రచ్చ రచ్చ


Mon,February 11, 2019 11:53 PM

-బయటపడుతున్న వర్గవిభేదాలు
-బజారుకెక్కుతున్న నేతలు
-తాజాగా మధుయాష్కీ పై ఆ పార్టీ నేతల ఫైర్
నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: అసెం బ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొని ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేక తల్లడమల్లడమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. అంతర్గత అసంతృప్తులతో రోడ్డుకెక్కింది. నాయకుల మధ్య సమన్వయలేమి ఆ పార్టీ పరువును బజారుకీడుస్తున్నది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి నేతల ప్రవర్తనతో నానాటికి తీసికట్టు చందంగా మారింది. అధిష్టానానికి కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. ఎవరికి వారే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీలో క్రమశిక్షణ కొరవడింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధిష్టానం దీనిపై కసరత్తు మొదలుపెట్టిన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గందరగోళానికి తెర తీస్తున్నాయి. ఇటీవల డీసీసీ అధ్యక్షుడి నియామకం ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను బహిర్గతం చేశాయి. కేశవేణు తనకు ఇచ్చిన సిటీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి అధిష్టానం పై తన అసంతృప్తిని వెళ్లగక్కాడు.

ఈ క్రమంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నేతలు అధిష్టానం నిర్ణయాలతో దూరమవుతూ వస్తున్న తరుణంలో తాజాగా మాజీ ఎంపీ మధుయాష్కీ పై ఆ పార్టీ నేతలు బాహాటంగా విమర్శల దాడి చేయడం కలకలం రేపింది. కోరుట్లకు చెందిన కాంగ్రెస్ నేతలు కొందరు జిల్లా కేంద్రానికి వచ్చి మధుయాష్కీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్, భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా మధుయాష్కీకి అవకాశం ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరారు. అయితే గత కొంత కాలంగా నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు మధుయాష్కీ భయపడుతున్నారని ఆ పార్టీ శ్రేణులే బాహాటంగా చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో భువనగిరి నుంచి ఈ సారి ఎంపీగా ప్రయత్నం చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆ పార్టీ శ్రేణులు భువనగిరి నుంచి కూడా మధుయాష్కీకి టికెట్ ఇవ్వవద్దని కోరడం చర్చనీయాంశమైంది. కాగా ఈ పరిణామాలు జిల్లా కాంగ్రెస్ పార్టీలో గందరగోళానికి తెర తీశాయి.

నిజామాబాద్ ఎంపీ బరిలోకి సుదర్శన్‌రెడ్డి?
మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి నిజామాబాద్ పార్లమెంటు బరి నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. బోధన్ నుంచి పరాభవం చవిచూసిన మాజీమంత్రి ఎంపీగా బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత చెప్పారు. ఈ క్రమంలోనే డీసీసీ ప్రెసిడెంట్‌గా తన అనుచరుడు, తన సామాజిక వర్గానికి చెందిన మానాల మోహన్‌రెడ్డికి అవకాశం దక్కేలా సుదర్శన్‌రెడ్డి చక్రం తిప్పారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అయితే డీసీసీ ప్రెసిడెంట్ నియామకప్రక్రియ జిల్లా కాంగ్రెస్‌లో కొత్త చిచ్చును రేపింది. బీసీ నేతగా ఎన్నో ఏళ్లు కష్టపడి పార్టీలో పేరు తెచ్చుకున్న తన ను సుదర్శన్‌రెడ్డి, మధుయాష్కీ, మహేశ్‌కుమార్ గౌడ్‌లు అణగదొక్కారని కేశవేణు తన అనుచరులతో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సిటీ ప్రెసిడెంట్‌గా పరిమితం చేయడం తనను అవమానపరిచినట్లేనని భావిస్తున్న కేశవేణు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. సుదర్శన్‌రెడ్డికి బోధన్‌తో పాటు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏ నియోజకవర్గంలో కూడా సరైన పట్టు లేదు. పార్టీ శ్రేణులు ఎవరూ ఆయన అభ్యర్థితత్వం పట్ల ఆసక్తి కనబరచడం లేదు. అయితే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు మధుయాష్కీ అనాసక్తి చూపుతున్న తరుణంలో సీనియర్ నేతకు అవకాశమివ్వాలని చూస్తున్న తరుణంలో సుదర్శన్‌రెడ్డి పేరు తెర పైకి వచ్చింది.

జిల్లా కాంగ్రెస్ పై అధిష్టానం నజర్...
రోజుకో విధంగా రచ్చకెక్కుతున్న జిల్లా కాంగ్రెస్ రాజకీయాల పై అధిష్టానం గుర్రుగా ఉంది. ఈ మేరకు జిల్లా పరిణామాల పై నజర్ పెట్టింది. సోమవారం గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా సమక్షంలో జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పార్టీని చక్కదిద్దుకునేలా చర్యలకు ఉపక్రమించింది. జిల్లా కమిటీని వేసుకోవాల్సిందిగా సూచించింది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్టీ తరపున పోటీకి ఆసక్తి ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని అధిష్టానం సూచించగా.. ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు కూడా జిల్లా నుంచి రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో అధిష్టానం డీసీసీ ప్రెసిడెంట్‌నే పలు పేర్లను సూచించాల్సిందిగా కోరింది.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...