కాంగ్రెస్ అభ్యర్థి ఎదురీత


Thu,March 21, 2019 12:52 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీలో ఆయన అభ్యర్థిత్వంపై నాయకులెవరికి ఇష్టం లేకపోవడంతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. రెండు పర్యాయాలు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొంది మూడోసారి కూడా బరిలో నిలిచి ఓటమి పాలైన మధుయాష్కీ.. నాలుగోసారి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు భయపడి పారిపోయారు. ఎంపీ కవిత ఇక్కడ బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ఆమె గెలుపు అనివార్యమని ముందే గ్రహించిన యాష్కీ.. ఇక్కడి నుంచి బిచానా సర్దేశారు. భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అధిష్ఠానం బరిలో నిలపడంతో ఉసూరుమంటూ మళ్లీ నిజామాబాదే యాష్కీకి దిక్కైంది. దీంతో చేసేదేమీ లేక, మరో గత్యంతరం కానరాక నిజామాబాద్ బరిలో నిలిచేందుకు అయిష్టంగానైనా పెట్టేబేడ సర్దుకొని మళ్లీ ఇక్కడికి వస్తున్నారు. తన అభ్యర్థిత్వం ఖరారు అయిన నేపథ్యంలో జిల్లాలోని ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులకు ఫోన్లు చేసి తనకు సహకరించాల్సిందిగా కోరారు. అయితే మధుయాష్కీపై ముభావంగా ఉన్న నేతలంతా అన్యమనస్కంగానే తమ అభిప్రాయాన్ని తెలిపినట్లు తెలిసింది. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసే మధుయాష్కీకి ఒంటరి పోరు తప్పేలా లేదు. ఆ పార్టీ నేతలే ఆయనపై సహాయ నిరాకరణ కొనసాగించేలా పరిస్థితి కనిపిస్తున్నది.

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఆశించిన కేశవేణు.. మధుయాష్కీ కారణంగానే తనకు టికెట్ రాలేదని గుర్రుగా ఉన్నా డు. అరికెల నర్సారెడ్డి, నగేశ్‌రెడ్డి తదితరులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అధిష్ఠానం నిర్ణయంపై వారం తా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపతిరెడ్డికి టికెట్ ఇవ్వడంపై వీరం తా తీవ్ర అసంతృప్తితో ఉండి ఇంకా అలకపాన్పు వీడలేదు. మరోవైపు డీసీసీ అధ్యక్షుడిగా మానాల మోహన్‌రెడ్డికి అవకాశం ఇవ్వడంపై కూడా పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి ఉంది. ఈ పరిణామం పార్టీలోని గ్రూపు రాజకీయాలు భగ్గుమనేలా చేశాయి. వీటన్నింటికి దూరం గా వెళ్లిపోదామని భావించిన మధుయాష్కీ.. మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేసేలా పరిస్థితులు మారడంతో చేసేదేమీ లేక ఈ ఎన్నికల్లో ఎదురీతకు సిద్ధ్దమయ్యారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...