పశు సంపదలో వృద్ధి


Mon,November 11, 2019 12:55 AM

-అన్ని రకాల పశువుల్లో 56 శాతం వృద్ధి
-ఆర్థిక స్వావలంబనలో పశుపోషణదారులు
-పాడి పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం

నిర్మల్ టౌన్: జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫాలితాలు ఇస్తున్నాయి. జిల్లాలో గత ఆరేండ్లలో పశు సంపద గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. జిల్లావ్యాప్తంగా సంవృద్ధిగా నీటి వనరులు పశు పోషణకు అవసరమయ్యే బీడు భూములు, పశుగ్రాసం, పశు సంవర్ధకశాఖ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుతో పశు సంపద ప్రతిఏటా పెరుగుతూ వస్తున్నది. దీంతో పశుపోషకులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. జిల్లాలో 70శాతం మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమపై ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం పశువుల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తూ అనేక చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఆరేండ్లకోసారి పశు గణన చేపడుతుండగా.. గత ఆరేండ్లలో జిల్లాలో అన్ని రకాల పశువుల వృద్ధి రేటు పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.

పెరిగిన వృద్ధి రేటు...
జిల్లాలో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో 2012లో 19వ పశు గణన నిర్వహించగా, 2019లో పశు గణన నిర్వహించారు. 2019లోని లెక్కలను పోల్చుకొని చూస్తే అన్ని రకాల పశువుల వృద్ధి రేటు గణనీయంగా పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో మూడు ప్రాంతీయ పశువైద్యశాలతో పాటు మొత్తం 47 వైద్యశాలలు, 15 పారా మెడికల్ వెటర్నటీ దవాఖానలు ఉన్నాయి. జిల్లాలో 19వ పశుగణనతో ఇటీవల పూర్తి చేసిన 20వ పశు గణన లెక్కలతో పోల్చితే పశువుల వృద్ధిరేటు ఈ విధంగా ఉంది. 2012లో 19వ గణన ప్రకారం.. జిల్లాల తెల్లజాతి పశువులు 1,31,280 ఉండగా.. ప్రస్తుతం 1,83,373 చేరుకున్నాయి. అంటే 52,093 పశువులు పెరిగాయి. నల్లజాతి పశువుల విషయానికొస్తే 90,022 పశువులుండగా.. ఇప్పుడు 1,23,567 ఈ సంఖ్యకు చేరుకుంది.

33,445 పశువులు పెరిగాయి. గొర్రెల విషయానికొస్తే 3,35,968 గొర్రలుండగా.. ఇప్పుడు 5,13,687 గొర్రెలు ఉన్నట్లు తేలింది. 1,77,719 గొర్రెల సంఖ్య పెరిగింది. అలాగే 1,05,540 మేకలుండగా.. ప్రస్తుతం 1,44,449 సంఖ్యకు చేరుకున్నాయి. 42,909 మేకలు పెరిగాయి. ఇక కోళ్ల విషయానికొస్తే 1,01,540 నుంచి 4,49,993కు చేరుకోగా.. 3,48,543 కోళ్లు పెరిగినట్లు పశు గణనలో తేలింది. ఇక మిగతా అన్ని రకాల పశువుల విషయానికొస్తే 10,632 ఉండగా.. ఇప్పుడు 20వేల వరకు పెరిగినట్లు అధికారులు లెక్కల్లో నిగ్గు తేల్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పశు గణన అభివృద్ధి సర్వేను పక్కాగా నిర్వహించడంతో జిల్లావ్యాప్తంగా అన్ని రకాల పశువుల్లో వృద్ధి రేటు పెరిగినట్లు తేలింది.

ప్రభుత్వ ప్రోత్సాహం...
పాడి పశు పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది.జిల్లాలోని మారుమూల గ్రామాలు సైతం పశు వైద్యశాలలను ఏర్పాటు చేసి పశువులకు ఏ రోగం వచ్చినా తక్షణం వైద్యం అందించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించడంతో పశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. దవాఖానల్లో వైద్యులతో పాటు రోగాలకు అవసరమయ్యే మందులు, టీకాలు గోపాల మిత్ర ద్వారా వైద్య సేవలందిస్తున్నది. జిల్లావ్యాప్తంగా పశు పోషణే అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం సబ్బిడీపై గొర్రెలను, గేదెలను తెల్లజాతి ముర్రజాతి పశువులను అందిస్తున్నది. 70శాతం సబ్సిడీ ద్వారా ఈ పథకం అమలు చేయడంతో చాలా మంది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనికితోడు పశువుల్లో సీజనల్‌గా వచ్చే వ్యాధుల నియంత్రణకు పశు సంవర్ధకశాఖ నిరంతరంగా వ్యాధి నివారణ టీకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో గాలికుంటు టీకాలు, నట్టల నివారణ, గొంతువాపు వ్యాధి, జబ్బువాపు, చిటికె రోగం వంటి టీకాలను అందుబాటులోకి తెచ్చి ప్రతి పశువుకు ముందుగానే టీకాలు వేస్తున్నది. దీంతో రోగాల బారిన పడకుండా పశువును కాపాడుకునేందుకు ఉపకరిస్తుంది.

ముఖ్యంగా దేశవాలి, గిరిజ రకాలను ప్రోత్సహించడంతో సంకరజాతి పశువుల పోషణపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. గత నాలుగేండ్లలో జిల్లాలో 70శాతం సబ్సిడీపై 6,772 యూనిట్లను పంపిణీ చేయగా, లక్షా 40వేల గొర్రె పిల్లలు ఉత్పత్తి అయినట్టు అధికారులు చెబుతున్నారు.దీనికితోడు పశువులకు అవసరమయ్యే పశుగ్రాసం విత్తనాలు 70శాతం సబ్సిడీపై అందించడమే కాకుండా 50శాతం సబ్సిడీపై దాణాను అందిస్తున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో పశుగ్రాసం పెంపునకు చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సమయంలో వైద్యం అందించేందుకు 1,068 అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చారు. దీంతో ఒక్క ఫోన్ కాల్ ఆధారంగా పల్లెలకు వెళ్లి వైద్యం అందించే పరస్థితి ఏర్పడింది. గత ఐదేండ్లలో పశువుల మరణాల సంఖ్య 60శాతం తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు కృత్రిమ గర్భధారణ చేస్తున్నారు. పాల ఉత్పత్తి పెరగడంతో పశు పోషణ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో చాలా మంది రైతులు పశు పోషణపై ఆసక్తి పెంచుకుంటున్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...