పల్లెలు.. ప్రగతి కేంద్రాలు


Thu,December 5, 2019 11:47 PM

-గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
-‘30 రోజుల ప్రణాళిక’తో పల్లెల ప్రగతి బాట
-తాజాగా నాలుగు అంశాలపై ప్రత్యేక దృష్టి
-ప్రతి గ్రామంలో నర్సరీ, డంపింగ్‌యార్డు, శ్మశాన వాటికల నిర్మాణం
-ఇంటికో ఇంకుడు గుంత ఏర్పాటుపై అవగాహన

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వడంతో గ్రామాలను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. పల్లెలను ప్రగతి బాటలో పయనించేలా చేసేందుకు ‘పల్లె.. ప్రగతి కేంద్రం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నాలుగు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో సెప్టెంబర్‌ 6నుంచి అక్టోబర్‌ 5వరకు జిల్లా వ్యాప్తంగా 30రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఎంతో మార్పు వచ్చింది. అన్ని గ్రామాల్లోనూ పారిశుధ్యం ఎంతో మెరుగుపడగా.. కొత్తగా మొక్కలు పెంచడంతో పచ్చని వనాలు పెరుగుతున్నాయి. మురికి కాల్వలు శుభ్రం చేసి, రోడ్లపై గుంతలు పూడ్చడంతో దోమలు వృద్ధి చెందకుండా నియంత్రణ చేశారు. నీటిలో క్లోరినేషన్‌, ఫాగింగ్‌ చేయడంతో పాటు.. అపరిశుభ్ర వాతావరణం లేకుండా చేశారు. పిచ్చిమొక్కలు, గడ్డి తొలగించి.. కొత్తగా మొక్కల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టారు. దీంతో పల్లెలు సరికొత్త శోభ సంతరించుకున్నాయి. గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడంతో పాటు కరెంటు ఆదాకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు 95శాతం వరకు పరిష్కరించగా.. కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రణాళికలు తయారు చేశారు. 30రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వివిధ కార్యక్రమాలతో గ్రామాల పరిస్థితిలో బాగా మార్పు వచ్చింది. పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత, పచ్చదనంతో పాటు కనీస వసతుల కల్పనకు ఆస్కారమేర్పడింది.

నాలుగు అంశాలపై ప్రత్యేక దృష్టి
30రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనులను నిరంతరం కొనసాగిస్తూనే.. అధికారులు ముఖ్యంగా నాలుగు అంశాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ‘పల్లెలు.. ప్రగతి కేంద్రాల’ పేరుతో.. పల్లెలను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలో 396గ్రామ పంచాయతీలు ఉండగా.. అన్ని చోట్ల గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మొక్కల కోసం నర్సరీల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. గతంలోనే వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణం ప్రారంభించగా.. 30రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా స్థలాలను గుర్తించారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు తప్పని సరిగా ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో అన్ని ఇండ్లకు ఇంకుడు గుంతలు నిర్మించేలా దృష్టి పెట్టారు. ఇప్పటికే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగగా, ఇప్పటి వరకు జిల్లాలో 95శాతం కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. పల్లె ప్రగతి కేంద్రాల కార్యక్రమంలో భాగంగా ఈ పనులను పూర్తి చేసి.. పల్లెలను ఆదర్శంగా మార్చాలని భావిస్తున్నారు.

పనుల ప్రగతిని బట్టి వెయిటేజీ
జిల్లాలో గతంలో కొన్ని గ్రామ పంచాయతీల్లోనే నర్సరీలు ఉండేవి. ఇవి కూడా ప్రైవేటు వారి ఆధ్వర్యంలో ఉండగా.. ఉపాధి హామీ పథకం సిబ్బంది పర్యవేక్షించేవారు. ఇకపై ప్రతి గ్రామానికో నర్సరీని పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. 396గ్రామ పంచాయతీలకుగాను.. 389గ్రామ పంచాయతీల్లో గుర్తింపు పూర్తయింది. మరో ఏడు గ్రామ పంచాయతీల్లోనే మిగలగా.. 98శాతం లక్ష్యం సాధించారు. వచ్చే ఏడాది హరితహారం కార్యక్రమం కోసం అవసరమైన మొక్కలు ఇక్కడి నుంచి సరఫరా చేస్తారు. ఇప్పటికే 35లక్షల మొక్కల పెంపకానికి అవసరమైన నర్సరీల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఇంటింటికో ఇంకుడు గుంత నిర్మించడంతో మురుగునీరు బయటకు వెళ్లకుండా.. భూమిలో ఇంకుతుంది. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు దోమలు వృద్ధి చెందకుండా ఉంటుంది. ఒక్కో వ్యక్తిగత ఇంకుడు గుంతకు రూ.4200 చొప్పున ఉపాధి నిధుల నుంచి చెల్లిస్తున్నారు. జిల్లాలో లక్షా 34 వేల 709 ఇంకుడుగుంతలు తవ్వాలని లక్ష్యంగా ఉండగా.. ఇప్పటి వరకు 1133 గుంతలు తవ్వారు. మిగతా 1,33,576ఇండ్లకు తవ్వాల్సి ఉంది. ఇందుకోసం గ్రామాల్లో అవగాహన కల్పించడంతో పాటు లక్ష్యం చేరేందుకు చర్యలు చేపట్టారు.

జిల్లాలోని అన్ని పంచాయతీల్లో శ్మశాన వాటికలు నిర్మించాల్సి ఉండగా.. 118గ్రామ పంచాయతీల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మిగతా చోట్ల స్థలాలను గుర్తించగా, పనులు ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు 29.8శాతం లక్ష్యం చేరారు. డంపింగ్‌ యార్డులకు సంబంధించి.. 396గ్రామ పంచాయతీలకుగాను.. 130గ్రామ పంచాయతీల్లో నిర్మాణ పనులు నడుస్తున్నాయి. మిగతా 266 పంచాయతీల్లో స్థలాల గుర్తింపు చేయగా.. పనులు ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు 32.8శాతం లక్ష్యం చేరారు. డంపింగ్‌ యార్డుతో పాటు అన్ని చోట్ల కంపోస్టు ఎరువు తయారీ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.2.50లక్షల విలువైన షెడ్ల నిర్మాణం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పనుల ప్రగతిని బట్టి వెయిటేజీ మార్కులు ఇవ్వనున్నారు. నర్సరీలకు 30శాతం, డంపింగ్‌ యార్డు (కంపోస్టు షెడ్డుతో పాటు)కు 30శాతం, శ్మశాన వాటికకు 30శాతం, ఇంటింటికి ఇంకుడు గుంతలకు 10శాతం చొప్పున వెయిటేజీ మార్కులు ఇస్తున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...