టీడీపీ ఖాళీ


Fri,March 22, 2019 03:26 AM

-టీడీపీ సీనియర్ నాయకుడు అమర్‌నాథ్ బాబు గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
బోధన్, నమస్తే తెలంగాణ : టీడీపీ బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముమ్మలనేని అమర్‌నాథ్‌బాబు ఎట్టకేలకు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఇక బోధన్ నియోజకవర్గంలో టీడీపీ తన ఉనికిని పూర్తిగా కోల్పోయింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ దుక్నం బంద్ అయినట్లే.. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా టీడీపీలోనే కొనసాగుతూ వచ్చిన అమర్‌నాథ్‌బాబు.. చివరికి ఆ పార్టీ నాయకత్వం, ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రాంతంపై చూపుతున్న వివక్షకు విసిగిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే ఆయన తమ పార్టీ నేత చంద్రబాబుపై తీవ్రమైన అసంతృప్తిని వెళ్లగక్కినట్లు తెలిసింది. చివరికి గురువారం అమర్‌నాథ్‌బాబు హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో అమర్‌నాథ్ చేరడంతో బోధన్ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో క్రియాశీలకంగా ఉన్న ఏకైక నాయకుడిని కూడా ఆ పార్టీ కోల్పోయింది.

2014లో తెలంగాణ ఆవిర్భావం నాటికి బోధన్ నియోజకవర్గంలో ఉనికిలో ఉన్న టీడీపీ.. క్రమంగా తన వైభవాన్ని కోల్పోతూ వచ్చింది. మూడేళ్ల కిందటే అనేక మంది నాయకులు ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బోధన్ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు బుద్దె రాజేశ్వర్, వీఆర్ దేశాయ్‌తో పాటు బోధన్ పట్టణం, బోధన్ మండలానికి చెందిన పలువురు మూకుమ్మడిగా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. టీడీపీలో ప్రముఖ నాయకుడిగా ఉన్న వి.మోహన్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో నియోజకవర్గంలో టీడీపీ పూర్తిగా బలహీన దశకు చేరుకుంది. ఈ దశలో ఒక్క అమర్‌నాథ్‌బాబు, ఆయన అనుచరులు టీడీపీలో కొనసాగుతూ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడంపై అమర్‌నాథ్‌బాబు తన నిరసన వ్యక్తం చేశారు.

ఏ కాంగ్రెస్ పార్టీనైతే భూస్థాపితం చేయాలన్న ఆశయంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారో... అదే కాంగ్రెస్‌తో చంద్రబాబు ఎన్నికల పొత్తు పెట్టుకున్న తీరు తనను బాధిస్తున్నట్లు ఆయన పలుమార్లు తన అనుచరులతో పాటు టీఆర్‌ఎస్ నాయకులతో కూడా చెప్పుకుని బాధ పడిన సందర్భాలు ఉన్నాయి. అనేక ఏళ్లపాటు టీడీపీలో కొనసాగుతున్న అనుబంధంతో వెంటనే పార్టీని విడిచిపెట్టలేకపోతున్నట్లు కూడా గత ఎన్నికల సందర్భంగా ఆయన చెప్పారు. చివరికి, పాత ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు నామా నాగేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా ఆయనతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరాలని అమర్‌నాథ్ నిర్ణయించుకున్నారు.

నామా నాగేశ్వర్‌రావుతో కలిసి గురువారం కేటీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు.
గురువారం ఆయన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, బోధన్ శాసనసభ్యుడు మహ్మ ద్ షకీల్‌ను కలుసుకున్నారు. బోధన్ నియోజకవర్గంలో తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తు న టీఆర్‌ఎస్‌లో చేరికల కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనున్నట్లు అమర్‌నాథ్‌బాబు నమస్తే తెలంగాణకు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్థి పథంలో ప్రయాణిస్తోందని, దేశంలోనే గొప్ప ఆదర్శ నాయకుడిగా కేసీఆర్ నిలిచారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం నచ్చటంతో పాటు చంద్రబాబు విధానాలతో విసిగిపోయి తాను టీఆర్‌ఎస్ చేరుతున్నట్లు ఆయన చెప్పారు.

సిన్సియారీటీ ఉన్న రాజకీయ నాయకుడిగా పేరొందిన అమర్‌నాథ్‌బాబు స్వగ్రామం బోధన్ మండలం పెంటాఖుర్దు. విద్యార్థి నాయకుడిగా ఉన్న రోజుల్లో 1983లో టీడీపీ ఆవిర్భావంతో ఆయన ఆ పార్టీలో చేరారు. 1987-88లో ఎన్టీఆర్ స్థాపించిన జాతీయ రాజకీయ పరిజ్ఞాన పరిషత్‌లో శిక్షణ పొందారు. ఇక అప్పటి నుంచి 2018 వరకు మధ్యలో కొన్నేళ్లు తప్ప మిగతా కాలమంతా హైదరాబాద్‌లోని టీడీపీ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయం ఇన్‌చార్జిగా ఆయన పనిచేస్తూ వచ్చారు.
ఈ కారణంగా అమర్‌నాథ్‌కు గత మూడు దశాబ్దాలుగా వివిధ పార్టీల నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. 1999-2001లో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వ్యవహరించారు.2009 నుంచి ఇప్పటి వరకు టీడీపీ బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉంటూ వచ్చారు. మూడేళ్ల కిందట టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులై రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...