ప్రజా సంక్షేమమే ధ్యేయం


Thu,September 6, 2018 12:56 AM

>-అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
-డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులు పైసా కట్టనవసరం లేదు..
-కాళేశ్వరంతో రెండు పంటలకు సాగునీరు
-మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి
-నాగేంద్రపూర్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశం కోటగిరి :టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం కృషిచేస్తోందని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి మండలంలోని నాగేంద్రపూర్‌లో 15 డబుల్ బెడ్‌రూం ఇళ్లను రిబ్బన్ కట్ చేసి బుధవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. లబ్ధిదారులు పైసా ఖర్చుపెట్టకుండా ప్రభుత్వం పూర్తి ఖర్చుతో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇస్తుందన్నారు.

దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి చేపట్టనటువంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కోటగిరి మండల కేంద్రంలో రూ.50 లక్షలతో నిర్మించిన మార్కెట్ కమిటీ కార్యాలయ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణలో 24గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతు బీమా పథకంతో రైతు కుటుంబాలకు ధీమా ఏర్పడిందన్నారు. ఇప్పటి వరకు 706 మంది రైతులు చనిపోయారని, నిన్నటి వరకు రూ.5 లక్షల చొప్పున 471మంది రైతులకు వారం రోజుల్లోనే బీమా పరిహారం డబ్బులు నామినీల ఖాతాల్లో జమ అయినట్లు తులిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద పలువురికి మంత్రి చెక్కులను అందజేశారు. కొడిచెర్ల గ్రామానికి ఎత్తిపోతల పథకం, చెక్‌డ్యాం మంజూరైందన్నారు. కోటగిరి మండల కేంద్రానికి 132కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేశామని, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మోరె సులోచన,మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ చాతురాబాయి, తహసీల్దార్ విఠల్, ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్, మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, కొల్లూర్ కిశోర్‌బాబు, వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ శంకర్‌పటేల్, గ్రామ అధ్యక్షుడు కూచి సిద్దూ, పి.సాయిలు, ఎంపీటీసీ సలీం, డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

173
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...