‘పవర్‌ వీక్‌'.. సమస్యలకు చెక్‌!


Wed,November 13, 2019 02:08 AM

నిర్మల్‌ టౌన్‌: జిల్లాలో విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘పవర్‌ వీక్‌' విజయవంతమైంది. కొన్నేండ్లుగా విద్యుత్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు పరిష్కారం లభించింది. జిల్లాలో విద్యుత్‌ శాఖాధికారులు సెప్టెంబర్‌ 9 నుంచి 14 వరకు పవర్‌వీక్‌ కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాలను సందర్శించిన అధికారులు విద్యుత్‌ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారానికి 60 రోజుల ప్రణాళికలో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన 30 రోజుల పల్లె ప్రణాళికలో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి విద్యుత్‌ శాఖాధికారులు చొరవ చూపడంతో పవర్‌వీక్‌లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సమస్యలు పరిష్కరించారు. జిల్లాలో 19 మండలాలు ఉండగా, 396 గ్రామాలున్నాయి. వీటి పరిధిలో 420 అనుబంధ గ్రామాలున్నాయి. అన్ని గ్రామాల్లో పవర్‌వీక్‌ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. పల్లె ప్రణాళికలో భాగంగా అక్టోబర్‌లో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.

యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు
జిల్లాలో పవర్‌ వీక్‌ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు ఏ రోజుకు ఆ రోజు మండలాల వారీగా ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేశారు. జిల్లాలో వంగిన, విరిగిన విద్యుత్‌ స్తంభాల గుర్తింపు, వీధి దీపాలు, మీటర్లు, మిడిల్‌ పోల్స్‌ తదిరర ప్రధాన సమస్యలను గుర్తించారు. విద్యుత్‌ పొదుపును ఆదా చేసేందుకు పవర్‌వీక్‌ కార్యక్రమంలో భాగంగా థర్డ్‌లైన్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.జిల్లాలోని 19మండలాల పరిధిలో 278 కిలో మీటర్లు థర్డ్‌లైన్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 245 కిలో మీటర్ల వరకు లైన్‌ ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేశారు.అలాగే జిల్లాలో 1457 వంగిన విద్యుత్‌ స్తంభాలను గుర్తించి వాటిని సరిచేశారు. 1455 విరిగిన విద్యుత్‌ స్తంభాలను గుర్తించగా వాటి స్థానాల్లో ఇప్పటి వరకు కొత్తగా 1216 స్తంభాలు ఏర్పాటు చేశారు. 645 వీధి దీపాలను గుర్తించి 556 దీపాలకు మీటర్లను ఏర్పాటు చేశారు. మిడిల్‌ పోల్స్‌ స్తంభాల విషయంలో 240 గుర్తించగా ఇప్పటి వరకు 237 స్తంభాలను బిగించారు. ఇప్పటి వరకు 90 శాతం పనులు పూర్తవగా మిగతా పనులు ఈ నెలాఖరు వరకు పూర్తిచేయనున్నారు.

కడెం మండలంలో ఆలస్యం
కడెం మండలంలోని అల్లంపుర్‌ అటవీ ప్రాంతంలో 12 గ్రామాల్లో మాత్రమే పనులు ప్రారంభించలేదు. అక్కడ వాగులు, రవాణా సౌకర్యంలేకపోవడంతో పరిష్కరించడంలో కొంత జాప్యం జరుగుతున్నది. అక్కడ వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని విద్యుత్‌ అధికారి ఒకరు తెలిపారు. జిల్లాలోని 396 గ్రామాలకు 227 గ్రామాల్లో వంద శాతం పనులు పూర్తికాగా మిగితా గ్రామాల్లో 70శాతం పనులు పూర్తయినట్లు విద్యుత్‌శాఖ జిల్లా అధికారి జయవంత్‌రావు చౌహాన్‌ తెలిపారు. పవర్‌ వీక్‌లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం బడ్జెట్‌ కూడా విడుదల చేసింది. ఇప్పటి వరకు రూ. 11కోట్ల నిధులను విడుదల చేయగా, ఇందులో 8.50 కోట్లు ఖర్చుచేశారు. గ్రామాల్లో ధర్డ్‌లైన్‌ ఏర్పాటు చేయడంతో పగటి పూట వీధి దీపాలు వెలుగడంలేదు. దీంతో గ్రామాలకు విద్యుత్‌ బిల్లుల అదనపు భారం తగ్గుతున్నట్లు విద్యుత్‌ శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఏండ్ల తరబడి ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితంలేకపోగా, పవర్‌వీక్‌లో పూర్తిస్థాయిలో పరిష్కారమవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర, బీహార్‌ తదితర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి పనులను వేగం పూర్తి చేయించారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...