మూడు రోజులు మద్యం విక్రయాలు బంద్


Fri,March 22, 2019 03:21 AM

నిజామాబాద్ క్రైం : పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మద్యం, కల్లు విక్రయాలు బంద్ పాటించాలని సంబంధిత ఎక్సైజ్ అధికారులు ఉత్తర్వులు వెలువరించారు. ఈ నెల 20 సాయంత్రం 6 నుంచి 22 సాయంత్రం 6 గంటల వరకు మూడు రోజుల పాటు మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ చంద్ర ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం 6 గంటలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు, బార్లు, కల్లు బట్టీలకు ఎక్సైజ్ అధికారులు సీల్ వేశారు. మద్యం షాపులు తిరిగి 22వ తేదీ సాయంత్రం 6 గంటల అనంతరం తెరుచుకోకొవచ్చని జిల్లా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నంద గోపాల్ పేర్కొన్నారు.

జోరుగా మద్యం విక్రయాలు,పట్టించుకోనిఅధికారులు..
జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు పురస్కరించుకొని మద్యం అమ్మకాలు బంద్ చేయడంతో మందు బాబులు తీవ్ర అవస్థలు పడ్డారు. దీనిని అదునుగా చేసుకొని పలువురు అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహించారు. రెట్టింపు ధరలకు మందు విక్రయాలు జరుపుతూ జేబులు నింపుకున్నారు. జిల్లా కేంద్రంలోని మిర్చి కౌంపౌండ్, శివాజీనగర్, వర్ని రోడ్డు చౌరస్తా, సుభాష్‌నగర్, కంఠేశ్వర్, గౌతం నగర్, కోటగల్లి, కసాబ్ గల్లి, వినాయక నగర్ ఏరియాలోని పలువురు రెండు రోజుల ముందు నుంచే భారీగా మద్యం కొనుగోలు చేసుకొని రహస్య ప్రాంతాల్లో భద్రపర్చారు. ఎన్నికలకు తోడు గురువారం హోలీ పండుగా రావడంతో మందు తాగేవారు అధిక ధరలకు కొనుగోలు చేసేందుకు అక్రమంగా మద్యం విక్రయించే ఏరియాలకు చేరుకున్నరు.

దీనిని క్యాష్ చేసుకున్న అక్రమ మద్యం విక్రయదారులు ఒక్కో బీర్ బాటిల్ వెనుకాల ఎమ్మార్పీ కన్నా 30 రూపాయల వరకు అధికంగా దండుకుంటున్నారు. విస్కీ బాటిల వెనక క్వార్టర్‌కు 40 రూపాయల వరకు అధికంగా వసూలు చేశారు. జిల్లా కేంద్రంలోని చాలా ఏరియాల్లో జోరుగా అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగినా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...