అందుబాటులో అత్యవసర వైద్యం


Fri,April 19, 2019 02:11 AM

ఖలీల్‌వాడీ: జిల్లాకేంద్ర జనరల్ దవాఖానలో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం ఐసీయూ విభాగాన్ని ఏర్పాటుచేసింది. 365 రోజులు రోగులకు సేవ చేయడానికి కార్పొరేట్ స్థాయిలో ఐసీయూను ఏర్పాటుచేశారు. ప్రైవేట్ దవాఖానలు ఐసీయూ పేరుతో రోగులను నిలువున దోచుకుంటున్నాయి. ఒక్క రోజుకు రూ. 10వేల నుంచి రూ. 20 వేల వరకు బిల్లులు వసూలు చేస్తూ పేదలు, నిరుపేదల నడ్డి విరుస్తున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత చొరవతో జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ విభాగాన్ని ఏర్పాటుచేశారు. గతంలో జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సమయంలో ప్రతిరోజు ఐదు నుంచి పది మంది రోగులను హైదరాబాద్‌కు పంపేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. అత్యాధునిక వెంటిలేటర్లతో ఆరు పడకల ఐసీయూను ఏర్పాటు చేశారు. ఐసీయూ అంటేనే ఎమర్జెన్సీ. ప్రమాదపు అంచుల్లోంచి మెరుగైన వైద్యం అందిస్తే ప్రాణం పోయేవరకు కూడా కాపాడవచ్చు. ఈ ఐసీయూలో 24గంటల పాటు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఐదుగురు వైద్యులు, ముగ్గురు సిస్టర్లు, ముగ్గురు వార్డ్‌బాయ్స్, పేషంట్ బాధ్యతను చూసుకోవడానికి ఇద్దరు సహాయకులను నియమించారు. ఇప్పటి వరకు అరవై మందికి చికిత్స చేశారు. ఐసీయూలో ఎక్కువగా క్రిమిసంహారక మందు తాగిన వారు, పాముకాటుకు గురైన వారు, బ్రెయిన్ స్టోక్, పక్షవాతం రోగులకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు.

అత్యాధునిక పరికరాలు...
ప్రస్తుతం ఐదు పడకలతో ఐసీయూ ఏర్పాటు చేయగా, ఆరు అత్యాధుని క వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి పడకకు ఒక వెంటిలేటర్‌ను అత్యవసర సమయంలో ఏ దైన పనిచేయకుండా ఉంటే అప్పటికప్పుడు కొత్తవి ఏర్పాటు చేసేందుకు అదనంగా ఒకటి అందుబాటులో ఉంచారు. విషం తాగిన వ్యక్తులకు ఇతర పదార్ధాలు సేవించినప్పుడు పొట్ట శుభ్రం చేసేందుకు సక్షన్ ఆపరేట్ యంత్రం సిద్ధంగా ఉంది. నాడీ, గుండె పరిస్థితిని ఎప్పటికప్పుడు స్క్రీన్ ద్వారా చూడవచ్చు.

ఆల్ఫాబెడ్ సౌకర్యం....
ఐసీయూలో అనారోగ్యానికి గురైన వారు కొన్ని రోజుల పాటు కదలకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయంలో సాధారణ పడకలపై పడుకుంటే ఇతర సమస్యలు ఏర్పడుతాయని అత్యాధునిక పరికరంతో తయారుచేసిన ఆల్ఫాబెడ్ సౌకర్యాన్ని కల్పించారు. వీటిపై ఎన్ని రోజులు పడుకున్నా ..ఎలాంటి సమస్యలు ఏర్పడవు.

అదనంగా ఇరవై బెడ్లకు అనుమతి...
ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రాములు వినతి మేరకు ఎంపీ కవిత ప్రభుత్వంతో మాట్లాడి అదనంగా ఇరవై బెడ్ల ఐసీయూను మంజూరు చేయించారు. రోగుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఎంపీ కవిత ప్రభుత్వంతో మాట్లాడి రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

అత్యాధునిక పరికరాలతో ఐసీయూ సేవలు...
ప్రైవేటు దవాఖానలకు దీటుగా అత్యాధునిక పరికరాలతో ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ ఏర్పాటు చేశాం. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడేందుకు 24 గంటల పాటు వైద్యులు, సిబ్బంది ఐసీయూలో అందుబాటులో ఉంటారు. ఐసీయూ మంజూరు చేయించిన ఎంపీ కవిత, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
- డాక్టర్ రాములు, జీజీహెచ్ సూపరింటెండెంట్

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...