విస్తరిస్తున్న క్షయ వ్యాధి


Sun,March 24, 2019 12:30 AM

ఖలీల్‌వాడీ: ఒకరి నుంచి ఒకరికి సోకే అత్యంత ప్రమాదమకరమైన వ్యాధి టీబీ. దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఇంట్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి వ్యాప్తి చెంది ఈవ్యాధి బారినపడుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నది. ముఖ్యంగా ఈ వ్యాధికి గతంలో పూర్తిస్థాయిలో నయం అయ్యే మందులు అందుబాటులో ఉండేవి కావు. కానీ ఇప్పుడు అత్యంత సులువుగా వ్యాధి తీవ్రతను బట్టి తొమ్మిది నెలలు, సంవత్సర కాలం వైద్యంతో పూర్తిగా నయం అవుతోంది. ఈ క్షయ వ్యాధి మైకోబాక్టీరియమ్ ట్యూరోకోల్మాలోసీస్ అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. మైకోబాక్టీరియమ్ ట్యూబర్‌క్యూలోసిస్ అనే బ్యాక్టీరియాను మార్చి 24న 1882లో రాబర్ట్‌కాక్ అనే జర్మన్‌కు చెందిన వైద్యుడు కనుగొన్నాడు. ఈ మూల కారక మైక్రోబ్యాక్టీరియాను కనిపెట్టిన డాక్టర్ రాబర్ట్‌కాక్‌కు 1905లో నోబెల్ పురస్కారం ప్రదానం చేశారు. అప్పటి నుంచి మార్చి 24ను ప్రపంచ టీబీ దినంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. క్షయ వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా ఎదుటి ఆరోగ్యవంతులైన వారికి ఈ వ్యాధి పోకే ప్రమాదం ఉంది. ఆహారం, తాగునీటి ద్వారా ఈ వ్యాధి సంక్రమించదు.

క్షయ లక్షణాలు - సంక్రమణ
ఎక్కువగా ఈ క్షయ ఊపిరితిత్తులకు సోకుతుంది. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం వేళలో తరుచూ జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, చాతిలో నొప్పి, లింపు గ్రంథుల్లో నొప్పి, తెమడలో రక్తచారలు పడడం ఈ వ్యాధి ఒక ముఖ్య లక్షణాలు.

వ్యాధి నిర్ధారణ
క్షయ వ్యాధిని మొదటి దశలో ఉదయం వ్యాధిగ్రస్థుడు ఉమ్మిన తెమడను పరీక్షించి నిర్ధారిస్తారు. ఎక్స్‌రే ద్వారా కూడా నిర్ధారించవచ్చు. కల్చర్ పరీక్ష ద్వారా క్షయ వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సీబీనాట్ అనే పరీక్ష ద్వారా రెండు గంటల్లో వ్యాధిని నిర్ధారించవచ్చు. ఎండీఆర్, టీబీగా నిర్ధారణ అయితే తక్షణమే కిచిత్స ప్రారంభించే అవకాశం ఉంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పుట్టిన పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్ ఇప్పించాలి. దగ్గినా, తుమ్మినా నోటికి గుడ్డ లేదా చేతిరుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మరాదు. ఉమ్మిన దాని పై మట్టిని కప్పించాలి. ఎక్కువ ప్రోటీన్లు లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. వ్యాధిగ్రస్థులు ఉన్న ఇంట్లో ఆరు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే వారికి వైద్యుని సలహామేరకు ఐసోనియోజైడ్ మందులను ఇప్పించాలి. వ్యాధిగ్రస్తులు మందులు వాడుతున్న సమయంలో యాక్షన్, రీయాక్షన్ ఏమి ఉన్నా మందుల వాడకాన్ని ఆపకుండా వైద్యున్ని వెంటనే సంప్రదించడం మేలు.

టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు
నిజామాబాద్ జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా వ్యక్తిగత ఆరోగ్య వివరాల పట్టికతో జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను సేకరిస్తున్నారు. టీబీ వ్యాధిగ్రస్తులను పూర్తి స్థాయిలో గుర్తించి టీబీ వ్యాప్తిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో టీబీ నిర్ధారణ అయిన వ్యక్తుల పేర్లు, వివరాలు తీసుకొని డీఎంహెచ్‌వో కార్యాలయంలో అందజేసేలా చర్యలు తీసుకున్నాం. ఇలా ఎక్కడా లేని విధంగా టీబీ నివారణకు గాను ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాను త్వరలో టీబీ రహిత జిల్లాగా మారుస్తాం.
-డీఎంహెచ్‌వో డాక్టర్ సుదర్శన్


నిర్ధారణ, చికిత్స కేంద్రాలు
క్షయవ్యాధి నిర్థారణ జిల్లాలో పలు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలో డిజిగ్నేటేడ్ మైక్కోస్కోపి సెంటర్లు 16 ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా జనరల్ దవాఖానలో అర్బన్‌లో క్షయ నియంత్రణ కేంద్రాల్లో, మాలపల్లి అర్బన్, ఆర్మూర్ సీహెచ్‌సీ, నందిపేట్ పీహెచ్‌సీ, బాల్కొండ పీహెచ్‌సీతో పాటు ప్రగతి వైద్యశాల, కమ్మర్‌పల్లి, భీమ్‌గల్లి, డిచ్‌పల్లి, వర్ని, ధర్పల్లి, కోటగిరి, బోధన్, నవీపేట్, ఎడపల్లి, మెడికల్ కళాశాలలో చేస్తారు. వీటిలో తెమడ పరీక్షలు నిర్వహిస్తారు. క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల అన్నింటితో పాటు అర్బన్ హెల్త్ సెంటర్‌లలో చికిత్స చేస్తారు. వీటన్నింటిని జిల్లాలోని 8 చికిత్స కేంద్రాలు పర్యవేక్షణలో ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్ జనరల్ దవాఖానలోని క్షయ నియంత్రణ కేంద్రం, నాల్గవ అంతస్తు. ఆర్మూర్, వర్ని, నందిపేట్, డిచ్‌పల్లి, బాల్కొండ, మోర్తాడ్, ధర్పల్లిలో చికిత్స కేంద్రాలు ఉన్నాయి.

ఎక్స్‌రే కేంద్రాలు
క్షయ నిర్ధారణకు జిల్లా ప్రభుత్వ దవాఖానల్లో నాలుగు ఎక్స్‌రే కేంద్రాలు ఉన్నాయి. జిల్లా జనరల్ దవాఖాన, ఆర్మూర్ (సీహెచ్‌సీ) బోధన్( ఏరియా ఆసుపత్రి), ధర్పల్లి (సీహెచ్‌సీ ) మొదలగు కేంద్రాలలో ఎక్స్‌రే కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్షయ వ్యాధిగ్రస్థులు జిల్లా జనాభాలో లక్షకు 2 నుంచి 3 కేసులు నమోదు అవుతాయని క్షయ నియంత్రణాధికారులు చెబుతున్నారు. 2019 జనవరి, ఫిబ్రవరి నెలల్లో జిల్లాలో 1236 టీబీ కేసులు నమోదయ్యాయి.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...