కురిసిన వర్షం..రైతన్నకు కష్టం!


Sat,October 19, 2019 02:11 AM

-పలు మండలాల్లో పంటల నష్టం
-ఆందోళనలో రైతులు
సారంగాపూర్/మామడ: సారంగాపూర్, మామడ మండలాల్లోని జామ్, సారంగాపూర్, ధనితోపాటు పలు గ్రామాల్లో గురువారం రాత్రి కురిసిన వర్షాలకు సోయాబీన్, వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో దాదాపు 850 క్వింటాళ్ల సోయాబీన్ పంట తడిసి ముద్దయ్యింది. వరి పంట వంద ఎకరాల్లో, పత్తి పంట 30 ఎకరాల్లో నేలకొరిగాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సారంగాపూర్ మార్కెట్ యార్డు, జామ్ కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన సోయాబీన్ పంట వర్షానికి తడిసిపోయి గింజలు నల్లబడి పోయి దుర్వాసన వెదజల్లు తుందని రైతులు అంటున్నారు. తడిసిన పంటను కొనుగోలు చేసి, వరి, పత్తి పంటకు నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పంటల పరిశీలన
మండలంలోని జామ్, సారంగాపూర్ గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న సోయాబీన్, వరి, పత్తి పంటలను శుక్రవారం ఏఈవో అరుణ్‌కుమార్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మహిపాల మురళీకృష్ణ పరిశీలించారు. నష్టంపై సర్వే చేస్తామని ఏఈవో అరుణ్‌కుమార్ తెలిపారు.

కడెం, దస్తురాబాద్ మండలాల్లో..
కడెం/దస్తురాబాద్ : కడెం, దస్తురాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి కురిసిన వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కడెం మండలంలోని పెద్దబెల్లాల్, కొండుకూర్ తదితర గ్రామాలు, దస్తురాబాద్ మండలంలోని ఆకొండపేట గ్రామంతోపాటు ఇతర గ్రామాల్లో పంటలు నేలకొరిగాయి. చేతికందే సమయంలో పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దస్తురాబాద్ మండలంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...