ప్రజలకు మెరుగైన సేవలందించాలి


Sun,April 21, 2019 12:28 AM

ఇందూరు : కొత్తగా ఎంపికైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నూతనంగా ఎంపికైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు శనివారం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అవినీతికి ఆస్కారం లేకుండా విధులు నిర్వర్తించాలని, అవినీతిని సహించేది లేదన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నామనే భావన కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం వచ్చిన తర్వాత నియామకాలు జరిగాయన్నారు. విధులపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలాంటి పక్షపాతం, బంధుప్రీతి చూపకుండా విధులు నిర్వర్తించాలన్నారు. విధులపై కొత్తగా ఎంపికైన వారికి ఉన్న అవగాహనను తెలుసుకోవడానికి వారితో స్వయంగా మాట్లాడి వారి విధులేంటని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు, పరిస్థితులపై అధ్యయనం చేయాలని సూచించారు. స్థానికంగా ఉన్న అధికారులతో సమన్వయపరుచుకొని పని చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న మౌళిక వసతులు, ఇంకేం కావాలో అనే అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన వారిలో డిగ్రీలు, పీజీలు, సాంకేతిక ఇంజినీర్లు ఉన్నారని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన సేవలందించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు ఉందన్నారు.

క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రజలకు అవరసరమైన పనులను ఏ విధంగా పూర్తి చేయాలనే అంశాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. ప్రైవేటు సంస్థల్లో పని చేసేటప్పుడు ఆ సంస్థ లాభాల గురించి ఆలోచిస్తారని కానీ ప్రభుత్వంలో పని చేసేటప్పుడు మాత్రం అభివృద్ధి గురించి ఆలోచించాలన్నారు. ప్రతి ఉద్యోగి అదనపు గంటలు, సెలవురోజుల్లో పని చేయాల్సి వస్తుందని, అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వ్యక్తిగత అభివృద్ధికి బదులు పనిచేసే చోటు, దానిపై ఆధారపడిన ప్రజల గురించి ఆలోచించాలన్నారు. గ్రామాల్లో వైకుంఠ ధామాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీరు తదితరాలపై ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలన్నారు. కొత్త చట్టం ప్రకారం గ్రామాల్లోనే నర్సరీల ఏర్పాటు చేసినందున వాటిపై మరింత శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రజలతో మమేకమై ప్రజల కోసం గ్రామాభివృద్ధికి ఏ పనులు చేయాలో చర్చించి నిధుల అందుబాటును దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయాలన్నారు. అందరితో కలిసి సమష్టిగా పని చేయడంతో పనులు మరింత వేగవంతంగా పూర్తి చేయడానికి వీలవుతుందన్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున వాటిపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతో పాటు చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డులకు పంపించాలన్నారు. వీధి దీపాలు పగటి పూట వెలుగకుండా చూడాలని, అనవసర ఖర్చులను తగ్గించాలన్నారు. పన్నులను నూటికి నూరు శాతం వసూలు చేయాలన్నారు. నిబద్ధత, అంకితభావమే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలన్నారు. విధుల్లో చూపే చొరవను బట్టి సిబ్బందికి మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో ప్రశంసాపత్రాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను ప్రోత్సహించడానికి మీకున్న విద్యార్హతలను ఉపయోగించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీకాంత్, ఎంపీడీవోలు సంజీవ్, నటరాజ్,డీపీవో సిబ్బంది కృష్ణ, నూతనంగా ఎంపికైన పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...