నగరంలో ఫిష్ మార్కెట్


Fri,February 15, 2019 12:44 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: పేదరికానికి కులం, మతం ఉండదని, పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం కలెక్టరేట్ మైదానంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నగరంలో ఎకరం జాగాలో రూ. 50లక్షలతో ఫిష్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. ఇప్పటికే హైమదీబజార్‌లో కూరగాయలు, మాంసం, చేపల కోసం ఓ మార్కెట్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ప్రత్యేకంగా చేపల విక్రయాల కోసం ఎకరం జాగాలో మరో ఫిష్ మార్కెట్‌ను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. గంగపుత్రుల కుల భవనం కోసం ఇప్పటికే అర్సపల్లిలో ఉన్న స్థలంలో అవకాశం మేర భవనం నిర్మించేందుకు నిధులు కేటాయిస్తానని ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఎన్ని కలలు కన్నా ఆ కలలు నిజం కావాలంటే అధికారులు పగలు, రాత్రి కష్టపడాలని, ఆ విధంగా కష్టపడడంతోనే మత్స్య కార్మికుల ప్రేమను పొందారన్నారు. పేదరికానికి కులం, మతం అనేది ఏదీ ఉండదని సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఇదే మాటను చెబుతారని తెలిపారు. పేద వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. దాని కోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేసినా పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి చేరే విధంగా రూపొందిస్తున్నామని వివరించారు.

చేపలను ఎగుమతి చేయడమే లక్ష్యం ..
రాష్ట్రం నుంచి దాదాపు పది నుంచి 11 లక్షల టన్నుల చేప పిల్లలను తెలంగాణ నుంచి ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. మన అవసరాలకే కాకుండా పక్క రాష్ర్టాలకు, ఇతర దేశాలకు పంపే స్థాయికి మన మత్స్య కార్మికులు ఎదిగేందుకు ఆ దిశగా సీఎం కృషి చేస్తున్నారని వివరించారు. సీఎం కేసీఆర్ మత్స్య శాఖకు సంబంధించి అన్ని విషయాలను ప్రధానికి వివరించడంతో జాతీయ స్థాయిలో ఒక మత్స్య పారిశ్రామిక శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో కూడా మనకు పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని ఎంపీ తెలిపారు.

మన పథకాలు దేశానికే ఆదర్శం..
రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షే మ పథకాలతో జరుగుతున్న అభివృద్ధి చూపి జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నామని ఎంపీ అన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు కేంద్ర ప్రభుత్వానికే దిక్సూచిగా నిలిచాయని వివరించారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్రం అమలు చేసేందుకు సంకల్పించడంతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. అదే విధంగా గంగపుత్రులకు కూడా న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి ఒక్క పథకంపై ఇవాళ దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారని వివరించారు. ఇలా ప్రతి ఒక్క పథకం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ రోజు రూ. 30 కోట్ల సామగ్రి పంపి ణీ చేస్తే అందులో రూ. 7 కోట్లు గంగపుత్రులు పెట్టుకుంటే రూ.23 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారులకు మొత్తం కోటి రూపాయల బడ్జెట్ ఉంటే ఇవాళ కేవలం ఒక నిజామాబాద్ జిల్లాకే రూ. 23 కోట్లు ప్రభుత్వం నుంచి వస్తున్నాయంటే చరిత్రను తిరగరాశామన్నారు.

అన్ని కులాల గురించి ఆలోచించే కేసీఆర్..
ఇది వరకు ఉన్న రాజకీయ పార్టీలు, నాయకులు కులాలను విడగొట్టి వాటితో రాజకీయాలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేశారన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం అన్ని కులాల వారు బాగుపడాలన్న ఆలోచనతో పని చేస్తున్నారని ఎంపీ కవిత తెలిపారు. జిల్లాలో మహిళా పారిశ్రామిక సంఘాలు, మహిళా మత్స్యకారుల సంఘాలు తక్కువగా ఉన్నాయని, వాటికి ఇప్పుడిప్పుడే రివాల్వింగ్ ఫండ్‌ను తొలిసారి ప్రవేశపెట్టినామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోనే చేప విత్తనాలను ఉత్పత్తి చేసే కేంద్రాలు ఉండాల్సిన అవసరమున్నదని, వాటిని ఇంకా పెంచుతామని తెలిపారు. మనందరం కలిసి సంపదను పంచుకొని, మరింత సంపదను సృష్టించడానికి తెలంగాణలో ఒక నీలి విప్లవం మొదలైందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీగౌడ్, నగర మేయర్ ఆకుల సుజాత, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పల్లికొండ సాయిబాబా, జేసీ వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ గడ్డం సుమనారెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్లు బట్టు సాయిరాం, బట్టు నరేందర్, గంగాధర్, బోయేడి లక్ష్మణ్, ఎంపీపీలు, కార్పొరేటర్లు విశాలినీరెడ్డి, శ్రీవాణి, సూదం లక్ష్మి, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్‌రావు, ఐసీడీఎస్ ఆర్గనైజర్ బంగారు నవనీత, రాష్ట్ర కార్యదర్శి తారీఖ్ అన్సారీ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఏడీ రాజారాం, బీఎఫ్‌వో పూర్ణిమా, ఎఫ్‌డీవో రాజనర్సయ్య టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రూ.30కోట్ల విలువైన వాహనాలు, పనిముట్లు పంపిణీ
కలెక్టరేట్ : నగరంలోని కలెక్టరేట్ గ్రౌండ్‌లో నిర్వహించిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకం అవగాహన సదస్సు అనంతరం లబ్ధిదారులకు రూ. 30 కోట్ల విలువైన ద్విచక్రవాహనాలు, లగేజీ ఆటోలు, వలలు, క్రేట్స్, చేపల అమ్మకాల కియోస్క్‌లు, మహిళామత్స్యకారిణులకు రివాల్వింగ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఎంపీ కల్వకుంట్ల కవిత పంపిణీ చేశారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...