రోడ్లపై పంటదిగుబడులు ఆరబెడుతున్న రైతులు


Wed,November 13, 2019 11:11 PM

-ప్రమాదాలబారిన పడుతున్న వాహనదారులు
-కుంటాల - కల్లూర్ రోడ్డుపై ప్రాణాలు కోల్పోయిన యువకుడు
-పలువురికి గాయాలు
-చర్యలు తప్పవంటున్న ఎస్పీ శశిధర్‌రాజు
నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి

జిల్లాలో ఏ రోడ్డుపై చూసినా పంట దిగుబడులు ఆరబెట్టి కనిపిస్తున్నాయి! పల్లె రోడ్డు నుంచి పట్టణం వెళ్లే రోడ్లయినా, దేశంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ జిల్లా పై మీదుగా వెళ్లే జాతీయ రోడ్లయినా వేటిని చూసినా పంట దిగుబడుల కుప్పలే దర్శనమిస్తున్నాయి. రైతులు రోడ్లపై ధాన్యం, మక్కలు, సోయా తదిర పంటలను రోడ్లపై ఆరబెట్టడం.. నూర్పిడి చేస్తుండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రివేళల్లో పంట కుప్పలు కనిపించకపోవడంతో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
జిల్లా మీదుగా రెండు జాతీయ రహదారులతో పాటు ప్రధాన రహదారులు వెళ్తున్నాయి.

నిర్మల్ మీదుగా 44వ నంబర్ జాతీయ రహదారితో పాటు 64వ నంబర్ జాతీయ రహదారి వెళ్తోంది. సోన్ నుంచి బైపాస్ మీదుగా జాతీయ రహదారి 44 వెళ్తుండగా, తానూర్ మండలం బెల్‌తరోడా నుంచి కడెం వరకు జాతీయ రహదారి 64వెళ్తోంది. వీటితో పాటు భైంసా నుంచి బాసర, ముథోల్-తానూర్, భైంసా-కుభీర్, కల్లూర్-కుంటాల, అర్లి-లోకేశ్వరం-దేగాం, నిర్మల్-సారంగాపూర్, నిర్మల్-కనకాపూర్-లక్ష్మణచాంద మండలాల మధ్య ఉనన రెండు లైన్ల రోడ్లతో పాటు గ్రామీణ రోడ్లపై సైతం రైతులు పంట దిగుబడులను ఆరబెడుతున్నారు. సోయాబిన్, మొక్కజొన్న, ధాన్యం ఆరబెట్టేందుకు రహదారులు, రోడ్లను ఎంచుకుంటున్నారు. మరోవైపు వర్షాలకు పంట తడవడంతో త్వరగా ఆరాలనే ఉద్దేశంతో రైతులు ఎక్కువ రోజుల పాటు పంట ఉత్పత్తులను రోడ్లపై ఆరబెట్టి.. విక్రయించేందుకు మార్కెట్లకు తీసుకెళ్తున్నారు.

రోడ్లు, రహదారులకు ఇరువైపులా ఆరబెట్టడం, కుప్పలు పోయడం వాహనదారులకు ఇబ్బందిగా మారుతోంది. మక్కలు, ధాన్యం రోడ్లపై ఆరబెట్టడంతో పాటుగా కుప్పలపై కవర్లు కప్పడం, చుట్టూ పెద్ద పెద్ద బండ రాళ్లు పెట్టడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పంట కుప్పల కారణంగా రోజుకో చోట ప్రమాదం జరుగుతోంది! ఎంతో మంది గాయాలపాలయ్యారు. ప్రతి సీజన్‌లోనూ ఈ తరహా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. రైతులు రోడ్లపై పంట ఉత్పత్తులు కుప్పలు పోయకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆర్‌అండ్‌బీ, పోలీసు శాఖ అధికారులు ఆ దిశగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. రోడ్లపై పంట ఉత్పత్తులు ఆరపోయడం, కుప్పలు పెట్టడంతో జరిగే ప్రమాదాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపాల్సిన అవసరం ఉంది. రైతులకు తమకు ఉన్న భూమిలో కొంత మేర స్థలంలో ఫ్లాట్‌ఫాం కోసం కేటాయిస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. తమ సొంత వ్యవసాయ భూమిలోనే ధాన్యం ఆరబెట్టుకోవచ్చు. ప్రభుత్వం ఫ్లాట్‌ఫాంల నిర్మాణాలకు ఉద్యాన శాఖ ద్వారా రాయితీని సైతం అందిస్తుండగా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...