టీఆర్‌ఎస్‌లో ఫుల్ జోష్..


Sun,September 9, 2018 02:27 AM

ఆర్మూర్ టౌన్: మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరికతో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి మరింత బలం చేకూరనుంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి స్పీకర్‌గా పనిచేసిన సురేశ్‌రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సురేశ్‌రెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నారు. సురేశ్ రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు నిర్ణయించుకోగానే ఆయన సన్నిహితులు, అనుచరులు సైతం ఆయన వెంటే కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న కేఆర్ సురేశ్‌రెడ్డి అన్ని విధాలుగా ఆలోచించే టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని, అందుకే ఆయన వెంటే తామంతా ఉంటామని అనుచరులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీచేసి ఓటమి పాలయ్యారు. దాదాపు 12వేల ఓట్ల అధిక్యంతో జీవన్‌రెడ్డి గెలుపొందారు. సురేశ్ రెడ్డికి 50వేల ఓట్లు రాగా, జీవన్‌రెడ్డి 63వేల ఓట్లు సాధించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేసింది.

ప్రతి ఇంటికి పథకాలు చేర్చాయి. రెండోసారి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న ఆశన్నగారి జీవన్‌రెడ్డికి ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఏ పార్టీ నుంచి కనిపించడం లేదు. ఈసారి 50వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో జీవన్‌రెడ్డి గెలుపు ఖాయమని భావిస్తున్న తరుణంలో, కాంగ్రెస్ దిగ్గజం కేఆర్ సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో జీవన్‌రెడ్డి మరింత మెజార్టీతొ విజయం సాధిస్తారని కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు. సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరే కంటే ముందే ఆయన ప్రధాన అనుచరులు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఇప్పుడు సురేశ్‌రెడ్డి చేరికతో మిగతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యులంతా కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్మూర్‌తో పాటు బాల్కొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా సురేశ్‌రెడ్డి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. ఆర్మూర్‌తో పాటు బాల్కొండలోనూ సురేశ్‌రెడ్డికి అనుచర వర్గం ఉంది. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా పనిచేసినందున పార్టీ క్యాడర్‌ను ఆయన కాపాడుకున్నారు. ప్రస్తుతం సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నందున బాల్కొండ నియోజకవర్గంలోని ఆయన అనుచరులు, ముఖ్యులు టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది. సురేశ్ రెడ్డి సూచనతో బాల్కొండ నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు కృషిచేయనున్నారు.

అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్ వైపు అడుగులు...
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు కొనసాగాయి. ఇందులో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులంతా దాదాపుగా సురేశ్ రెడ్డి అనుచరులే కావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మున్సిపల్ చైర్మన్ త్రివేణి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగామోహన్ చక్రు, నర్మే నవీన్, కౌన్సిలర్లు పండిత్ ప్రేమ్, ఖాందేశ్ శ్రీనివాస్, జాగిర్దార్ శ్రీనివాస్, పూల నర్సయ్య, సుమీర్ హైమద్, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ హుస్మాన్ హజ్రమీ, మాజీ ఎంపీటీసీ మజీద్, మాజీ పట్టణ అధ్యక్షుడు దయాల్ సునిల్, నందిపేట్ ఎంపీపీ అంకం యమున, జడ్పీటీసీ స్వాతి, వైస్ ఎంపీపీ మారంపల్లి గంగాధర్, మాజీ ఎంపీపీ దత్తాత్రిగౌడ్, సొసైటీ చైర్మన్లు లక్ష్మీనారాయణ, మోహన్‌రావు, నూత్‌పల్లి భోజారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరారు.

గతం నుంచి వీరంతా సురేశ్‌రెడ్డి వెంట ఉన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గతంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం సురేశ్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు నిర్ణయించుకోగానే, ఆయన వెంటే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆయన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్మూర్, నందిపేట్‌లో శనివారం సమావేశాలు నిర్వహించుకున్నారు. 12న సురేశ్‌రెడ్డితో పాటుగా ఆయన వెంట పార్టీలో చేరేందుకు ఆర్మూర్ మండలం రాంపూర్ సర్పంచి గొడ్డు గంగాధర్, నందిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సాగౌడ్, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు లోక హన్మాండ్లు, నడ్కుడ సంజీవ్‌రావు, సాయికృష్ణ రెడ్డి తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా ఆదివారం నిజామాబాద్‌కు వస్తున్న సురేశ్‌రెడ్డిని కలిసి ఇతర కార్యకర్తలను టీఆర్‌ఎస్‌లో చేరాలని సూచించనున్నారు.

196
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...