ఇక పట్టణ ప్రణాళిక


Wed,October 16, 2019 12:55 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో సర్కారు ప్రణాళికలు రూపొందిస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన 30 రోజుల గ్రామ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి. ఈ కార్యక్రమం స్ఫూర్తితో పట్టణాల్లో కూడా ఇదే మాదిరిగా.. అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్‌లతో పురపాలక మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ పారిశుధ్యంపై పట్టణ పారిశుద్ధ్య ప్రణాళిక (సిటీ శానిటేషన్ ప్లాన్) తయారు చేయాలని కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.

స్వచ్ఛ సర్వేక్షన్ మార్గదర్శకాల మేరకు...
చెత్త సేకరణ నుంచి రిసైక్లింగ్ వరకు అన్ని వివరాలను ఈ ప్రణాళికలో ఉంచాలి. స్వచ్ఛ సర్వేక్షన్ మార్గదర్శకాల మేరకు పురపాలికల్లో ఉండాల్సిన పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య, వాహనాల సంఖ్య ఉండేలా చూసుకోవాలి. ప్రతి పదివేల జనాభాకు 28 మంది కార్మికులు పనిచేసేలా చూడాలని ఆదేశించారు. ప్రతి 500 ఇండ్లకు ఒక స్వచ్ఛ ఆటో ఏర్పాటు చేసుకోవాలి. ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇప్పటికే పాత మున్సిపాలిటీల్లో స్వచ్ఛ ఆటోలు ఉండగా.. ఇంకా అవసరం ఉంటే వాహనాలను, సిబ్బందిని పెంచుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి యూనిఫాంతో పాటు అవసరమైన రక్షణ సామగ్రిని సమకూర్చాలి. ప్రతి కార్మికుడికీ భవిష్య నిధి, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలను కల్పించేలా ఆయా ఏజెన్సీలను ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం కల్పిస్తున్న బీమా మాదిరే పురపాలక సిబ్బందికీ ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని కల్పిస్తుందని తెలిపారు.

ప్రతి పట్టణానికి ఒక డంప్ యార్డ్...
ప్రతి పట్టణానికీ ఒక డంపింగ్ యార్డ్ ఉండాలి, డంపింగ్ యార్డ్ లేనిచోట స్థల సేకరణకు కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. డెయిలీ సోర్స్ కలెక్షన్ సెంటర్ (డీఆర్‌సీసీ) ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పట్టణం బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) మున్సిపాలిటీలుగా సాధించామని, కొత్తగా మున్సిపాలిటీలుగా మారిన వాటిల్లోనూ ఓడీఎఫ్ సాధించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పట్టణంలో పబ్లిక్ టాయ్‌లెట్స్ నిర్వహణపై దృష్టి సారించి, అవసరమైన చోట్ల మరిన్ని నిర్మాణం చేయాలని సూచించారు. ప్రతి నగరంలో మహిళల కోసం ప్రత్యేక షీ టాయ్‌లెట్స్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లలోని టాయ్‌లెట్స్‌ను ప్రజలు ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు ఆయా యజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వరంగల్, సిరిసిల్లలో మాదిరి ప్రతి పట్టణంలో మానవ వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే లక్ష్యంతో పని చేయాలని సూచించారు. ప్రతి పట్టణానికి సంబంధించిన సమగ్రమైన సిటీ శానిటేషన్ ప్లాన్ తయారు చేసి, వారం రోజుల్లో డైరెక్టర్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్‌కు సమర్పించి, నూతన పురపాలక చట్టాన్ని అమలు చేయడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు.

గ్రీన్ యాక్షన్ ప్లాన్ తయారు...
చట్టంలో పేర్కొన్నట్లుగా గ్రీన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు పురపాలిక బడ్జెట్‌లో పది శాతం నిధులు గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించి, ప్రతి పట్టణంలో నర్సరీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పట్టణంలో లేదా పట్టణాలకు దగ్గరలో గ్రీన్ లాంగ్ స్పేస్ (పెద్ద పార్కులు)లను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాల్లో ఉన్న తాగునీటి వనరుల అడిట్ చేయాలని మంత్రి సూచించారు. కాగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి 36 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డు ఉండగా.. పట్టణంలో గాంధీపార్క్, మావల పార్క్‌లను అభివృద్ధి పరుస్తున్నట్లు కలెక్టర్ దివ్యదేవరాజన్ మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. మున్సిపాలిటీకి మరిన్ని నిధులు సమకూర్చాలని కోరారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, సీడీఎంఏ శ్రీదేవి, వాటర్ వర్క్స్ డైరెక్టర్ దాన కిశోర్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, సహాయ కమిషనర్ రాజు, డిప్యూటీ ఈఈ మధుకర్, సహాయ సిటీ ప్లానర్ భానుచందర్, టౌన్ ప్లానింగ్ అధికారి సుమిత్ర, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

