కౌన్సెలింగ్‌కు వచ్చి ఆత్మహత్యాయత్నం


Thu,September 6, 2018 12:51 AM

నిజామాబాద్ క్రైం : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తరుచూ మద్యం తాగివచ్చి దాడి చేస్తుండడంతో తీవ్ర ఆవేదనతో ఆ ఇల్లాలు పుట్టింటికి వెళ్ల్లిపోయింది. ఎనిమిదేళ్ల క్రితం వివాహమైన ఈ జంటకు ఓ పాప, ఓ బాబు ఉన్నారు. భర్త వేధింపులు తట్టుకొలేని బాధిత వివాహిత మంగళవారం నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్యభర్తలకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు వారిని బుధవారం స్టేషన్‌కు రప్పించారు. మధ్యాహ్నం సమయంలో తన తల్లితో పాటు మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆ వ్యక్తి, కొద్ది సమయానికే అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. సంబంధిత మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై తలాలీ ఖాన్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మరాం గ్రామానికి చెందిన రవికాంత్, డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్ గ్రామానికి చెందిన గంగామణి ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రవికాంత్ తరుచూ మద్యం తాగివచ్చి భార్యను కొట్ట్టేవాడు. ఇద్దరి మధ్య గొడవలు కావడంతో రెండుసార్లు పెద్దలు రాజీ కుదిర్చారు.

తిరిగి నెల క్రితం రవికాంత్ మద్యం తాగివచ్చి భార్యను కొట్టి ఇంట్లోంచి గెంటేశాడు. ఇద్దరు పిల్లలను తన వద్దే ఉంచుకున్నాడు. బాధితురాలు గంగామణి మంగళవారం నిజామాబాద్ నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు పోలీసులు వారిద్దరిని బుధవారం స్టేషన్‌కు రప్పించారు. కాపురానికి వస్తావా రావా అంటూ ఠాణాకు వచ్చీ రాగానే రవికాంత్ భార్యతో గొడవకు దిగాడు. అంతలోనే పోలీస్ స్టేషన్ ప్రహరీ పైకి ఎక్కి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో విద్యుత్ తీగలు తగలడంతో ఆయన గాయాలపాలై కింద పడిపోయాడు. పోలీస్ సిబ్బంది వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆటోలో ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అతనిపై రెండో టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తలాలీ ఖాన్ తెలిపారు.

181
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...