సుస్థిరమైన గ్రామాభివృద్ధితోనే దేశప్రగతి


Wed,March 20, 2019 02:21 AM

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ: దేశం ప్రగతి సాధించాలంటే గ్రామాల్లో సుస్థిరమైన అభివృద్ధి జరగాలని టీయూ రిజిస్ట్రార్ డి.బలరాములు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్, టీయూ సంయుక్తంగా వారం రోజుల పాటు నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం మంగళవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా టీయూ రిజిస్ట్రార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలు మనుగడ సాధించాలంటే వనరుల విధ్వంసం ఆగాలని అన్నారు. గురువుల ప్రాముఖ్యత జీవితంలో చాలా గొప్పదని అన్నారు. ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ విచ్చలవిడిగా జరుగుతున్న వనరుల విధ్వంసంతో పర్యావరణం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధివైపు వెళ్లకపోతే మానవాళి మనుగడ కష్టమని అన్నారు. ప్రధానంగా చైతన్యవంతమైన గ్రామీణ సమాజమే కీలకమని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం ప్రొఫెసర్ కరణం నరేందర్ మాట్లాడుతూ.. పథకాలు, ప్రణాళికల తయారీ, అమలులో ప్రజల భాగస్వామ్యం ఉండాలని, గ్రామీణ భారతంలోని సమస్యల మూలాల్లోకి వెళ్లి వసతులు కల్పించాల్సి ఉంటుందన్నారు. గ్రామాల్లో వలసలు నిరోధించి ఉపాధి అవకాశాలు పెంపొందించాలని అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఆరతి మాట్లాడుతూ.. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ద్వారా ప్రముఖులు, సీనియర్లు హాజరై శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ కె.రాజారాం మాట్లాడుతూ.. ఎంజీఎన్‌సీఆర్‌ఈ, టీయూ సంయుక్తంగా ఈ ఎఫ్‌డీపీ నిర్వహించడానికి అనుమతిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సోషల్ సైన్స్ డీన్ కె.శివశంకర్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె.సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...