కారు జోరు.. ప్రతిపక్షాలు బేజారు


Sun,March 24, 2019 12:30 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల మొదటి అంకం నామినేషన్ల పర్వం పూర్తికాక ముందే టీఆర్‌ఎస్ దూకుడును ప్రదర్శిస్తున్నది. ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత నామినేషన్ వేయక ముందు నుంచే క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మమేకమై ఎన్నికల కదనరంగంలో దూకేందుకు శ్రేణులను సన్నద్ధం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు కవిత దిశానిర్దేశంతో సమరోత్సాహంలో ఉన్నారు. శుక్రవారం నామినేషన్ వేసిన కవిత.. అదే రోజు ప్రచారానికి శ్రీకారం చుట్టడం ప్రతిపక్షాల్లో గుబులురేపింది. తనకు అచ్చొచ్చిన మాక్లూర్ మండలం మానిక్‌బండార్ నుంచి ఎంపీ కవిత ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఆరంభ ప్రచార కార్యక్రమం అదిరిపోయే విధంగా అట్టహాసంగా జరిగింది. పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు ఆమెకు అఖండ స్వాగతం పలికారు. గతంలో ఇక్కడి నుంచే తన ప్రచారాన్ని మొదలుపెట్టిన కవిత... రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ శుక్రవారం రాత్రి మానిక్‌బండార్‌లో పెద్ద ఎత్తున హాజరైన జనం మధ్య రోడ్‌షోలో భాగంగా ప్రసంగించారు. పెద్ద ఎత్తున మహిళలు హాజరై కవితకు ఘన స్వాగతం పలికారు. శనివారం బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లి మండలంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి గ్రామాల్లో రెండో రోజూ ప్రచారాన్ని నిర్వహించారు. అంతకు ముందు జగిత్యాలలో కూడా కవిత ప్రచారం నిర్వహించారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచార పర్వంలో కవిత ముందంజలో ఉన్నారు. కవిత స్పీడ్‌కు కనీసం దరిదాపుల్లోకి కూడా ప్రతిపక్షాలు రావడం లేదు. నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసిన కాంగ్రెస్, బీజేపీలు... బహిరంగ సభలు ఏర్పాటుచేసి ప్రజలకు చేరువవుదామనే ప్రణాళికలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ తన అడ్వకేట్ ద్వారా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కొద్దిమంది బీజేపీ నాయకులతో కలిసి నామినేషన్ వేశారు. నామినేషన్‌లకు చివరి రోజైన సోమవారం ఎంపీ కవితతో పాటు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మరోసారి నామినేషన్ వేసే అవకాశం ఉంది.

దూసుకుపోతున్న కవిత...
క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ ప్రచార పర్వంలో కవిత దూసుకుపోతుండగా... ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ పార్టీ కార్యాలయాలకు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పరిమితమయ్యారు. ఓ వైపు సీఎం కేసీఆర్ సభ సక్సెస్ కావడంతో కొత్త ఉత్సాహంతో ఉన్న ఇందూరు గులాబీదళం... సమరోత్సాహం ప్రదర్శిస్తున్నది. ఎవరో రావాలి.. ఏదో కావాలి అనే చందంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రాష్ట్ర, జాతీయ నాయకుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రెండు పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరికల పరంపర కొనసాగుతున్నది. దాదాపు టీడీపీ ఖాళీ అయిపోయింది. కాంగ్రెస్ నుంచి భారీగా వలసలు వస్తున్నాయి. బీజేపీ నుంచి గడ్డం ఆనంద్‌రెడ్డి పెద్ద ఎత్తున తన అనుచరగణంతో టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. అసలే బీజేపీకి ఏ నియోజకవర్గంలోనూ క్యాడర్ లేకపోవడంతో పాటు ఉన్నవారు కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. బీజేపీ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నది.

అన్నివర్గాల మద్దతు...విరాళాలు
మరోవైపు ఎంపీ కవితకు మద్దతు వెల్లువలా వస్తున్నది. అన్ని కుల సంఘాలు ఆమెకు మద్దతు తెలపడంతో పాటు ఎన్నికల ఖర్చు కోసం స్వయంగా విరాళాలు సేకరించి ఇస్తున్నారు. ఈ విధంగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదిగిన టీఆర్‌ఎస్ పార్టీ ఈసారి మరింత ఘన విజయాన్ని సొంతం చేసుకునే విధంగా ముందుకు సాగుతున్నది. ఎంపీ కవిత అఖండ విజయాన్ని అందించేందుకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు సమిష్ఠిగా కృషిచేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చిన మెజార్టీకి రెండు మూడింతులు అధికంగా ఎంపీ కవితకు వచ్చేలా కృషి చేసేందుకు నియోజకవర్గాల వారీగా ఆయా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో వ్యూహరచన చేస్తున్నారు. సబ్బండవర్ణాల మద్దతు తీసుకుంటున్నారు. ప్రజలతో మమేకమవుతున్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...