టీఆర్‌ఎస్‌లో కోలాహలం


Tue,September 11, 2018 01:02 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలకు ముందు జిల్లాలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ముందస్తు ఎన్నికలకు సమర శంఖం పూరించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 105మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో మరోమారు సిట్టింగులకే అవకాశం దక్కడంతో పార్టీ శ్రేణుల్లో నయాజోష్ కనిపిస్తున్నది. అర్బన్‌లో బిగాల గణేశ్ గుప్తా, బాల్కొండలో వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్‌లో ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బోధనలో మహ్మద్ షకీల్, నిజామాబాద్ రూరల్‌లో బాజిరెడ్డి గోవర్ధన్ తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వారికి ఇప్పటికే నాయకులు, కార్యకర్తల నుంచి ఘన స్వాగతాలు లభించాయి. పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి సోమవారం అపూర్వ స్వాగతం లభించింది. కార్యకర్తలు ,నాయకులు వందలాది వాహనాలతో ర్యాలీ చేపట్టారు. అడగడుగునా నేతలందరికీ విశేష ప్రజాదరణ లభించింది. ఇదిలా ఉంటే ప్రతిపక్షాల్లో మాత్రం ఉలుకు పలుకు లేదు. కాంగ్రెస్, టీడీపీల్లో ఇంకా పొత్తుల పంచాయితీలు తేలలేదు. పొత్తుల సమీకరణల మధ్య చిత్తయిపోవడం ఖాయమనే సంకేతాలు వెలువడిన నేపథ్యంలో.. ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారు. మరోవైపు నియోజకవర్గాల వారీగా ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి.

అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల జోష్ కనిపిస్తున్నది. కార్యకర్తలు,నాయకులు రెట్టించిన ఉత్సాహంతో దూకుడుగా ఎన్నికలకు సిద్ధ్దమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులెవరో తేలక ద్వితీయశ్రేణి నాయకులు,కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. ఓ వైపు పొత్తుల పంచాయితీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరుకుంటున్నది. గతంలో జరిగిన ఎన్నికలకు ఇప్పుడున్న ఎన్నికల వాతావరణం పూర్తి విరుద్ధ్దంగా ఉంది. ఎన్నికల సమరానికి ముందే ప్రతిపక్షాలు అస్త్ర సన్యాసం స్వీకరించినట్లుగా ప్రవర్తిస్తున్నాయి. పెరిగిన పెట్రో, డీజిల్ ధరలకు నిరసనగా ప్రతిపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ సోమవారం చేపట్టిన భారత్ బంద్ జిల్లాలో పాక్షికంగా ముగిసింది. ఎన్నికల వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేయకపోగా ప్రతిపక్షాలు ఈ ఆందోళన పర్వంలో చతికిలబడ్డాయి. ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు బంద్ ప్రభావం ఏ సెక్షన్‌లోనూ కనిపించలేదు. ముందస్తుగానే విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించాయి. ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మలు దహనం చేసి అయ్యిందనిపించారు. జిల్లా కేంద్రంలో బంద్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు యథావిధిగా తెరుచుకున్నాయి.

ప్రచార పర్వానికి రెడీ..
నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచార పర్వానికి రెడీ అవుతున్నారు. తమకు రెండోసారి టికెట్లు ప్రకటించిన తర్వాత నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల ఆశీస్సులు తీసుకున్నారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి సంబురాల్లో పాల్గొన్నారు. అధినేత కేసీఆర్ దిశానిర్దేశం మేరకు పార్టీ క్యాడర్‌ను ఎన్నికల సమరానికి సయాయత్తం చేసే క్రమంలో మీటింగులు పెట్టుకున్నారు. ప్రజలతో మేమకమవుతూ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు. త్వరలో ఈ దూకుడును మరింత పెంచనున్నారు. ఈనెల 13న వినాయకచవితి పర్వదినం అనంతరం ప్రచారపర్వాన్ని మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం ప్రచార రథాలను సిద్ధం చేసుకున్నారు. కదనరంగంలో దూకేందుకు సర్వం సమాయత్తమైన తరుణంలో, కార్యకర్తలు, నాయకులతో బిజిబిజీగా పర్యటనలు చేస్తున్నారు. సబ్బండవర్ణాల వద్దకు వెళ్లి వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. మరోవైపు బీజేపీకి నియోజకవర్గాల్లో అభ్యర్థులెవరో అంతుపట్టక కార్యకర్తలు తలోదిక్కు చూ స్తున్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల చూపు టీఆర్‌ఎస్ వైపే ఉంది. దూకుడుగా ఎన్నికల బరిలో ముందుకు సాగుతున్న గులాబీదళాన్ని చూసి ప్రతిపక్షాలు కలవరపాటుకు గురవుతున్నాయి. శ్మశాన వైరాగ్యంలో ఉండిపోయాయి. ఇదిలా ఉంటే .. సోషల్ మీడియాలో ప్రతిపక్షాల పొత్తులపై వ్యంగ్యస్ర్తాలను సంధిస్తున్నారు నెటిజన్లు. కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్న వైనాన్ని ఎండగడుతున్నారు. గులాంగిరీ పార్టీగా కాంగ్రెస్ మరోమారు నిరూపించుకున్నదని దెప్పిపొడుస్తున్నారు. ఆరంభంలోనే ప్రతిపక్షాలు పూర్తిగా డీలా పడిపోయాయి. టీఆర్‌ఎస్ దూకుడును పెంచింది.

202
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...