శాస్త్రీయ పరిశోధన ఫలితాలు రైతులకు చేరాలి


Sun,April 21, 2019 12:28 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : శాస్త్రీయ పరిశోధన ఫలితాలు వివిధ విస్తరణ పద్ధతుల ద్వారా రైతులకు చేరినప్పుడే వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చు తగ్గి అధిక దిగుబడులు సాధించవచ్చునని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ హాలులో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘ సమావేశం ఖరీఫ్/రబీ 2019-20 సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శాస్త్రవేత్తలు వారి పరిశోధనలను సమతుల ఎరువుల వాడకం, సమగ్ర యాజమాన్య పద్ధతులపై కేంద్రీకరించాలని సూచించారు. రైతులు కూడా శాస్త్ర సాంకేతిక సలహాలను అనుసరించి మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎన్నుకొని, మార్కెట్‌ను, డిమాండ్‌ను బట్టి సాగు చేయాలని సూచించారు. అనంతరం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్.జగదీశ్వర్ మాట్లాడుతూ... గత సంవత్సరం రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ స్థితిగతుల గురించి వివరించారు. ప్రధానంగా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖల సమన్వయంతో వరిలో దోమపోటును, మొక్కజొన్నలో కత్తెర పురుగును, పత్తి పంటలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగులను సమర్థవంతంగా అరికట్టామన్నారు. విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ డి. రాజిరెడ్డి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస, సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్. ఉమారెడ్డి గత సంవత్సరం నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ఉత్తర తెలంగాణలో నెలకొన్న వ్యవసాయ స్థితిగతులను తెలిపారు. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం. రాజేశ్వర్ నాయక్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ మండలంలో కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు విస్తరణ కార్యక్రమాల గురించి వివరించారు. ఉత్తర తెలంగాణలోని 10 జిల్లాల వ్యవసాయ అధికారులు, అనుబంధ రంగాల అధికారులు గత సంవత్సరంలో వారి వారి జిల్లాల్లోని వ్యవసాయ పంటల్లోని సమస్యలు, విస్తీర్ణం, స్థితిగతులపై తెలిపారు. అనంతరం విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల ప్రధాన శాస్త్రవేత్తలు ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, సోయాచిక్కుడు, పత్తి, చిరుధాన్యాల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. వివిధ జిల్లాల నలుమూలల నుంచి వచ్చిన అభ్యుదయ రైతులు వ్యక్తపరిచిన పలు సందేహాలను శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖాధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్తలు, ఉత్తర తెలంగాణ మండలంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, అనుబంధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...