సొంత స్థలం ఉంటే ‘డబుల్‌' ఇల్లు


Wed,November 13, 2019 02:08 AM

బోథ్‌, నమస్తే తెలంగాణ: సొంత స్థలం ఉన్నచోటే డబుల్‌ బెడ్‌ రూం ఇంటి నిర్మాణానికి త్వరలోనే అనుమతిస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బోథ్‌లోని ధన్నూర్‌ (బి) గ్రామంలో ఇప్పటివరకు పనులు పూర్తయిన 50 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశారు. మరో 25 నిర్మాణాలకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కుచ్లాపూర్‌ మహాలక్ష్మి, ధన్నూర్‌ (బీ) కనకదుర్గ ఆలయాలకు 20 శాతం భాగస్వామ్యం చెల్లిస్తే నిధులు మంజూరు చేస్తామన్నారు. వచ్చే జూన్‌లోగా అడెల్లి రోడ్డు నిర్మాణం పూర్తి చేయిస్తామన్నారు. బోథ్‌ ప్రాంతంలోని నేరడిగొండ, బోథ్‌, బజార్‌హత్నూర్‌, ఇచ్చోడ మండలాల్లో పంట పొలాలకు ఎత్తిపోతల ద్వారా నీరు అందేలా చూడాలని సీఎంకు విన్నవిస్తామన్నారు. కుంటాల, పొచ్చెర జలపాతాల సందర్శకులు, స్థానికుల సౌకర్యార్థం బోథ్‌ క్రాస్‌రోడ్డు వద్ద హరితవనం పార్కు నిర్మాణం చేపడతామన్నారు. సీసీఐ పత్తి పంట తేమశాతాన్ని 16 నుంచి 18 వరకు పెంచాలని ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌, బోథ్‌ ఎమ్మెల్యే బాపురావు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ధన్నూర్‌ (బీ)లో ఇప్పటికే 50 మంది గృహప్రవేశం చేశారన్నారు. మరో 25 ఇండ్లు కొత్తగా మంజూరు చేశామన్నారు. కుచ్లాపూర్‌లో అర్హులకు త్వరలోనే ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు తుల శ్రీనివాస్‌, జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్‌ సంధ్యారాణి, ఇచ్చోడ ఎంపీపీ ప్రీతమ్‌రెడ్డి, జిల్లా కో-ఆప్షన్‌ సభ్యుడు తాహెర్‌ బిన్‌ సలాం, స్థానిక సర్పంచ్‌ గంగయ్య, ఎంపీటీసీ డి.నారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నారాయణ సింగ్‌, మాజీ చైర్మన్‌ నల్ల శారదరెడ్డి, ఎన్‌.జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ ఎస్‌.రుక్మణ్‌సింగ్‌, వైస్‌ చైర్మన్‌ సోలంకి సత్యనారాయణ, పి.సుధాకర్‌రెడ్డి, సింగారి వెంకటరమణ, గడ్డం ప్రకాశ్‌రెడ్డి, బైరి కొండయ్య, వివిధ గ్రామాల టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

హరితవనం చుట్టూ ప్రహరీకి శంకుస్థాపన
ఆదిలాబాద్‌ రూరల్‌ : మండల కేంద్రం మావల గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గానగర్‌ కాలనీకి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో హరితవనానికి రూ.1.71 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన చైన్‌ లింక్‌ ఫెన్సింగ్‌ (ప్రహరీ కంచె) పనులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో ముల్తానీల బారి నుంచి అడవులను సంరంక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1700 మంది ఎఫ్‌బీవోలను నియమించిందన్నారు. జిల్లాలోని ఇచ్చోడ, ఊట్నూర్‌ ప్రాంతాల్లోనూ హరితవనాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఆదిలాబాద్‌ జిల్లా అటవీ ప్రాంతంలో సైతం పులుల సంచారం పెరగాలని తాను కోరుకుంటున్నానని కలెక్టర్‌ తెలిపారు. అంతకుముందు జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్న, డీసీసీబీ చైర్మన్‌ ముడుపు దామోదర్‌రెడ్డి, ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, ఐసీడీఎస్‌ ఆర్గనైజర్‌ కస్తాల ప్రేమల, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రంగినేని మనీష, మావల జడ్పీటీసీ నల్ల వనిత, ఎంపీపీ చెందాల ఈశ్వరి, డీఎఫ్‌వో ప్రభాకర్‌, ఎఫ్‌డీవో చంద్రశేఖర్‌, టీఆర్‌ఎస్‌ మావల మండల అధ్యక్షుడు నల్ల రాజేశ్వర్‌, పట్టణ అధ్యక్షుడు సాజిదొద్దీన్‌, నాయకులు యునీస్‌ అక్బానీ, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles