కాంగ్రెస్‌కు షాక్


Sat,September 8, 2018 01:25 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: టీఆర్‌ఎస్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఉద్యమ పార్టీగా, తెలంగాణ రాష్ట్ర ఇంటి పార్టీగా ప్రజల మన్ననలు, విశ్వాసాన్ని చూరగొన్న టీఆర్‌ఎస్... ప్రస్తుతం ఎన్నికల కదనరంగంలో దిగిన విషయం తెలిసిందే. అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిగీసి ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో ప్రతిపక్షాలు గందరగోళంలో పడ్డాయి. మరోవైపు 105మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రజల్లో పార్టీపై, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న నమ్మకం, విశ్వాసం ఏ పాటిదో నిరూపించే విధంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ దెబ్బతో ప్రధాన ప్రతిపక్షంగా జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ కకావికలమైంది. ఏం చేయాలో పాలుపోని దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ఈ క్రమంలోనే మరో గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కారెక్కెందుకు నిర్ణయించుకోవడం హస్తం నేతల్ని గందరగోళ పరిస్థితిలోకి నెట్టేసింది. మంత్రి కేటీఆర్ దౌత్యంతో కేసీఆర్‌పై అపారమైన నమ్మకం, బంగారు తెలంగాణ కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంస్కరణలు సురేశ్‌రెడ్డిని ఆకర్షించాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు దిగజారుతూ దివాలాకోరు రాజకీయాన్ని ప్రదర్శించడం ఆయనను తీవ్ర అసంతృప్తికి లోను చేసింది. దీంతో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించాలని సురేశ్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి కేటీఆర్ నివాసంలో మీడియా సమావేశంలో ఈ విషయాలన్నీ ఆయన వెల్లడించారు. బాల్కొండ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి అపార అనుభవాన్ని పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ నిర్మాణంలో కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో వినియోగించుకుంటామని, ఆయన హోదాకు తగినట్టుగా పార్టీలో గౌరవించుకుంటామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

అపార రాజకీయ అనుభవం ఆయన సొంతం...
మూడు సార్లు ఎమ్మెల్యేగా, శాసన సభాపతిగా పనిచేసిన కేఆర్ సురేశ్‌రెడ్డికి జిల్లావ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. తన తొలి నియోజకవర్గమైన బాల్కొండ నియోజకవర్గంలో, ఆర్మూర్ నియోజకవర్గంలో ఆయనకు బలమైన వర్గం, అనుచరగణం ఉన్నది. 2009 ఎన్నికల్లో బాల్కొండ ఎమ్మెల్యేగా పీఆర్పీ నుంచి గెలిచిన ఈరవత్రి అనిల్ కాంగ్రెస్‌లో చేరాక కూడా ఆయన అనుచరులు ఆయన వెంటనే కొనసాగారు. ఆయన ఆర్మూర్ నియోజకవర్గానికి తరలిపోయాక ఆయన అనుచరగణమంతా సురేశ్‌రెడ్డి వర్గీయులుగానే ఉండిపోయారు. దీంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో సురేశ్ రెడ్డి ప్రాబల్యమే కొనసాగుతూ వచ్చింది. ఆర్మూర్‌కు వెళ్లాక అక్కడ ఆయనకు భారీగానే అనుచరులు ఏర్పడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు ఆర్మూర్ నుంచి పోటీ చేయడం, ఆర్మూర్ నియోజకవర్గ బాధ్యతలనే చూసుకుంటూ వచ్చినా.. రెండు నియోజకవర్గాల్లో ఆయన ప్రాబల్యం బలంగానే ఉంది. ఇప్పుడు ఆయన చేరికతో రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీగా నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో మొత్తంగా జిల్లా రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం గణనీయంగా పడనుంది. జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో అంతర్మథనానికి గురిచేస్తున్న ఈ అంశం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారనుంది. అదే సమయంలో టీఆర్‌ఎస్‌కు అదనపు బలాన్ని చేకూర్చనున్నది. పార్టీలో కేఆర్ సురేశ్‌రెడ్డి చేరికపై గులాబీ దళం సంతోషంగా స్వాగతించింది. అటు సురేశ్‌రెడ్డి అనుచర వర్గంలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

253
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...