టీఆర్‌ఎస్ దూకుడు


Mon,September 10, 2018 02:57 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలో టీఆర్‌ఎస్ దూకుడును పెంచుతున్నది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అధినేత కేసీఆర్ గెలుపు గుర్రాలకే అభ్యర్థిత్వాలు ఖరారు చేయడంతో గులాబీ దళంలో నయా జోష్ కనిపిస్తున్నది. అభ్యర్థిత్వాలు వచ్చిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన తమ నాయకుడు, అభ్యర్థికి కార్యకర్తలు,నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. భారీగా ర్యాలీలు తీసి సంబురాలు నిర్వహించుకున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో అర్బన్, బాల్కొండ, బోధన్,రూరల్ ఎమ్మెల్యేలు తమ అభ్యర్థిత్వం ఖరారు కాగానే నియోజకవర్గాలకు వచ్చి నాయకులు, కార్యకర్తలతో మమేకమయ్యారు. సంబురాల్లో పాలుపంచుకున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే సోమవారం (నేడు)నియోజకవర్గానికి రానున్నారు.

ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచార కదనరంగంలోకి దూకనున్నారు. ఈ క్రమంలో దూకుడును మరింత పెంచారు. అధినేత కేసీఆర్ దిశానిర్దేశంతో ప్రచారపర్వానికి శ్రీకారం చు ట్టనున్నారు. సోమవారం నుంచి ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనుంది. ప్రతిపక్షాలు ఇంకా పొత్తుల విషయంలో ఎటూ తేలని పరిస్థితులో ఉ న్నాయి. టికెట్ల పంచాయితీల్లో నిండా మునిగి ఉన్న తరుణంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రజాక్షేత్రానికి వెళ్తున్నారు. మరోపక్క పార్టీలో వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీకి అదనపు బలం చేకూరింది. ఈనెల 12న కేసీఆర్ సమక్షంలో సురేశ్‌రెడ్డి పెద్ద ఎత్తున అనుచరులతో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. చాలామంది కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది.

బాజిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రెండోసారి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేరును ఖరారు చేయడంతో రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల సంబురాలు చేసుకున్నారు. హైదరాబాద్‌లో అసెంబ్లీ రద్దు అనంతరం సీఎం గెలుపు గుర్రాలకు ముందుగానే అభ్యర్థుల ప్రకటనలో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకొని, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి పార్టీ నాయకులు సంబురాలు నిర్వహించుకున్నారు. టికెట్ ఖరారు తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన సందర్బంగా ఎమ్మెల్యే కు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు.

నియోజకవర్గానికి ముఖద్వారమైన చంద్రాయన్‌పల్లి నుంచి నిజామాబాద్ వరకు కార్యకర్తలు స్వాగతం పలికారు. 200 మందితో జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ చేపట్టారు. డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి, ఇందల్‌వాయి, మోపాల్, రూరల్ మండలాలకు చెందిన ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికేందుకు పోటా పోటీగా చంద్రాయన్‌పల్లికి తరలి వచ్చారు. రెండోసారి టికెట్ కేటాయింపుతో టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల్లో ఎనలేని అనందం వెల్లివిరిసింది. భారీ మెజార్టీతో తమ నేతను గెలిపించుకుంటామని ధీమాతో ఉన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ముందుంచిన బాజిరెడ్డి గోవర్ధన్ మళ్లీ గెలిపించుకుంటామని కార్యకర్తలు, ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలు రాగానే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్ట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థిగా బిగాల గణేశ్ గుప్తాను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించడంతో అర్బన్ నేతల్లో ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. అర్బన్ అభ్యర్థిగా ఖరారైన తర్వాత బిగాల గణేశ్ గుప్తా శుక్రవారం తొలిసారిగా నిజామాబాద్ నగరానికి వచ్చారు. ఆయనకు నగర గులాబీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు,అభిమానులు భారీగా స్వాగతం పలికారు. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో వందలాది వాహనాలతో స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో బిగాల అందరికీ అభివాదం చేస్తూ నగరంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీగా కంఠేశ్వర్‌లోని శ్రీరామగార్డెన్‌కు చేరుకున్నారు. అక్కడ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. బిగాలకు రెండోసారి అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పార్టీ శ్రేణుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమైంది.

ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్ సహకారంతో ఎప్పటికప్పుడు నగరాభివృద్ధికి అత్యధిక నిధులు రాబట్టే విషయంలో సక్సెస్ అయిన బిగాల, నగరాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. గత పాలకుల సమస్యగా మిగిలిచిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులను విజయవంతంగా పూర్తి చేయించారు. నగర సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎప్పటి కప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నగర రూపురేఖలను మార్చేసి స్మార్ట్‌సిటీగా రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి అభ్యర్థిత్వం ఖరారు కావడంపై ఆయన అనుచరవర్గం, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలతో అర్బన్‌లో చాలా మందికి లబ్ధి చేకూర్చింది. ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికీ తిరుగుతూ షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అం దించారు. సొంత ఖర్చుతో చీర, ప్యాంటు షర్టు, స్వీ టు బాక్స్ బహూకరిస్తూ అప్యాయంగా వారిని పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

పోచారం రాకతో సంబురాలు...
అందరూ ఊహించినట్లుగానే బాన్సువాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాసరెడ్డి పేరు ఖరారు కావడంతో గురువారం రోజునే జిల్లాలో ఉన్న ఆ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి, వర్ని, రుద్రూర్ మండలాల్లోని పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. కాగా, ఆ మరునాడే శుక్రవారం పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలోని వర్ని మండలం చందూర్ గ్రామానికి రావడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. వేలాది మంది తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని వినాయకచవితి పండుగ తరువాతనే ఓ మంచి ముహూర్తం చూసుకొని ప్రారంభిస్తారని ఆ నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.

అడగడుగునా అపూర్వ స్వాగతాలు..
టీఆర్‌ఎస్ అభ్యర్థులకు అడగడుగునా అపూర్వ స్వాగతాలు లభిస్తున్నాయి. రెండోసారి ప్రజల ఆశీస్సులతో పార్టీ టికెట్‌ను సాధించి నియోజకవర్గానికి వచ్చిన క్రమంలో అభ్యర్థులు ఘన స్వాగతాలు పలుకుతున్నారు. కొత్త ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. మరోమారు అత్యధిక మెజార్టీతో తమ నాయకుడిని గెలిపించుకునే లక్ష్యంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారైన తాజా మాజీ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చారు. తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం భీమ్‌గల్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, భీమ్‌గల్, వేల్పూర్ మండలాల ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దారి వెంట ఆయనకు ప్రజలు స్వాగతం పలుకుతూ కరచలనం చేశారు. నాలుగున్నర ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయనను భుజాల పైకి ఎత్తుకుని ఆనందం వ్యక్తం చేశారు. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే రెట్టింపు అభివృద్ధి సాధించి చూపిస్తామని ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నేటి నుంచి అభివృద్ధి కార్యక్రమాల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.

195
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...