ముందస్తు సాగు మేలు


Tue,November 12, 2019 04:45 AM

-విస్తారంగా వర్షాలు.. నిండుకుండలా జలాశయాలు
-యాసంగిలో ఆయకట్టు సాగుకు నీరు పుష్కలం
- కోతల దశలోనే వరి నారు పెంచాలని సూచన
-అకాల వర్షాలు, వడగండ్లను తప్పించే అవకాశం
-అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధం : డీఏవో

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్‌లో 1,33,572 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఇందులో ముఖ్యంగా వరి 24,827 హెక్టార్లలో, మొక్కజొన్న 46,202 హెక్టార్లలో, శనగలు 55,866హెక్టార్లలో, వేరుశనగ 557హెక్టార్లలో, మిగతా పంటలు 6,120హెక్టార్లలో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలల పాటు వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. జిల్లాకు సంబంధించి ఎస్సారెస్సీ (సరస్వతి కాలువ), గడ్డెన్నవాగు, కడెం, స్వర్ణ ప్రాజెక్టులతో పాటు సదర్మాట్ ఆనకట్ట, ఎత్తిపోతల పథకాలు, చెరువులు, కుంటలున్నాయి. సరస్వతి కాలువ కింద 33,638ఎకరాల ఆయకట్టు ఉండగా.. కడెం ప్రాజెక్టు కింద 60వేల ఎకరాల ఆయకట్టుంది. గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద 14వేల ఎకరాలు, స్వర్ణ కింద 9600ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉండటంతో 40వేల హెక్టార్ల వరకు వరిసాగు అయ్యే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

చేతుకొచ్చే సమయంలో వాటిల్లుతున్న నష్టం
జిల్లాలో ప్రతి ఏడాది జనవరి మాసంలో యాసంగి వరినాట్లు వేస్తుంటారు. దీంతో మే నెలాఖరు వరకు వరి కోతలు కోస్తుంటారు. ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, గాలుల ప్రభావం ఉంటోంది. దీంతో రైతులకు వరి పంట చేతికొచ్చే సమయంలో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. గతంలో ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో నీరు లేకపోవడం, భూగర్భజలాలు ఇంకిపోవడంతో యాసంగిలో వరిసాగు చేయాలా.. వద్దా.. చేసినా కొంతమేర భూమిలో మాత్రమే నాట్లు వేసేవారు. అదీ వానాకాలం సీజన్‌లో వరి కోతలు కోశాక.. వరినార్లు పోసేవారు. యాసంగిలో ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల అవుతుందో.. లేదో.. బోరుబావుల కింద నీరు సరిపోతుందో.. లేదో.. అనే ఆందోళనలో రైతులు ఉండేవారు. వానాకాలంలోనూ ఆలస్యంగా వరినాట్లు వేయడంతో కోతలు డిసెంబరు వరకు ఉండేవి. దీంతో జనవరి నెలలో యాసంగి నార్లు వేయడంతో మే నెలలో పంట చేతికొచ్చేది. అకాల వర్షాలు, వడగండ్లతో పంట చేతికొచ్చే సమయంలో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేది. ప్రతి సంవత్సరం రూ. కోట్ల విలువ చేసే ధాన్యం నేలపాలు అయ్యేది. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయి నష్టం వాటిల్లేది.

నిండుకుండల్లా జలాశయాలు
ఈసారి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లో కురిసిన వర్షాలకు అన్ని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎస్సారెస్పీ పూర్తి మట్టం 1091అడుగులు(90.313 టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 1090.90 అడుగుల మేర నీరు ఉంది. 91.313టీఎంసీల పూర్తిసామర్థ్యం కాగా.. 89.763 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 6240క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. దిగువకు 11500 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.వరద కాలువకు 6వేలు, కాకతీయ కాలువకు 5,500 క్యూసెక్కులు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి మట్టం 700అడుగులు(7.600టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 699.050అడుగులు(7.353టీఎంసీలు) నీరుంది. ఎగువ ప్రాంతం నుంచి 38క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా.. ఎడమ కాలువ ద్వారా 403క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గడ్డెన్నవాగు పూర్తి మట్టం 358.7మీటర్లు(1.852 టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం నిండుగా ఉంది. స్వర్ణ ప్రాజెక్టు పూర్తి మట్టం 1183అడుగులు (1.484 టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 1182.5 అడుగులు (1.429 టీఎంసీలు)నీరుంది. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీరుంది. బోరుబావుల్లో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. వీటికి తోడు జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండుగా ఉన్నాయి. భూగర్భ జలమట్టం పెరగడంతో బోరు, బావుల్లో నీరు పుష్కలంగా ఉంది. దీంతో ప్రాజెక్టుల కింద పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు లేవు.

వరి సాగుకు సంబంధించి ప్రాజెక్టుల కింద నిరంతరం నీరు విడుదల చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తుగా వరిసాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. వానాకాలం వరి కోతలు కోసే సమయంలోనే యాసంగి కోసం నార్లు వేసుకోవాలని పేర్కొంటున్నారు. దీంతో డిసెంబరు 15 నుంచి నెలాఖరు వరకు యాసంగి నాట్లు పూర్తి చేస్తే మార్చి 15 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు వరి కోతలు ముగించేందుకు అవకాశం ఉంటుంది. రైతులకు అవసరమైన సబ్సిడీ వరి విత్తనాలు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. రైతులకు అవసరమైన ఎరువులు సంబంధిత సహకార సంఘాల్లో అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి కోటేశ్వర్‌రావు నమస్తే తెలంగాణతో పేర్కొన్నారు. జిల్లాలో రైతుల కోసం 1650క్వింటాళ్ల వరి విత్తనాలు తెలంగాణ సీడ్ కార్పొరేషన్ వద్ద ఉన్నాయన్నారు. నాలుగు వేల మెట్రిక్ టన్నుల యూరియా, ఆరు వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు వానాకాలం వరి కోతల సమయంలోనే యాసంగి కోసం వరి నారు పోసుకోవాలని.. దీంతో వడగండ్లు, అకాల వర్షాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నందున నిరంతరం నీటి విడుదల ఉంటుందన్నారు. రైతులు వెంటనే వరినార్లు పోసుకోవాలని సూచించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...