కిసాన్ సమ్మాన్ సగం మందికే..!


Sat,February 16, 2019 02:41 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రధాని నరేంద్రమోడీ రైతుబంధు తరహాలోనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. పేరుకు రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్నామనే కానీ.. రైతుబంధు పథకానికి ఈ కిసాన్ సమ్మాన్ నిధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఈ పథకం ద్వారా కేంద్రం ఇచ్చేదే అరకొర. ఆపై సవాలక్ష కొర్రీలు పెట్టింది. నిబంధనల ఆంక్షలతో రైతులందరికీ ఈ పథకం అందకుండా చేస్తున్నది. రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ. 4వేలు, రెండు పంటల కోసం ఏడాదికి రూ. 8వేలను అందిస్తున్నది. రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నది. ఎలాంటి ఆంక్షలు విధించలేదు. తాజాగా ఈ పెట్టుబడి సాయం మొత్తాన్ని ఈ వానాకాలం (ఖరీఫ్) నుంచి మరో రూ.వెయ్యి పెంచి ఎకరాకు రూ.5వేల చొప్పున, రెండు పంటల కోసం ఏడాదికి రూ. 10వేల చొప్పున అందిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం ఏడాదికి మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున మొత్తం రూ. 6వేలు అందజేస్తారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు జిల్లా వ్యవసాయాధికారులకు ఆదేశాలు అందాయి. దీని కోసం సర్వే చేపట్టాలని అధికారులు సూచించారు. తాజాగా ఏఈవోలు క్షేత్రస్థాయిలో నిబంధనల మేరకు ఎవరు దీనికి అర్హులో తేల్చేందుకు సర్వే నిర్వహిస్తున్నారు.

సగం మందే అర్హులు...
డిసెంబర్1, 2018 తేదీని అనుసరించి రైతులు వద్ద సర్వే ద్వారా వివరాలను సేకరిస్తున్నారు. ఈ పథకానికి అర్హులుగా తేలాలంటే సవాలక్ష కొర్రీలు పెట్టారు. రైతుబంధు ద్వారా లబ్ధిపొందిన రైతుల్లో సగం మంది కూడా ఈ పథకానికి అర్హులుగా వచ్చేలా లేరు. కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల ఆంక్షలు విధించింది. జిల్లాలో రైతుబంధు పథకం ద్వారా గత వానాకాలం (ఖరీఫ్) నుంచి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. జిల్లాలో మొత్తం 2, 03,503 మంది రైతులను రైతుబంధు పథకం కోసం వ్యవసాయశాఖ అధికారలు నమోదు చేశారు. వీరి కోసం ఎకరాకు రూ.4వేల చొప్పున ఒక పంట కోసం రూ. 203.76 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ఇదే పద్ధతిన ఇప్పుడు మొదలైన యాసంగి (రబీ) సీజన్‌కు సైతం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. వచ్చే వానాకాలం (ఖరీఫ్) కోసం ఎకరాకు రూ. 5వేల చొప్పున అందించనున్నది. కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నిబంధనల మూలంగా దాదాపు లక్ష మంది రైతులకు జిల్లాలో మేలు జరగనుంది. ఆ పథకం ద్వారా అందించే రూ.2వేల చొప్పున రూ.20 కోట్లు ఒక పంటకు అందనున్నాయి. ఏడాది కాలానికి మొత్తం రూ.60కోట్ల మేర జిల్లా రైతాంగానికి లబ్ధి జరగనుంది.

ఆంక్షలు ఇవే..
రైతు కుటుంబంలో మొత్తం కలిపి ఐదెకరాల లోపు మాత్రమే ఉండాలి. ఆపై ఉంటే ఈపథకం వర్తించదు. ఉద్యోగులకు పెట్టుబడి సాయం అందించరు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగులకు, పింఛన్ రూ.10వేల పైబడి తీసుకుంటున్న వారికి కూడాఈ పథకానికి అర్హులు కారు. క్లాస్-4, గ్రూప్-డి ఉద్యోగస్తులు అర్హులు. పింఛన్ దారుడు ఆదాయపన్ను చెల్లించి ఉంటే ఈ పథకం వర్తించదని నిబంధన పెట్టారు. ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు..ఇలా ప్రొఫెషనల్ వృత్తులు చేసుకునే వారికి కూడా దీన్ని మినహాయిస్తారు. కేవలం చిన్న, సన్నకారు రైతులకు ఇది దక్కనుంది.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...