చెత్తతో వర్మికంపోస్టు


Mon,December 2, 2019 12:30 AM

-ఎన్‌జీటీ ద్వారా జిల్లాలో మూడు మోడల్‌ షెడ్డులు..
-ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో 40 షెడ్డుల నిర్మాణం
-ప్రతి గ్రామంలో వర్మికంపోస్టు తయారీకి ప్రణాళికలు
-రైతుకు తక్కువ ధరకే లభించనున్న ఎరువు

నిర్మల్‌ టౌన్‌: 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు పనుల్లో భాగంగా గ్రామానికో వర్మి కంపోస్టు ఎరువుల షెడ్డు నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పల్లె ప్రగతిలో పారిశుద్ధ్య నిర్వహణ కీలకమని భావించి ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించి గ్రామ పంచాయతీ సిబ్బందికి పనులపై పకడ్బందీ ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళిక అమలుతో పల్లెలు పరిశుభ్రంగా మారాయి. గ్రామాల్లోని ఇంటింటికీ సేకరించిన చెత్త డంపింగ్‌యార్డులకు తరలుతున్నది. ప్రతిరోజూ సేకరించిన చెత్తతో వర్మి కంపోస్టు ఎరువు తయారు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం షెడ్డుల నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నది.

జిల్లాలో మొత్తం 396 గ్రామపంచాయతీలు ఉండగా, 420కి పైగా అనుబంధ గ్రామాలున్నాయి. ఇప్పటికే జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా 2020-21 సంవత్సరానికి చేపట్టాల్సిన పనులను గుర్తించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వర్మి కంపోస్టు ఎరువు తయారీకి షెడ్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో సేకరించిన చెత్త నుంచి ప్లాస్టిక్‌తోపాటు తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ఈ షెడ్లును ఉపయోగించనున్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ద్వారా రాష్ట్రంలో మొత్తం 96 వర్మికంపోస్టు ఎరువుల తయారీ మోడల్‌ షెడ్డులను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా, నిర్మల్‌ మండలంలోని ఎల్లపెల్లి, భైంసా మండలంలోని ఎగ్గాంతో పాటు నర్సాపూర్‌(జీ) మండల కేంద్రంలో రూ.3.45 లక్షల చొప్పున వెచ్చించి షెడ్డులను నిర్మించారు. కేంద్ర బృంద సభ్యులు సైతం ఇటీవల మోడల్‌ షెడ్డులను పరిశీలించారు. వర్మి కంపోస్టు ఎరువుల తయారీకి జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

గ్రామానికో షెడ్డు నిర్మాణం
వర్మికంపోస్టు తయారీకి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) మూడు మోడల్‌ షెడ్డులను నిర్మించగా, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామంలో షెడ్డుల నిర్మాణం చేపట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఖానాపూర్‌, నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లోని 40 చోట్ల ఇప్పటికే షెడ్డుల నిర్మాణ పనులు పూర్తి కాగా, వీటి నిర్మాణానికి రూ. 2.50 లక్షల చొప్పున నిధులను వెచ్చించారు. మిగతా గ్రామాల్లో షెడ్డుల నిర్మాణానికి త్వరలో అనుమతులు తీసుకుని నిధులు మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

పక్కాగా చెత్త సేకరణ
జిల్లవ్యాప్తంగా 30రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా ప్రజలకు పారిశుధ్య నిర్వహణపై అవగాహన కల్పించిన సంగతి తెలిసిందే. తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఇంటింటికీ చెత్త సేకరణ డబ్బాలు అందజేశారు. ప్రజలు సైతం చెత్త సేకరణకు సహకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి చెత్తసేకరణ చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటికే జిల్లాలో పది గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను కొనుగోలు చేసి చెత్తను తరలించడంతో పాటు మొక్కలకు నీరు పోసేందుకు ట్యాంకర్లను ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను అందించే దిశగా చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో సేకరించిన చెత్తను వర్మికంపోస్టు తయారీ షెడ్డులకు తరలించి అక్కడ ప్లాస్టిక్‌, తడి, పొడి చెత్తను వేరు చేసి నిర్ణీత పద్ధతిలో కంపోస్టు తయారు చేస్తారు. వర్మికంపోస్టును స్థానిక రైతులకు తక్కువ ధరకే అందించేందుకు ఈ షెడ్డులు ఉపయోగపడుతాయని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

అన్ని గ్రామాల్లో నిర్మిస్తాం
వర్మి కంపోస్టు ఎరు వు తయారీకి జిల్లాలోని అన్ని గ్రామాల్లో షెడ్డులను నిర్మాణం ఈ ఏడాదిలోపే నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలోని ఎల్లపెల్లి, ఎగ్గాం, నర్సాపూర్‌ గ్రామాల్లో మోడల్‌ షెడ్డుల నిర్మాణం పూర్తి చేసి ఇతర గ్రామాల ప్రజలను వాటిపై అవగాహన కల్పించేందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి గ్రామంలో షెడ్డుల నిర్మాణంతో పారిశుద్ధ్య నిర్వహణ సక్సెస్‌ కావడంతో పాటు స్థానిక రైతులకు ఎరువు సైతం తక్కువ ధరకే లభించే అవకాశం ఏర్పడుతుంది.
- వెంకటేశ్వర్లు, డీఆర్డీవో

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles