టీఆర్‌ఎస్‌లో సమరోత్సాహం


Thu,March 21, 2019 12:51 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సక్సెస్ జిల్లా టీఆర్‌ఎస్ శ్రేణుల్లో వెయ్యేనుగుల బలాన్నిచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసే విధంగా నయాజోష్ తెచ్చింది. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి మంగళవారం జరిగిన భారీ బహిరంగ సభ పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా సీఎం కేసీఆర్ కోసం గంటల తరబడి ఓపికగా ఎదురుచూశారు. ఆసాంతం ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. సీఎం కేసీఆర్ ఇందూరు వేదికగా మరోమారు తన విశ్వరూపాన్ని చూపారు. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇదే వేదికగా ప్రతిపక్షాలను తనదైన శైలిలో తూర్పారబట్టిన కేసీఆర్.. మళ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల వైఖరిని కడిగేశారు. ఈ రెండు పార్టీలు అవలంభిస్తున్న విధానాన్ని ఎండగట్టారు. ప్రజలకు విడమరిచి చెప్పారు. ఆయన ప్రసంగించిన ప్రతి మాట బాకుల్లా ప్రతిపక్షాల గుండెల్లో దిగాయి. ప్రజలను ఆకట్టుకున్నాయి. జిల్లా రాజకీయాల్లో సీఎం కేసీఆర్ సభ ప్రకంపనలు సృష్టించింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రతిపక్షాలకు ఈ సభ ముచ్చెమటలు పట్టించింది. ఇప్పటికే పలాయనవాదం ఎత్తుకున్న ప్రతిపక్షాలకు ఏం చేయాలో మింగుడుపడని పరిస్థితి ఏర్పడింది. టీఆర్‌ఎస్ శ్రేణులకు ఈ పరిణామం రెట్టించిన ఉత్సాహాన్ని అందించింది. జనం ప్రభంజనంలా తరలివచ్చి సభను విజయవంతం చేయడంతో అదే ఊపుతో, కొత్త జోష్‌తో పార్లమెంట్ ఎన్నికల బరిలో దూకేందుకు గులాబీశ్రేణులు సమరోత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.

అన్నీ తానై...
ఎంపీ కవిత జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీతానై వ్యవహరించి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అందరు అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకునే క్రమంలో కవిత కృషి ఎనలేనిది. ఈ పరిణామం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బాగా కలిసి వస్తోంది. ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కేసీఆర్ సభా వేదికగా పోటాపోటీగా ఎంపీ కవితకు మెజార్టీ తీసుకువస్తామని శపథం చేశారు. గడిచిన 2014 ఎన్నికల్లో మధుయాష్కీపై ఎంపీ కవిత 1,67,184 ఓట్ల భారీ మెజార్టీని సాధించి కొత్త రికార్డును సృష్టించారు. ఇప్పుడున్న పరిస్థితులు టీఆర్‌ఎస్‌కు మరింత కలిసివచ్చాయి. జిల్లాకు కేబినెట్‌లో బెర్త్ దక్కి ప్రశాంత్‌రెడ్డికి మంత్రి పదవి వరించింది. జిల్లాపై ఆది నుంచి కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానానికి నిదర్శనంగా నిలిచింది. ప్రశాంత్‌రెడ్డి అన్నీతానై అందరి సమష్టి కృషితో ఎంపీ కవితకు నాలుగు లక్షల పై చిలుకు మెజార్టీ తీసుకురావడమే లక్ష్యంగా పనిచేసేందుకు కంకణబద్ధులై ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ సభ నిర్వాహణలో అన్నీతానై వ్యవహరించిన ప్రశాంత్‌రెడ్డి.. సభ సక్సెస్‌లో కీలకంగా వ్యవహరించారు. కాగా, ఈ సభలో కేసీఆర్ జిల్లాపై తన అభిమానాన్ని చాటుకొని ఆనాటి మధుర స్మృతులను పంచుకున్నారు. పోచంపాడ్ ప్రాజెక్టు పైనే మలిదశ ఉద్యమానికి సారథ్యం వహించే కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన ఆయన.. ఖలీల్‌వాడీలో తొలిసభను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ ఆవిర్భావ క్రమంలోనే జడ్పీ పీఠాన్ని టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టి ఉద్యమానికి ఆక్సిజన్ ఇచ్చారని, తన వెన్నంటి ఉన్నారని గుర్తు చేసుకొని ఇందూరు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిణామం జిల్లా వాసుల్లో మధురానుభూతిని నింపింది.

పలు హామీలపై హర్షాతిరేకాలు...
దీంతో పాటు కొత్త మండలాలను కూడా కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే మోస్రా, చందూర్ మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఆలూర్, డొంకేశ్వర్‌లను మండలాలుగా మారుస్తామని చెప్పారు. బోధన్ మండలంలోని సాలూరా కూడా మండల కేంద్రం కానున్నది. ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు కేసీఆర్ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఎర్రజొన్నలు, పసుపు రైతుల విషయంలో కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ఆనాడు కాంగ్రెస్ కాల్పులు జరిపితే.. ఎర్రజొన్న రైతులకు టీఆర్‌ఎస్ బకాయిలు ఇప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో ఎర్రజొన్న రైతులకు న్యాయం జరిగే విధంగా తీపి కబురును అందించనున్నానని ప్రకటించారు. పసుపు రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా మహిళా సంఘాలతో ఎక్కడికక్కడ పసుపును కొనుగోలు చేసి తెలంగాణ బ్రాండ్ పేరుతో దేశవ్యాప్తంగా విక్రయాలు చేస్తామని, ఈ క్రమంలో పసుపు రైతుకు గిట్టుబాటు ధర దక్కుతుందని తెలిపారు. దీంతో సభకు అత్యధికంగా వచ్చిన రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పార్లమెంట్ ఎన్నికలకు మరి కొద్ది రోజులే మిగిలి ఉన్న ఈ సమయంలో, టీఆర్‌ఎస్ శ్రేణులకు కేసీఆర్ బహిరంగ సభ నూతనోత్తేజాన్ని నింపింది. రెట్టించిన ఉత్సాహంతో ఎంపీ కవితను భారీ మెజార్టీ వచ్చేలా గెలిపించుకునేందుకు కార్యక్షేత్రంలోకి దిగారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...