ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి


Sun,March 24, 2019 12:30 AM

నిజామాబాద్ సిటీ : లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు తక్కువ కాల వ్యవధి ఉన్నందున, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని కలెక్టర్ రామ్మోహన్‌రావు ఆదేశించారు. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని వివిధ నియోజకవర్గాల ఏఆర్వోలతో పాటుగా నోడల్ అధికారులతో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పీవో, ఏపీవోలకు రెండోదశ శిక్షణ కార్యక్రమాలను ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని, అందుకు సంబంధించిన చర్యలను ముందస్తుగానే సిద్ధంగా చేసుకోవాలని నోడల్ అధికారి చతుర్వేదిని ఆదేశించారు. శిక్షణ సందర్భంగా పాల్గొన్న పోలింగ్ సిబ్బంది అధికారులకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోస్టల్ బ్యాలెట్ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కావాల్సిన దరఖాస్తులను వారికి అందజేయాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన నిఘా బృందాలకు వాహనాలు, పోలింగ్ సందర్భంగా ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించేందుకు అవసరమైన వాహనాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారి ఆర్టీవో డీవీ రెడ్డిని ఆదేశించారు. ఇప్పటికే నిఘా బృందాలకు అవసరమైన వాహనాలను సమకూర్చామని, పోలింగ్ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ప్రతిపాదనల మేరకు వాహనాలు సిద్ధం చేస్తామని చెప్పారు.

నామినేషన్ ప్రక్రియ చివరి తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకులను జిల్లాకు పంపించే అవకాశమున్నందున అందుకు కావాల్సిన వాహనం, సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ అతిథి గృహంలో కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని నోడల్ అధికారి రియాజ్‌ను ఆదేశించారు. అభ్యర్థుల చెల్లింపు వార్తలు, ఫిర్యాదులు ప్రతిరోజూ నివేదిక అందజేయాలని, ఈనెల 30, ఏప్రిల్ 6, 11 తేదీల్లో నివేదిక తప్పనిసరిగా ఎన్నికల సంఘానికి పంపించాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా దివ్యాంగ ఓటర్ల వివరాలను సంబంధిత ఏఆర్వోలకు అందజేయాలని, ఓటు వేసేందుకు అవసరమైన వీల్‌చైర్లు, వాహనాల ఏర్పాటు ప్రణాళిక తయారుచేయాలని కలెక్టర్ చెప్పారు. వెబ్‌కాస్టింగ్‌కు అవసరమైన వలంటీర్లను సిద్ధం చేసుకోవాలని, ఇంజినీరింగ్ కళాశాలలను సంప్రదించి ఆసక్తి ఉన్న వలంటీర్లను గుర్తించాలని నోడల్ అధికారి ఉదయ్ కుమార్‌ను ఆదేశించారు. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కారం చేయాలని నోడల్ అధికారి రాజారావును ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో ఆర్.అంజయ్య, మున్సిపల్ కమిషనర్ జాన్ శ్యాంసన్, నోడల్ అధికారులు సింహాచలం, స్రవంతి, మహ్మద్ ముర్తూజా, ఉదయ్‌కుమార్ చతుర్వేది, డీవీ రెడ్డి, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ ఆర్డీవోలు గోపినాథ్, శ్రీనివాస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మొదటి విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు కలెక్టర్ రామ్మోహన్‌రావు తెలిపారు. కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారుల సమక్షంలో 1509 పోలింగ్ కేంద్రాలకు 2430 బ్యాలెట్ యూనిట్లు, 1815 కంట్రోల్ యూనిట్లు , 1958 వీవీ ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు అనుగుణంగా మరో 20శాతం ఈవీఎంలను కేటాయించినట్లు కలెక్టర్ చెప్పారు. వీటన్నింటినీ మొదటిస్థాయి చెకింగ్ పూర్తి చేశామన్నారు. ఇవి ఏ పోలింగ్ కేంద్రానికి ఏ నంబర్ వెళ్తుతుందో తెలియదన్నారు. ఓటర్లకు పారదర్శకతతో కూడిన ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి కంప్యూటర్ ఆధారంతో ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహించామని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ సోమవారంతో ముగియనున్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. పార్లమెంట్ పరిధిలో, జిల్లాలో ప్రశాంతంగా లోక్‌సభ ఎన్నికలు పూర్తి చేయడానికి ప్రతిఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, మున్సిపల్ కమిషనర్ జాన్ శ్యాంసన్, డీఆర్డీవో రమేశ్, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...