పాఠశాలల్లో సీఎస్‌ఆర్ బృందం తనిఖీలు
తలమడుగు : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను మంగళవారం విద్యాశాఖ రాష్ట్ర సీఎస్‌ఆర్ (కమ్యునిటీ సోషల్ రెస్పాన్స్) బృందం సభ్యులు తనిఖీ చేశారు. పాఠశాలలోని సమస్యలను బృందం సభ్యురాలు, రిటైర్డ్ ఐఏఎస్ ప్రియదర్శిని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించారు. పాఠశాల సమస్యలను గ్రామ సర్పంచ్‌తో పాటు ఉపాధ్యాయులు రాష్ట్ర బృందానికి విన్నవించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ ప్రియదర్శిని మాట్లాడుతూ పాఠశాలలో టాయ్‌లెట్, కంపౌండ్ వాల్ ఏర్పాటుకు సీఎస్‌ఆర్ ద్వారా నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. మిగతా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్త్తామన్నారు. పాఠశాలలో దాతల సహకారంతో పలు వసతులు కల్పించడం అభినందనీయమన్నారు. బృందంలో సభ్యులుగా శ్రావణ్ కూమర్, ప్రభాకర్, వెంకటేశ్ ఉన్నారు. బృందం వెంట సెక్టోరల్ అధికారి కంది శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ కళ్లెం కరుణాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు శ్యాంసుందర్, రత్నాకర్‌రెడ్డి, మురళీ, మచ్ఛేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

పాఠశాలల్లో సదుపాయల కల్పనకు చర్యలు
గుడిహత్నూర్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేస్తామని రాష్ట్ర సీఎస్‌ఆర్ బృందం సభ్యురాలు, రిటైర్డ్ ఐఏఎస్ ప్రియదర్శిని అన్నారు. మంగళవారం గుడిహత్నూర్ మండలం మన్నూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన సీఎస్‌ఆర్ బృందం పాఠశాలలో మౌలిక సదుపాయలను పరిశీలించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌ను వివరాలు అడిగి తెలుసుకున్న బృందం సభ్యులు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సౌజన్యంతో జిల్లాకు 10 లక్షలతో పాఠశాలలో మౌలిక సదుపాయలను కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్ ఇందుమతిని బృందం సభ్యులు చిన్నారులు ఎంత మంది వస్తున్నారని అడిగారు. వారిని వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. బృందం వెంట డీఈవో రవీందర్‌రెడ్డి, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ జిల్లా సూపరింటెండెంట్ శ్రావణ్, ఇన్‌స్పెక్టర్ శ్రావణ్, ఎంఈవో నారాయణ, పాఠశాల చైర్మన్ గోవింద్, ఎంపీటీసీ న్యాను, ఉపాధ్యాయులు ఉన్నారు.

విద్యార్థులకు మౌలిక సదుపాయల కల్పనే లక్ష్యం
ఇంద్రవెల్లి : ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తునే విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని రిటైర్డ్ ఐఏఎస్, సీఎస్‌ఆర్ సీనియర్ కన్సల్టెంట్ ప్రియదర్శని అన్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆమె డీఈవో రవీందర్‌రెడ్డతోపాటు ఇంజినీరింగ్ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. పాఠశాల సమస్యలను ప్రధానోపాధ్యాయుడు గోపాల్‌సింగ్ తిలావత్ వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన కోసం ప్రభుత్వం తన వంతుగా పూర్తి సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పర్యటిస్తూ పాఠశాలల్లో కల్పించే సౌకర్యాలతోపాటు చేపట్టే అభివృద్ధి పనులపై పూర్తి వివరాలను సేకరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన అధికారులు ప్రభాకర్, వెంకటేశ్, శ్రావణ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీహరి, జలేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...