టీడీపీ దుక్నం బంద్


Thu,March 21, 2019 12:51 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలో టీడీపీ దుకాణం బంద్ అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమక్రమంగా తన ఉనికి కోల్పోతూ వచ్చిన టీడీపీ.. ప్రస్తుతం నాయకులు, క్యాడర్ ఎవరూ లేని పార్టీగా మిగిలిపోయింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో అనైతిక పొత్తుకు తెరలేపి ప్రజల వద్ద పూర్తిగా చులకనైపోయింది. ఈ పార్టీ కనీసం ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేక చతికిలబడింది. అధిష్ఠాన అసంబద్ధ, అనైతిక నిర్ణయాలతో ప్రజల వద్ద విశ్వాసం కోల్పోయిన ఈ పార్టీ.. క్రమంగా తన ఉనికిని కూడా కోల్పోయింది. ఒకప్పుడూ ఓ వెలుగు వెలుగిన తెలుగుదేశం పార్టీ... చంద్రబాబు అనాలోచిత వైఖరులకు బలైంది. దీన్ని నమ్ముకొని ఎంతోమంది తమ జీవితాలు త్యాగం చేసి పార్టీ సిద్ధాంతం కోసం పనిచేశారు. ఎన్టీఆర్ విధానాలకు పూర్తి విరుద్ధంగా కొనసాగుతూ వచ్చిన టీడీపీలో.. సిద్ధాంతం అనేదే లేకుండా పోయింది. దీంతో దీన్నే నమ్ముకున్న తెలుగు తమ్ముళ్ల పరిస్థితి అధోగతిలా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో చేష్టలుడిగి ఉండిపోయిన తెలుగు తమ్ముళ్లు, పూర్తి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. యూజ్ అండ్ త్రో విధానాన్ని అవలంభించే చంద్రబాబు పద్ధతినే పుణికిపుచ్చుకున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో అంతో ఇంతో లాభపడాలని పొత్తు పెట్టుకొని ఆ తర్వాత టీడీపీని ముడ్డిమీద తన్నింది.

తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేని దుస్థితిలో ఆ పార్టీ ఉండిపోయింది. ఇక పోటీ చేయనప్పుడు రాజకీయాల్లో విలువ లేనప్పుడు, ఇజ్జత్ పూరా పోయినప్పుడు పార్టీలో ఉండి లాభం లేదనుకున్న మిగిలిపోయిన క్రియాశీలక నాయకగణం టీఆర్‌ఎస్‌లో చేరింది. టీడీపీలో మొదటి నుంచి బలంగా పనిచేస్తున్న బాలకిషన్, టీడీపీ అనుబంధ విద్యార్థి విభాగం టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు పుప్పాల రవి, టీడీపీ యూత్ అధ్యక్షుడు సతీశ్ యాదవ్, టీడీపీ బీసీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవిదాస్, జె. సురేశ్, టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అఫ్రోజ్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యూసుఫ్ తదితరులు బుధవారం ఎంపీ కవిత సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీలో మిగిలిపోయిన ముఖ్య కార్యవర్గమంతా కారెక్కడంతో సైకిల్ ఆనవాళ్లు కోల్పోయింది. దశాబ్దాల చరిత కలిగిన టీడీపీ ఉనికి భూస్థాపితమైంది. ఒకప్పుడు టీడీపీకి నిజామాబాద్ జిల్లా కంచుకోట కాగా.. ఇప్పుడు ఆ పార్టీ కనుమరుగైంది.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...