దాడిని నిరసిస్తూ రాస్తారోకో


Sun,February 17, 2019 03:16 AM

నవీపేట : డబ్బులు ఇవ్వనందుకు ఓ వ్యక్తిపై దాడి చేయగా... దీనిని నిరసిస్తూ బాధితుడు పలువురి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలో నిర్వహించే మేకల సంతను వేలం పాటలో దక్కించుకున్న కాంట్రాక్టర్ సలీం వర్గీయులు టాక్స్ డబ్బులు ఇవ్వనందుకు నవీపేట మండలం సుభాష్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ పోతుల శివపై దాడికి దిగారు. శనివారం మేకల సంతలో ఆటోకు సంబంధించిన టాక్స్ డబ్బులు ఇవ్వాలని సలీం, అతని అనుచరులు శివను అడగగా... ఇంకా బోణీ కాలేదని, స్థానికుడినేనని తర్వాత డబ్బులు ఇస్తానని శివ సమాధానం ఇచ్చాడు. డబ్బులు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని సలీం, ఆయన అనుచరులు శివపై దాడికి దిగారు. దాడిని నిరసిస్తూ బీజేపీ మాజీ నాయకుడు భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మేకల సంతకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బాసర రోడ్డుపై ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న వారిని సముదాయించారు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం కాంట్రాక్టర్ సలీంపై శివ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పార్కింగ్ కాంట్రాక్టర్ సలీం, ఆయన అనుచరులతో పాటు అనుమతి లేకుండా రాస్తారోకో నిర్వహించిన భరత్‌రెడ్డి, పలువురిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...