నాలుగింటిపై నజర్


Sun,March 17, 2019 03:33 AM

-గ్రామాల సమగ్రాభివృద్ధి..పార్టీ పటిష్టత.. అభివృద్ధి, సంక్షేమ ఫలాలుఅందించడంపై ఎంపీ కవిత దృష్టి
-నియోజకవర్గాల వారీగా గులాబీ శ్రేణులతో మమేకం
-కొత్త ఉత్తేజాన్ని నింపుతున్న కవిత సమీక్షలు
-టీఆర్‌ఎస్‌లో కోలాహలం..ప్రతిపక్షాల్లో కలవరం
నిజామాబాద్ ప్రతినిధి/నమస్తే తెలంగాణ: అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా చూడడం, గ్రామాల సమగ్రాభివృద్ధి, పార్టీ పటిష్టతపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత దృష్టిసారించారు. శనివారం ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులతో ఎంపీ కవిత మండలాల వారీగా సమావేశమయ్యారు. ఉదయం ఆర్మూర్‌లో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి నివాసంలో, సాయంత్రం వేల్పూర్‌లో రోడ్డు, భవనాలు, రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించారు. పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలతో కలిసి సమావేశాల్లో ఆమె చర్చించారు. ఆర్మూర్‌లో ఎంపీ కవితను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి కలిశారు. అన్ని సంఘాలతో సమన్వయం చేసుకోవాలని ఎంపీ కవిత ఆయనకు సూచించారు. వేల్పూర్‌లో 21మంది స్వతంత్రంగా గెలిచిన సర్పంచులతో పాటు విపక్ష పార్టీలకు చెందిన 21 మంది సర్పంచులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎంపీ కవిత, మంత్రి ప్రశాంత్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వాలు చేయలేదని టీఆర్‌ఎస్‌లో చేరిన సర్పంచులు అన్నారు.

విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. నాయకుల మధ్య సమన్వయం అవసరమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన సర్పంచులు వారి విధులు, బాధ్యతలు తెలుసుకుంటూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈనెల 19న నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజీ మైదానంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంపీ కవిత కోరారు. సభకు భారీగా జనం హాజరవుతారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా సాయంత్రం బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఫలితాలకు మించి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సాధించాలని ఎంపీ కవిత కోరారు. గ్రామాన్ని యూనిట్‌గా చేసుకొని ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.

22న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్‌గౌడ్ విజయం సాధించేలా అందరూ కృషిచేయాలని కోరారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని, దీనికి మన నాయకుడు కేసీఆర్ విజన్ కారణమని అన్నారు. గొప్ప నాయకుని అడుగుజాడల్లో మనమంతా నడుస్తుండడం మనందరికీ గర్వకారణమన్నారు. రెండు ఎంపీ స్థానాలతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు టీఆర్‌ఎస్, ఒక ఎంఐఎం అభ్యర్థితో కలిపి మొత్తం పదిహేడు పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటే... తెలంగాణ ప్రయోజనాలను సాధించుకోవడం సులువు అవుతుందని వివరించారు. కష్టపడే వాళ్లకు పార్టీలో ఎప్పుడూ గుర్తింపు లభిస్తుందన్న విషయం మనందరికీ తెలుసు అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తూ, మన ఇమేజ్‌తో పాటు పార్టీ ఇమేజ్‌ను కూడా పెంచాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, టీఎస్ రెడ్‌కో చైర్మన్ ఎస్‌ఏ అలీం, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు దాదన్నగారి విఠల్‌రావు, డాక్టర్ మధుశేఖర్, ఈగ గంగారెడ్డి, డి.రాజారాం యాదవ్ పాల్గొన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...