దర్జాగా కబ్జా ..!


Wed,February 13, 2019 02:23 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నగర నడిబొడ్డున సుభాష్‌నగర్‌లో సర్కారు జాగా దర్జాగా కబ్జా చేశారొకరు. దీనిపై ఫిర్యాదు వెల్లువెత్తినా సంబంధిత శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం అనుమానాలు, ఆరోపణలకు తావిస్తోంది. కోట్లాది రూపాయల విలువ చేసే ఈ స్థలం ఏడాది కాలంగా ఒకరి కబ్జా కోరల్లో చిక్కుకున్నది. పక్కనే ప్రైవేట్ లాండ్ కొనుక్కొని సర్కారు స్థలాన్ని కూడా యథేచ్చగా కలుపుకొని ఎంచక్కా సదరు కబ్జాదారుడు ప్రహరీ నిర్మించుకున్నాడు. ఈ తతంగమంతా తెలిసినా అధికారులు ఎవరూ కిమ్మనడం లేదు. అటు రెవెన్యూ శాఖాధికారుల నుంచి మొదలుకొని మున్సిపల్, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖ అధికారుల వరకు కబ్జాదారుడికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు రాగానే కబ్జా స్థలానికి వెళ్లి తూతూమంత్రంగా పరిశీలించి, ఆ తర్వాత ఈ విషయాన్ని కాగితాలకు పరిమితం చేస్తున్నారు అధికారులు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 773 గజాల ప్రభుత్వ స్థలం ప్రస్తుతం అన్యాక్రాంతంలో ఉంది. రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల విలువ చేసే ఈ ప్రభుత్వ భూమి తమ సొంతం చేసుకునేందుకు కబ్జాదారుడు అందరినీ మచ్చిక చేసుకుంటూ యథేచ్చగా తన సొంత జాగా అయినట్లు సర్కారు భూమిని కొంత కాలంగా వాడుకుంటున్నాడు.

స్కూల్ పేరుతో కబ్జా పర్వం...
నగరంలోని సుభాష్‌నగర్‌లో గల నేతాజీ రిక్రియేషన్ అండ్ కల్చరల్ అసోసియేషన్ పేరుతో సర్వే నంబరు 387, 389లో ప్లాట్ నంబరు 5, 6 లలో స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు కొన్నారు. అప్పట్లో ఈ అసోసియేషన్‌కు ఆర్‌ఎల్ శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. కొంత మంది సభ్యులుగా ఉన్నారు. ఒక్కో ప్లాటు 300 గజాల చొప్పున, ఈ రెండు ప్లాట్లు కలిపి 600 గజాల స్థలాన్ని నేతాజీ రిక్రియేషన్ క్లబ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం నగరానికి చెందిన ఓ విద్యా సంస్థ యజమాని ఈ రెండు ప్లాట్లను కొనుగోలు చేశాడు. దీని పక్కనే అనుకొని 773 గజాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలంపై ఆ విద్యావేత్త కన్ను పడింది. ఇప్పటికే గంగాస్థాన్ పరిసర ప్రాంతాల్లో ఇతనికో ప్రైవేట్ స్కూల్ ఉంది. తాజాగా గతేడాది సుభాష్‌నగర్‌లోని ఈ స్థలంలో ప్లే స్కూల్ పేరుతో మరోశాఖను తెరిచాడు. కొంతమంది పిల్లలకు అడ్మిషన్ కూడా తీసుకొని తరగతులు బోధిస్తున్నాడు.

మళ్లీ ఇప్పుడు అడ్మిషన్ల కోసం ప్రకటనలు ఇస్తున్నాడు. అయితే ప్రభుత్వ స్థలం కూడా తన ప్రైవేట్ ప్రాపర్టీలో కలుపుకొని ప్రహరీ నిర్మించి గేటు పెట్టుకొని ఏడాదిగా వాడుకుంటున్నాడు. అయినా అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదు. ఫిర్యాదుల మీద ఫిర్యాదులందినా అన్నీ బుట్టదాఖలవుతున్నాయి. అందరినీ మేనేజ్ చేస్తున్నాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల కిందట టౌన్ ప్లానింగ్ అధికారులు హరితహారం పేరుతో ప్రభుత్వ స్థలంలో మొక్కలు నాటించి చేతులు దులుపుకున్నారు. ఆ మొక్కలను పీకేసిన యాజమాన్యం, అక్కడ ప్లే స్కూల్‌కు అవసరమైన పిల్లలు ఆడుకునే ఆట వస్తువులను ఏర్పాటు చేసింది. వీటిపై ఫిర్యాదు అందగానే వాటిని తొలగించి మళ్లీ అధికారులు యథావిధిగా కబ్జాదారుడికి వత్తాసు పలుకుతూ వచ్చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ రెవెన్యూ అధికారులు కబ్జాదారుడితో కుమ్మకైనట్లు ఆరోపణలు ఉన్నాయి.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...