ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా ఆదిలాబాద్ పట్టణంలోని బుక్తాపూర్ కాలనీకి చెందిన బెజ్జంకి అనిల్‌కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు టీటీడీ దేవస్థానం ఈవో నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనిల్‌కుమార్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. ఆయన మరణాంతరం తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అకాంక్షిస్తూ 9 సంవత్సరాల 10 నెలల 28 రోజుల పాటు చెప్పులు లేకుండా దీక్ష చేపట్టారు. ఆదిలాబాద్ నుంచి బాసర సరస్వతి పుణ్యక్షేత్రం వరకు కాలి నడకన పాదయాత్ర చేపట్టారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే తాను పాదరక్షలు ధరిస్తానని ప్రతిన బూనారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా గుర్తింపు పొందిన అనిల్ కుమార్‌కు ఎట్టకేలకు గుర్తింపు వచ్చింది. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలో తెలంగాణ నుంచి నలుగురుకి స్థానం కల్పించగా అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అనిల్‌కుమార్‌కు బోర్డు మెంబర్‌గా పదవిని కట్టబెట్టారు. ఉమ్మడి జిల్లా నుంచి ఈ పదవి అందుకున్న తొలి వ్యక్తి అనిల్ కావడం విశేషం. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ తనను గుర్తించి అరుదైన ఈ బాధ్యతను అప్పగించడంతో సంతోషంగా ఉందన్నారు. బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు.