మహిళా సంఘాలకు తీపి కబురు!


Wed,November 13, 2019 02:09 AM

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు పంపించింది. జిల్లాలోని 502గ్రామ సమాఖ్యలకు రూ.6.25కోట్ల వడ్డీ రాయితీని చెల్లిస్తోంది. జిల్లాలో స్వయం సహాయక సంఘాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల చర్యలు చేట్టింది. ఇప్పటికే ఐకేపీ ద్వారా వివిధ రకాల రుణాలు అందిస్తున్నది. ఐకేపీకి అనుబంధంగా స్త్రీనిధి ఏర్పాటు చేసి బ్యాంకు లింకేజీ ద్వారా ఆర్థికసాయమందిస్తూ వారి బతుకులకు భరోసానిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్‌ ద్వారా అనేక రకాలుగా రుణాలను అందిస్తున్నది. సంఘాల్లోని సభ్యులు చిరు వ్యాపారాలు, వ్యవసాయం, పెళ్లిలు, పిల్లల చదువులు, కుటీర పరిశ్రమలు వంటి వాటి కోసం ఈ నిధులను వినియోగించుకుంటారు. బ్యాంకు లింకేజీలతో స్త్రీనిధి ద్వారా రుణాలను అందిస్తూ చిరు వ్యాపారాల్లో నిలదొక్కుకునేలా చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ఐకేపీ, స్త్రీనిధి ద్వారా ఏటా రూ.కోట్ల రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది.

రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు
జిల్లాలో 19మండలాలుండగా.. ఇందులో 18గ్రామీణ మండలాలు, నిర్మల్‌ అర్బన్‌ మండలం ఉంది. జిల్లాలో 396 గ్రామ పంచాయతీలు ఉండగా.. మూడు మున్సిపాలిటీలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా మహిళా సంఘాలకు సేవలు అందిస్తున్నారు. జిల్లాలోని 396గ్రామ పంచాయతీల పరిధిలో 502గ్రామ సమాఖ్యలు(వీవో) ఉన్నాయి. వీటి పరిధిలో 10,842 స్వయం సహాయక సంఘాలుండగా.. 1,24,800 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలోని 10,842స్వయం సహాయక సంఘాలు ఉండగా.. ఒక్కో ఎస్‌హెచ్‌జీలో 10 నుంచి 15 మంది వరకు సభ్యులు ఉంటారు. ఈ లెక్కన జిల్లాలో 1,24,800 మంది సభ్యులుగా ఉన్నారు. 2015 నుంచి ఐకేపీ ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు భారీగా రుణాలను అందిస్తోంది. మహిళా కుటుంబాలు వ్యాపారం, ఉపాధి కోసం స్త్రీనిధి రుణాలు ఇస్తున్నారు. ఈ పథకం ప్రారంభం తొలిరోజుల్లో రూ.50వేల నుంచి స్త్రీ నిధి రుణాలను ఇవ్వగా.. తాజాగా రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు రుణాలు ఇస్తున్నారు.

కుటుంబాలకు ఆర్థిక భరోసా
ఐకేపీ, స్త్రీనిధి రుణాలతో సభ్యుల కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. స్వయం సహాయక సంఘాలు, స్త్రీ నిధి కింద రుణాలు తీసుకున్న మహిళలు.. బ్యాంకులు నిర్దేశించిన వడ్డీతో నెలవారీ వాయిదాలు చెల్లిస్తారు. మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలకు రూ.13నుంచి 13.5శాతం, స్త్రీనిధి రుణాలకు 12.5శాతం నుంచి 13.5శాతం చొప్పున వడ్డీతో రుణాలు ఇస్తారు. క్రమం తప్పకుండా ప్రతి నెలా వాయిదాలు చెల్లించి తీసుకున్న అప్పును తీరిస్తే.. వడ్డీ రాయితీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది. 2015 నుంచి 2017 వరకు బ్యాంకు లింకేజీల ద్వారా తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న సంఘాలకు వడ్డీని తిరిగి ప్రభుత్వం చెల్లించింది. గత ఏడాది ఆగస్టులో వడ్డీ రాయితీ డబ్బులు చెల్లించగా.. తాజాగా అప్పటి నుంచి ప్రస్తుత నవంబర్‌ వరకు ఉన్న వడ్డీని చెల్లించేందుకు డబ్బులు విడుదల చేసింది. తాజాగా రూ.6.25కోట్ల వడ్డీ రాయితీ డబ్బులను జమ చేసింది. ఈ మొత్తం సెర్ప్‌ ఖాతా నుంచి బ్యాంకులకు, బ్యాంకుల నుంచి మహిళా సంఘాల ఖాతాలకు బదిలీ కానున్నాయి. బ్యాంకు లింకేజీల ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీని తిరిగి చెల్లించడంపై మహిళా సంఘాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని స్వయం సహాయక సంఘాల మహిళలు పేర్కొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...