మోగిన నగారా


Sun,April 21, 2019 12:29 AM

ఇందూరు : స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి వివరాలు వెల్లడించారు. మూడు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 6న తొలి విడత, 10న రెండో విడత, 14న మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. 27న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తొలిదశ పోలింగ్ ఈనెల 22న, రెండో దశ పోలింగ్ 26న, మూడో దశకు ఈనెల 30న నోటీసులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 25 జడ్పీటీసీ, 299 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈసారి ఆన్‌లైన్ విధానంలోనూ నామినేషన్ దాఖలు చేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే ఆ తర్వాత అభ్యర్థులు తమ నామినేషన్ హార్డ్‌కాపీలను రిటర్నింగ్ అధికారికి కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.

జిల్లాలో ఓటర్లు ఇలా..
జిల్లాలో 7,79,112 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,63,267, మహిళలు 4,15,833 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 1,589 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు జిల్లా పరిషత్‌కు చేరుకోగా.. వాటిని జిల్లాలోని 27 మండలాలకు తరలించారు. అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ, ఉపసంహరణ అనంతరం బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్ ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. కొత్తగా మండలాలుగా ఏర్పడిన మోస్రా, చందూరు మండలాల్లో ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారయ్యాయి. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్లలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా, రాష్ట్రంలో జరగనున్న పరిషత్ ఎన్నికలకు సాధారణ పరిశీలకులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఐపీఎస్ అధికారిణి అభిలాష్ బిస్త్‌ను ఎన్నికల సంఘం నియమించింది.

మూడు విడతల్లో ఎన్నికలు..
నిజామాబాద్ డివిజన్‌లో మొదటి, బోధన్ డివిజన్‌లో రెండో విడత, ఆర్మూర్ డివిజన్‌లో మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో 8, బోధన్ డివిజన్ పరిధిలో 6, ఆర్మూర్ డివిజన్ పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. నిజామాబాద్ డివిజన్‌లో 100, బోధన్ డివిజన్‌లో 75, ఆర్మూర్ డివిజన్‌లో 124 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలలో ఆర్వోలు, ఏఆర్వోలు, పీవో, ఏపీవో, ఇతర పోలింగ్ సిబ్బంది కలిపి ఉభయ జిల్లాల్లో 17,842 మంది సిబ్బందిని ఎన్నికల కోసం నియమించారు. సుమారు 5వేల వరకు బ్యాలెట్ బాక్సులను ఎన్నికల నిర్వహణకు అందుబాటులో ఉంచారు. గత ఎన్నికల్లో జడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసే వారు నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు జిల్లా కేంద్రానికి కాకుండా మండల కేంద్రాల్లో వేయాల్సి ఉంటుంది.

మండలానికో జడ్పీటీసీ రిటర్నింగ్ అధికారి, మూడు ఎంపీటీసీ స్థానాలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారు. వారే నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆయా డివిజన్ కేంద్రాల్లో చేపట్టనున్నారు. కాగా, ఆయా పార్టీల్లో పోటీకి దిగనున్న వారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. జడ్పీటీసీ, ఎంపీటీసీగా పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్...
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉంది. లోక్‌సభ ఫలితాల వరకూ కోడ్ అమలులో ఉండగా.. అంతలోనే రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో మరో కోడ్ అమల్లోకి వచ్చింది. వరుస ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉండడంతో అభివృద్ధి పనులు, పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆటంకం ఏర్పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ ఏడో తేదీనాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారుతో కోడ్ అమలులోకి వచ్చి డిసెంబర్ 13నాటికి ముగిసింది. సరిగ్గా నెల రోజులు కాకమునుపే జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమలైంది. నూతన సంవత్సరం ఆరంభం నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసే దాక కోడ్ కొనసాగగా... ఇంతలోనే మార్చి నెలలో సార్వత్రిక సమరంతో మరోసారి కోడ్ కూసింది. ఈ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో కోడ్ కొనసాగడం తప్పనిసరిగా మారింది. ఎన్నికల కోడ్ మే 27 వరకు అమల్లో ఉంటుంది.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...