ఎన్నికలకు సమరశంఖం


Fri,September 7, 2018 02:00 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) గిరి గీసి ఎన్నికల బరిలోకి దిగింది. అసెంబ్లీని రద్దు చేసి సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం ప్రతిపక్షాల్లో వణుకును పుట్టించింది. ఇటీవల జరిగిన ప్రగతి నివేదన సభ వేదికగా కేసీఆర్ ఎన్నికలకు సమాయత్తమవ్వాలనే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్ పిలుపుతో కదనోత్సాహంతో ఉన్న టీఆర్‌ఎస్ శ్రేణులు, తాజా పరిణామాలతో మరింత జోష్‌లో సంబురాలు నిర్వహించుకున్నారు. జిల్లాలో గురువారం ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసిన అంశంపైనే తీవ్ర చర్చ జరిగింది. రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈనెల 2న ప్రగతి నివేదన సభ వేదికగానే చాలా విషయాల్లో క్లారిటీ వస్తాదని భావించినప్పటికీ, ప్రగతి నివేదించే అంశానికే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు. ఆనాటి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరతీస్తూ కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి జిల్లాలో ఇదే అంశం అన్నివర్గాల్లో చక్కర్లు కొట్టింది. జిల్లాలో ఎన్నికల వాతావరణం అలుముకున్నది. కాగా, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని సబ్బండ వర్ణాలు స్వాగతించాయి.

తెలంగాణ జాతి మేలు కోరే కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు మంచి చేస్తుందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఆయనపై పూర్తి విశ్వాసం ఉందనే మాటను ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాగా, ప్రతిపక్షాల్లో ఈ పరిణామం తీవ్ర కలవరానికి గురిచేసింది. కనీసం ఉనికిలో లేకుండా ఉన్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. సాధారణ ఎన్నికలకు కాస్త ముందుగానే ఎన్నికలకు పోవడంపై ఆ పార్టీల నేతలు అసహనం వ్యక్తం చేస్తూనే, తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. లోలోన తీవ్ర భయాందోళనతో కుమిలిపోతున్నారు. కేసీఆర్ నిర్ణయం తమను ఇరకాటంలో పెట్టిందని ప్రతిపక్షాల నాయకుల మాటలను బట్టి అర్థమవుతున్నది. ఇప్పటికే జిల్లాలో దూకుడు మీదున్న టీఆర్‌ఎస్, పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు ఎన్నికల కదన రంగంలో దిగేందుకు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకున్నది. నిజామాబాద్ ంపీ కల్వకుంట్ల కవిత పలు నియోజకవర్గాలో ఇది వరకే బూత్ స్థాయి సమావేశాలను ఏర్పాటుచేసి, గడప గడపకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించే పనిని మొదలుపెట్టారు. ప్రతి గడపకు టీఆర్‌ఎస్ పాలన తీరు బూత్ కమిటీల ద్వారా ఇది వరకే చేరింది. ప్రగతి నివేదన సభ సక్సెస్ జోష్‌లో ఉన్న ఇందూరు గులాబీ దళం, తాజాగా గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశంతో తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్నికల సమరంలో సైనికులుగా పోరాడేందుకు సిద్ధమవుతున్నది. తిరిగి టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నది.

టీఆర్‌ఎస్ ప్రభంజనం ఖాయం...
వందకు పైగా సీట్లను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. టీఆర్‌ఎస్ ప్రభంజనం తథ్యం. ఆరవై ఏళ్లలో సాధించని అభివృద్ధి, సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ ఈ నాలుగున్నర ఏళ్ల పాలనలోనే చేసి చూపించారు. రైతులకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించారు. వారెంతో సంతోషంగా ఉన్నారు. డిసెంబర్‌లోగా ఎన్నికలు పూర్తై మళ్లీ టీఆర్‌ఎస్సే అధికారంలోకి రావడం ఖాయం.
-వీజీగౌడ్, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి

ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం..
ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీలో నిలిచేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రైతులకు, సబ్బండ వర్ణాలకు ఏమేమి చేయాలో స్పష్టమైన అవగాహనతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. ప్రజా క్షేత్రంలో పార్టీకి జనాదరణ ఉంది. అదే మాకు శ్రీరామరక్ష.
-తాహెర్ బిన్ హందాన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు

156
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...