిన వేరే రైతు పేరు మీద నమోదు చేశారు. ఈ భూములకు సంబందించి తానే హక్కు దారునని, దీనిపై ఇతరులెవరికీ ఎలాంటి వ్యతిరేకత లేదని నిరభ్యంతర పత్రం సైతం తీసుకున్నారు. అన్ని రకాల పత్రాలతో రెవెన్యూ అధికారులకు తన తాత పేరు మీదున్న భూమిని తన పేరు మీద మార్చాలంటూ ఎన్నోమార్లు దరఖాస్తులు పెట్టుకున్నాడు. ఎండ్లు గడుస్తున్నా ఇంత వరకూ పని కాలేదు. దీనిపై గతేడాడి నవంబర్ 6న ప్రజావాణిలో సైతం పిర్యాదు చేశాడు. అయినా పని కాలేందంటే రెవెన్యూ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థమవుతున్నది.

లంచం ఇచ్చినా పని కాలేదు..
తిరిగి వేసారిపోయిన బాధితుడు ప్రాజెక్టు రామడ్గు వీఆర్వోకు రూ. పదివేల లంచం సైతం ముట్టజెప్పాడు. అయినా సదరు అధికారి ఇప్పుడు.. అప్పుడు అంటూ ఏండ్లు గడిపేస్తున్నాడే తప్ప పని చేయడం లేదని జుబేర్ వాపోయాడు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే సిబ్బందికి కొంత డబ్బు ఇవ్వాలంటే.. మరో నాలుగు వేల రూపాయలకు బేరం చేసుకుని, అందులో రెండు వేల నగదు ఇటీవలె అందజేశాడు. అయినా నిరాశే ఎదురైంది. మా భూమిని మాకు పట్టా చేసి ఇవ్వడానికి ఇంత నరక యాతనా..? డబ్బులు తీసుకొని కూడా ఏండ్ల తరబడి అధికారులు తమ చుట్టూ తిపించుకుంటున్నారని బాధితుడు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నాడు. తన బాధను ఎవరితో మొరపెట్టుకోవాలో అర్థం కాక నమస్తే దిన పత్రికలో వెలవడుతున్న ధర్మగంట శీర్షీకను చూసి విలేఖరిని కలిసి మొరపెట్టుకున్నాడు. రెవెన్యూ శాఖలో ఇలాంటి అవినీతి తంతంగాలు, తనలాంటి రైతుల గాధలెన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ శాఖను ప్రక్షాళన చేసి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని మొరపెట్టుకున్నాడు.

రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు..
ఈ రైతు పేరు నోముల శ్రీనివాస్‌రెడ్డి. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామం. తనకు ఏడు ఎకరాల 5 గుంటల వ్యవసాయ భూమి ఉంది. కానీ పట్టాపాస్‌బుక్‌లో నమోదైనది కేవలం నాలుగెకరాల 15 గుంటలే. మిగతా భూమిని నూతన పట్టాదారు పాసు పుస్తకాల్లో చేర్చడానికి తాసిల్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నాడు. ఈయనను పట్టించుకున్న నాథుడే లేడు. తన బాధను వీఆర్వోలతో వెల్లబోసుకున్నా కనికరించలేదు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రైతులకు వెన్నుదన్నుగా నిలుద్దామని భూ రికార్డుల ప్రక్షాళన చేపడితే.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని నోముల శ్రీనివాస్‌రెడ్డి అంటున్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...