ఇందూరు సభ ప్రతిష్ఠాత్మకం


Mon,March 18, 2019 02:37 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 19న నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, రవాణా, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎంపీ కల్వకుంట్ల కవితను రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఆదివారం నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డిలతో కలిసి మంత్రి గిరిరాజ్ మైదానంలోని బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్ల పై చర్చించారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఈ మేరకు ఇందూరు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలందరం కలిసికట్టుగా పనిచేసి ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 30 నుంచి 35వేల మంది సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రెండు, రెండున్నర లక్షల మంది ప్రజలతో భారీ బహిరంగ సభను నిజామాబాద్ జిల్లాలో కనివినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామన్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ ఈ బహిరంగ సభ ఏర్పాట్లను బ్రహ్మాండంగా చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల నుంచి వచ్చే ప్రజలందరికీ ఒక వైపు, నిజామాబాద్ రూరల్ నుంచి వచ్చే ప్రజలకు ఓ వైపు, నిజామాబాద్ అర్బన్ నుంచి వచ్చే ప్రజలకు ఓ వైపు ఎక్కడికక్కడే పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, తాగునీటి సదుపాయం కల్పిస్తున్నామన్నారు.

రాష్ట్రంపై కేంద్రం వివక్ష...
నాలుగున్నర సంవత్సరాలుగా తెలంగాణకు ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రూపాయి సహాయం చేయలేదన్నారు. మన హక్కుగా వచ్చిందే కాని, అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఎన్ని సార్లు సీఎం కేసీఆర్ ప్రధానిని కలిసి నిధులు కేటాయించమని విన్నవించినా పెడచెవిన పెట్టారన్నారు. ఒకవైపు ఆంధ్రలో పోలవరం ప్రాజెక్టుకు బీజేపీ ప్రభుత్వం నిధులు కేటాయించి కట్టిస్తున్నదని, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు ఇవ్వమని అడిగితే రూపాయి కేటాయించలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు యాభై శాతం నిధులివ్వండి, యాభై శాతం నిధులు మేము ఖర్చు చేసుకుంటామని చెప్పినా పెడచెవిన పెడుతున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ ప్రజలకు నిధులు కేటాయించడం లేదని, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భాగం కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతదేశ ప్రజలు కాదా? మరీ ఎందుకు ఆంధ్రకు డబ్బులిస్తున్నారు..

తెలంగాణకు డబ్బులివ్వడం లేదనే కోపంతో తెలంగాణ ప్రజలు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఆ సందర్భంలో ఈ సభ జరుగుతున్నదని, అందుకే సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో బలం పెంచే అవసరం చాలా ఉన్నదని చెప్పారు. పదహారు ఎంపీ స్థానాలు గెలిపించుకొని ఢిల్లీలో సీఎం కేసీఆర్ స్థానాన్ని పెంచే విధంగా కృషి చేయాలన్నారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు తెచ్చుకునే విధంగా ఈ ఎన్నిక ఉపయోగపడాలని సీఎం కేసీఆర్ ప్రజలకు విడమరిచి చెబుతారని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం కూడా కార్యకర్తల్లా పనిచేసి కవితకు 4లక్షల పై చిలుకు మెజార్టీతో రాష్ట్రంలోనే నంబర్‌వన్ మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. సభాస్థలిని పరిశీలించిన వారిలో నిజామాబాద్ నగర మేయర్ ఆకుల సుజాత, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్‌రావు, జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతికుమార్, కార్పొరేటర్ సాయిరాం, నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, శ్రీనివాస్ గౌడ్, ఆకుల శ్రీశైలం, సత్యప్రకాశ్, నుడా డైరెక్టర్ కె.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...